రక్షణ కరువైన సంరక్షకులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘ఆరోగ్య సంరక్షణ కార్మికుల కీలకమైన పాత్రను ఒక మహమ్మారి తెలియజేస్తుంది’ అని అనుకున్న వారంతా మళ్ళీ ఆలోచించే సమయం వచ్చింది. కరోనా వైరస్‌ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో, ఇప్పుడు ముందుండి సేవలందించే (ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌) కార్మికుల అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయినా, ప్రభుత్వ దృష్టి మరెక్కడికో మళ్ళింది. దారుణమైన విషయం ఏమంటే, ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలడం, లేబర్‌ మార్కెట్‌ పరిస్థితులు దిగజారడంతో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని యాజమాన్యాలకు తమ అత్యవసర కార్మికులతో వ్యవహరించే విధానంలో, వారిని ఆదరించడంలో చిరచిరలాడే స్వభావం పెరిగింది. కరోనా మహమ్మారి వలన పెరిగిన నిరుద్యోగం, కార్మికులను ప్రశంసలకు దూరం చేస్తూ, యాజమాన్యాలు కార్మికులను మరింత దోపిడీ చేయడానికి అవకాశం కల్పించింది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం, నిరుపేద సామాజిక సమూహాలు, వలస కార్మికులు, మహిళలు చేసే ప్రతిఫలం లేని, లేక తక్కువ చెల్లింపులు చేసే శ్రమ పైన ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ, అది ఆ పనిని మరుగున పడేసి, పుస్తకాలలో లేకుండా లాంఛన ప్రాయం చేసింది. ఫలితంగా, సామాజిక ఉత్పత్తితో ముడిపడి ఉన్న అనేక భిన్నమైన, కఠినమైన పనులను దాదాపు గుర్తించకుండా, తక్కువ ప్రతిఫలాన్ని, తక్కువ వేతనాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే సంఘంలో, కుటుంబాలలో మహిళలు, యువతులు ఏ విధమైన ప్రతిఫలం లేకుండా సంరక్షణకు సంబంధించిన చాలా పని చేస్తున్నారు. కానీ ఆ పనిని ఎవ్వరూ గుర్తించరు. ఈ పని మార్కెట్‌కు బయట ఉంది కాబట్టి, దానిని ఆర్థిక కార్యకలాపంగా లెక్కలోకి తీసుకోరు.

మహిళలు లేబర్‌ మార్కెట్‌ లోకి ప్రవేశించినప్పుడు, వారి వేతనాలు పురుషుల వేతనాల కన్నా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే, వారు తక్కువ వేతనాలకే పని చేయడానికి ఇష్టపడుతున్నందుకు మాత్రమే కాదు, వారు చేసే చాలా పని ఉచితంగా చేయడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి కూడా. అందుకే మహిళలు ఎక్కువగా పని చేసే సంరక్షణా రంగం లాంటి అనేక వృత్తుల్లో చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తారు. అదే విధమైన పనిచేసే పురుషులు కూడా తక్కువ వేతనాలతో దురవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో, క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన మార్గాలను కనుగొనేందుకు గరిష్ఠంగా చెల్లించబడే ‘వృత్తిదారులుగా’ ఉన్న ప్రత్యేక వైద్యుల నుండి కింది స్థాయి అంటే నర్స్‌, వార్డ్‌ లో పని చేసే బోరు, పారిశుద్ధ్య కార్మికుల వరకు అదనపు వృత్తిపరమైన శ్రేణీగత వ్యవస్థలు (దొంతరలు) ఉంటాయి. ప్రతి వృత్తి లోని లింగ సమతుల్యత (కింది శ్రేణికి పోయిన కొద్దీ) మారడం సహజమైన విషయంగా ఉంటుంది. అంటే కింది శ్రేణిలో మహిళలు ఎక్కువగా ఉంటారు. వారి వేతన చెల్లింపులు మరీ అధ్వాన్నంగా ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా, ఆరోగ్య సంరక్షణా ఉద్యోగాలలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది నర్సులు, మంత్రసానులు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు ఉండగా, చాలా వ్యత్యాసం తో కూడిన వేతన చెల్లింపులు బాగా పొందుతున్న శస్త్ర చికిత్సా నిపుణులు, ఫిజీషియన్లు, దంత వైద్య నిపుణులు, ఫార్మాసిస్టుల లాంటి వారంతా ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఆరోగ్య కార్మికులందరిలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు అత్యంత ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారు. వారు అసలు కార్మికులుగా కాక, ‘వాలంటీర్లు’గా (భారతదేశంలో జరుగుతున్న విధంగా) గుర్తించ
బడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత, అంగీకారయోగ్యమైన వేతనాలు సమకూర్చే అధికార ఒప్పందాల ద్వారా వారు చాలా అరుదుగా లబ్ధి పొందుతారు. ఆరోగ్య సంరక్షణలో రక్షణ చర్యలు కూడా అంతంతమాత్రంగానే పొందుతారు. ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో మహిళా ఆరోగ్య సంరక్షణా కార్మికులు మరింత అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ సోకిన వారికి భౌతికంగా దగ్గరగా ఉండి సేవలు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత కొంత కాలం ఈ ఆరోగ్య సంరక్షకులు సమాజానికి అందిస్తున్న కీలకమైన సేవలను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బాల్కనీల నుండి వారిని కీర్తిస్తూ పాటలు పాడడం, ఆసుపత్రుల బయటి నుంచి పూల జల్లులు కురిపించడం ద్వారా అత్యవసర కార్మికులను ప్రశంసించారు.

