ఉద్యమాల రూపశిల్పి ఉసా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దళిత బహుజనోద్యమ మూసా. కంచికచర్ల, కారంచేడు, వేంపెంట, లక్ష్మీపురం, గరగపర్రు, ఇంకా ఈనాటి దాకా ఎందరో ఉద్యమకారులు పుట్టారు. బహుజనోద్యమ దీపస్తంభాలుగా నిలిచారు. డా. బాబా సాహెబ్ శత జయంతి (1991) మొత్తం భారత దేశంలోనే దళిత చైతన్యం ప్రజ్వరిల్లింది. దళిత బహుజన అధికారులు అందివచ్చారు. అంబేడ్కర్ గొప్పదనాన్ని ఆయన ఆశయాలను బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఇక సాహిత్య పరంగానైతే వామపక్షాల లోంచి ఎందరో దళిత మేధావులు కవి గాయక కళాకారులు ముందుకొచ్చారు. అటువంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాడు ఉసా. గొప్ప తాత్వికుడు. భావుకుడు. ఉపన్యాసకుడు. ఉద్యమాల రూపశిల్పి.

1995లో అనుకుంటాను వినుకొండలో జాషువ శత జయంతి ఉత్సవాల మేళా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మాన్య శ్రీ కాన్షీరాం పాల్గొన్నారు. అప్పుడు నీలి రంగులో ఉన్న IRS అధికారి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఢిల్లీ నుంచి కన్షీరాం గారిని హెలికాప్టర్ లో తెచ్చారు. ఆ సదస్సులో ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, బిఎస్ రాములు, ప్రొఫెసర్‌ ననుమాస స్వామి, మాస్టార్జీ , ఎవై ప్రభుదాస్, డప్పు ప్రకాష్, ఖాజా, వినోదిని ఇంకా చాలామంది పాల్గొన్నారు. ఆ మధ్యాహ్నం దళిత బహుజన సాహిత్య సభ జరిగింది. దళిత మహా సభ వ్యవస్థాపక నాయకుడు కత్తి పద్మారావు గారు అధ్యక్షుడు. ఆ రోజు చాలా పుస్తకాల్ని ముఖ్య అతిధి కాన్షీరామ్ గారు ఆవిష్కరించారు. అందులో నా ‘కొత్త గబ్బిలం’ ఒకటి. ఆ తర్వాత రోజు జరిగిన సదస్సులో ఉసా గారు బహుజనోద్యమ ప్రణాళికను కాన్షీరామ్ రాజకీయ వ్యూహాలను చర్చించారు. ఒకరకంగా ఆయన మాటల నిండా బహుజన మానిఫెస్టో మారాకు తొడిగింది. అప్పటికింకా మారోజు వీరన్న ఆలోచనా విధానం స్పష్టమైన రూపు దాల్చ లేదు. ఆ తరువాత బహుశా అదే సంవత్సరం అనుకుంటాను కోదాడలో జూలూరి గౌరీశంకర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున రెండు రోజుల సాహిత్య సభలు జరిగాయి. పుట్టుమచ్చ ఖాదర్, ‘ఉద్యమం నెలబాలుడు ‘శివసాగర్, బియస్ రాములు తో పాటు ఉసా అఫ్సర్, ప్రసేన్, సీతారాం, యాకూబ్, శిఖామణి, మద్దూరి కూడా పాల్గొన్నారు. ఆ రోజు ఎన్నో అమూల్యమైన విషయాలన్నీ ఉసా తన ఉపన్యాసంలో చర్చించారు. ఆ సభలో కూడా పది పన్నెండు పుస్తకాలు అవిష్కరింపబడ్డాయి. ఎదురీత పత్రికా నాయకుడిగా ఉసా విలువైన సంపాదకీయాలతో పాటు ఎందరో దళిత కవుల్ని ప్రోత్సహించాడు. ఆయన నేనూ ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన సెమినార్ ల లోనూ జాషువా సభల్లోనూ పాల్గొన్నాం.

ఆయన పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదు. గద్దర్ శివసాగర్ లతో సమానంగా పాటలు రాశాడు. ‘ ఊరు మనది రా ‘ రచయిత అంజయ్య లాగే ఆయన ఉదాసీనంగా ఉండిపోయాడు. బహుశా ఉద్యమాల సారధులకి తమ పేరు గురించిన తపన ఉండదేమో. ఉసా నిలువెల్లా నిబద్ధుడు. ఆయన భావజాలమే బహుజన వికాస వారసత్వం. ఆయన అక్షరాలనూ, పాటలనూ మాటలనూ కాపాడుకోవడమే మన కర్తవ్యం. అదే మనం ఆయనకు ఇచ్చే నివాళి.

– ఎండ్లూరి సుధాకర్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

RELATED ARTICLES

Latest Updates