అన్ని స్థాయిల్లోని ఆరోగ్య సంరక్షణా కార్మికులను ‘హీరోలు’ గా కీర్తించారు. అది వారి ప్రతిఫలం యొక్క పరిధిని ప్రతిబింబించినట్లు కనపడుతుంది. ఆరోగ్య కార్మికుల బహిరంగ ప్రశంస, పని చేసే ప్రాంతంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను మెరుగుపరచడం లేదా వేతనాల పెంపుదల లాంటి మార్పులను మాత్రం చేయలేదు. మహమ్మారి వ్యాప్తి కాలంలో వారి భౌతిక సంరక్షణకు అవసరమైన హామీల అమలుకు ఏ విధమైన ప్రయత్నాలు జరగలేదు.

ఉదాహరణకు, అమెరికాలో కొన్ని కంపెనీలు తమ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు పెంచిన వేతనాలను కొద్ది కాలానికే, అంతకు ముందు ఇస్తున్న వేతనాలను, కొన్ని సందర్భాల్లో అంతకన్నా తక్కువ వేతనాలను ఇచ్చారు. అదేవిధంగా బ్రిటన్‌ లో ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌, కోవిడ్‌-19 తో ఆసుపత్రి పాలైనపుడు తన ప్రాణాలను కాపాడిన విదేశీ నర్సులు-జెన్నీ (న్యూజిలాండ్‌), లూయీస్‌ (పోర్చుగల్‌) లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కానీ వారి ఇమ్మిగ్రేషన్‌ (విదేశాలకు వలస వెళ్ళేందుకు) ఫీజు పైన సర్‌చార్జీ విధించడంలో మాత్రం ఏవిధమైన వెనకడుగు వేయలేదు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయాలు పడిపోవడంతో ప్రభుత్వం కోవిడ్‌-19 రహిత ఆరోగ్య ఖర్చులలో కోతలు, వేతన చెల్లింపుల్లో కోతల విధింపు, ఆరోగ్య సంరక్షణా కార్మికులకు సుదీర్ఘ పని గంటల పెంపు, వ్యక్తిగత సంరక్షణా పరికరాల కొనుగోలు ఖర్చు లేకుండా చేయడం ద్వారా కఠినమైన చర్యలను అమలు చేస్తుంది. దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీ, మాంద్యం ఉన్న సమయంలో ప్రభుత్వం ఈ చర్యలను అమలు చేయడం ఎంత వరకు సమంజసం?

అత్యవసర కార్మికుల పట్ల అధికారులు అక్రమమైన పద్ధతిలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడంతో, భారత దేశంలో డాక్టర్లు, నర్సులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో లో ఆరోగ్య సంరక్షణా కార్మికులు వేతనాలు లేకుండా కొన్ని నెలల పాటు పని చేసిన తర్వాత సమ్మె లోకి వెళ్ళారు. ఆ రకంగా తక్కువ వేతనాలతో పని చేస్తున్న, నిస్సహాయ స్థితిలో ఉన్న పారిశుధ్య కార్మికుల అవసరాలు ఒక క్రమపద్ధతిలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

దశాబ్దాల ప్రభుత్వ నిర్లక్ష్యం, అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయకపోవడం వల్ల మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ), ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే కారణాలేవీ తక్కువ వేతనాలతో పనిచేసే అత్యవసర కార్మికులను సామాజికంగా, రాజకీయంగా నిరాదరణకు గురిచేయడానికి ఆమోద యోగ్యమైనవికావు. మన సమాజంలు మనుగడలో ఉండాలంటే, ఏదో ఒకటి మనను కదిలించాలి. అత్యవసర సంరక్షణ కార్మికులకు నిజ వేతనాలు, రక్షణ పొందే యోగ్యత వుంది. వారికి మాట సహాయం అవసరం లేదు. వారు సురక్షితంగా ఉండడానికి మన ప్రశంసలు సరిపోవు.

జయతీ ఘోష్‌

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates