ఉ.సాంబశివరావు వొక తత్త్వగీతం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తత్త్వవేత్తలు ప్రపంచాన్ని ఇప్పటికే వ్యాఖ్యానించారు. మనం చేయాల్సిందల్లా దాన్ని మార్చడమే అని మర్క్స్ చెప్పిన మాటను నిజం చేయడానికి అన్ని దేశాల్లోని ప్రజలు ప్రయత్నం చేస్తూనే వున్నారు. అసమానతలు, దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించడానికి ఎంతో మంది బుద్ధిజీవులు నాయకులూ పోరాడుతూనే వున్నారు. వలస పాలన కాలంలో మన దేశంలో మొదలైన కమ్యూనిస్టు ఉద్యమం శైశవ దశను దాటింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోటే. ఆ పోరాట విరమణ అనంతర కాలంలో సమాజం, కమ్యూనిస్టులు ఎదుర్కొన్న సంక్షోభం నుండే కొత్త పోరాటం రూపొందుతో వచ్చింది. కమ్యూనిస్టులు రెండుగా చీలిపోయారు. అతితక్కువ కాలంలోనే నక్సల్బరీ పోరాటంతో మరొక ముఖ్యమైన సాయుధ ఉద్యమం మొదలైంది. నక్సల్బరీ పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా అంగీకరిస్తారు. నక్సల్బరీ పోరాటానికి తెలుగు భూమి అమితంగా స్పందించింది. చారు మజుందార్ మార్గంలో అడుగులేసింది.

తరిమెళ్ళ నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, ఆ తర్వాతి తరం అంతా తెలుగు వాళ్లే నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపారు. నేటికీ నడుపుతున్నారు. ఈ వామపక్ష ఉద్యమం చాల మంది మేధావులను కవులను రచయితలకు జన్మనిచ్చింది. వర్గ దృక్పథం ఒక సార్వజనీన ఆలోచనా విధానంగా మలిచింది. అలా ఉద్భవించిన అతిముఖ్యమైన వాళ్లలో యూ.సాంబశివరావు ఒకరు. విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మార్క్సిజం అధ్యయనం చేసాడు. పెద్ద నాయకులతో సన్నిహితంగా పనిచేసాడు. చిన్న వయసులోనే తత్త్వశాస్త్రం ఒంట పట్టించుకున్నాడు. సమాజాన్ని మార్చడానికి అంకితమయ్యారు. పుట్టింది గుంటూరు జిల్లాలోనే అయినా తాను రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెలో పనిచేసాడంటే అతిశయోక్తి కాదు.

వర్గ దృష్టితో ప్రపంచాన్ని అర్థం చేసుకొని, అదే దృక్పథంతో ఇండియాను అసమానతలు లేని సమాజంగా మార్చడానికి సిద్ధాంత చర్చలో మాత్రమే మునిగి తేలకుండా ఆచరణలో నిమగ్నమైన వ్యక్తి ఉ సాంబశివరావు సార్. అధ్యయన జ్ఞానం ఆచరణ జ్ఞానం రెండిటి మేళవింపు ఆయన. ఆ రెండిటిని సమన్వయము చేసుకొంటూ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అయన తోడ్పడ్డాడు. అందుకే ఆయన ప్రసంగాల్లో గాఢత, తీక్ష్ణత కనిపిస్తాయి. వర్గదృష్టిలోని పరిమితులను గమనించే సందర్భాలను సమాజమే కల్పించింది. కారంచేడు మాదిగల ఊచకోత సమాజంలోని కుల సమస్యను ముందుకు తెచ్చింది. అంటే అప్పటిదాకా కమ్యూనిస్టు ప్రభావంలో వుండి బాబాసాహెబ్ అంబెడ్కర్ రచనలు కూడా చదవని నాయకులు ఆ సంఘటనతో చదవడం మొదలెట్టారు. యూ.సాంబశివరావు కూడా ఫూలే అంబేద్కర్లను చదివడం మెదలెట్టాడు. తన దృక్పథం విశాలమవడం మొదలైంది. కుల హింసను వర్గ కోణం నుండి పరిశీలించడం గాక, కుల నిర్ములనా కోణం నుండి పరిశీలించాలని అయన అర్థం చేసుకున్నారు. కుల సమస్యను వర్గ చట్రంలో విశ్లేషించే సాంప్రదాయ మార్క్సిస్ట్ పద్ధతిలోని పరిమితులు అయన గమనించి, కుల సమస్యను విశ్లేషించే కులవర్గ మెథడాలజీని అయన అభివృద్ధి చేశాడు. ఇది ఉ .సాంబశివరావు సైద్ధాంతిక రంగానికి చేసిన చేర్పు. మార్క్సిజం అంబేద్కరిజం రెండిటి జమిలి అవగాహనతో కులవర్గ జమిలి పోరాటం ఆయన ప్రతిపాదించాడు. మరోజు వీరన్న జనశక్తి పార్టీలో చేస్తున్న సైద్ధాంతిక పోరాటానికి తన ఆలోచనల ద్వారా బలాన్ని ఇచ్చాడు. శరద్ పాటిల్ నాయకత్వంలోని సత్యశోధక్ కమ్యూనిస్ట్ పార్టీతో చర్చలు జరిపాడు. దేశమంతా అనేక సభల్లో పాల్గొని తన ఆలోచనలను ప్రకటించాడు. వీరన్న భూటకపు ఎన్కౌంటర్ లో హత్యకావడంతో పెద్ద నష్టం జరిగింది.

ఉ.సాంబశివరావు గొప్ప ప్రజాస్వామికవాది. అలా అని ఉదారవాద ప్రజాస్వామికవాది అసలే కాదు. నిఖార్సైన సామజిక ప్రజాస్వామికవాది. ఆలోచనల్లో ప్రజాస్వామికతను,వ్యక్తీకరణలో ప్రజాస్వామికతను కోరుకున్న వ్యక్తి. ఎదురీత పత్రిక నిర్వహణలోనూ, అందులో అచ్చేసే రచనలలోనూ అయన సామజిక ప్రజాస్వామిక సూత్రాన్నే పాటించారు. అంబేద్కరిజం మీద రంగనాయకమ్మ విషపూరితమైన రాతలు రాసినప్పుడు సత్యమూర్తితో కలిసి ధీటుగా సమాధానం ఇచ్చాడు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా అనేక రచనలు చేసాడు. వందలాది సభల్లో ఆలోచనాత్మక ప్రసంగాలు చేసాడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో సామజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం బహుజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చాడు. ఆంధ్ర ప్రాంత ప్రగతిశీల బహుజన నాయకులను, మేధావులతో కలిసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టాడు. కార్మిక హక్కుల కోసం పోరాడాడు. వ్యవసాయ కూలీల ఉద్యమం నిర్మించాడు. పేద మధ్యతరగతి రైతు ఉద్యమం నిర్మించాడు. మహబూబ్ నగర్లో కరువు శిబిరాలు నిర్వహించాడు. శ్రామిక మహిళా ఉద్యమం కోసం పనిచేసాడు. స్త్రీవాద ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. జెండర్ అసమానతలకు వ్యతిరేఖంగా పోరాడే మహిళలకు వెన్నుదన్నుగా ఉన్నాడు. సవరణ స్త్రీవాదానికి దళిత స్త్రీ వాదానికి వైరుధ్యం తలెత్తినప్పుడు దళిత స్త్రీ వాదుల పక్షం వహించాడు. యాభైయేళ్లలో ఏ ప్రభుత్వంతో తాను రాజీ పడలేదు. ఎన్టీరామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీయార్, జగన్ రెడ్డి ప్రభుత్వాల విధానాలను అయన కులవర్గ దృక్పథం నుండే విమర్శించాడు.

హిందుత్వ ఫాసిజంతో పోరాడే క్రమంలో అందరికి స్ఫూర్తిదాయకమైన వైఖరి తనది. బాబ్రీ మస్జీద్ విద్వంసం జరిగినప్పుడు, లౌకిక వ్యవస్థ రక్షణ, ముస్లిం మైనారిటీల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పనిచేసాడు. దేశవ్యాప్తంగా హిందుత్వ శక్తులు ముస్లిముల మీద హింసాకాండ తలపెట్టినప్పుడు పాతబస్తీలో కొత్తబస్తిలో సామరస్యం కోసం పని చేసాడు. మోడీ ప్రభుత్వం గుజరాతులో రెండు వేల మంది ముస్లింల ను ఊచకోత కోసినప్పుడు అయన తీవ్రంగా చలించి పోయాడు. మోడీ ప్రధాని కాకూడదని, ప్రజలంతా బిజెపిని ఓడించాలని పిలుపిచ్చాడు. మోడీ ప్రధాని అయ్యాక మేధావుల హత్యలు మొదలయ్యాయి. గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలను ఖండిస్తూ సభలు నిర్వహించాడు.

కంచ ఐలయ్య సామజిక స్మగ్లరులు కోమ ట్లు పుస్తకం గురించి వివాదం రేగి, ఐలయ్యను చంపుతామని బెదిరించినప్పుడు నేను బహుజన ప్రతిఘటన వేదిక ఏర్పాటు చేసి, “గౌరీ లంకేశ్ హత్యను ఖండిద్దాం కంచె ఐలయ్యను కాపాడుకుందాం” అనే నినాదంతో పెద్ద సభను హైదరాబాద్ లో ఏర్పాటు చేసాను . ఆ సభలో ఉ సాంబశివరావు పాల్గొని ఉత్తేజకరమైన ప్రసంగం చేసారు. ఆ తర్వాత బహుజన ప్రతిఘటన వేదికకు ఆయన కన్వీనర్, నేను కోకన్వీనర్ గా పని చేసాం. బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో చలో అభంగపట్నం పిలుపు ఇచ్చాము. అభంగపట్నంలో దళితులను అవమానించిన భరత్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు ఆ పోరాటం నడిచింది. నేరెళ్ల, అభంగపట్నం బాధితులకు మద్దతుగా హైద్రాబాద్లో పెద్ద సభ నిర్వహించాము. అలాగే హన్మకొండలో పెట్టిన సభకు తానే ముఖ్య అతిధి. నేను పాలకుర్తిలో ఎమ్మెల్యేగా పోటిచ్చిస్తున్న అనగానే నాకు మద్దతు ఇచ్చాడు. నన్ను పిలిచి తన ఛానల్ లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసాడు. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో, గూడూరు గ్రామంలో శుశ్రుత, దేవాన్షులను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రమేష్ చంపి బూడిద చేస్తే, వాణ్ని, వాడి బాబాయి ఆ గ్రామా సర్పంచ్ మాచర్ల పుల్లయ్యను అరెస్ట్ చేసే వరకు పోరాడిన గొప్ప విప్లవకారుడు.

ఉస్మానియా విద్యార్థులు సాంస్కృతిక ప్రజాస్వామ్యం, ఆహార ప్రజాస్వామ్యం కోసం పోరాడితే, వాళ్ళ వెంటే నిలబడ్డాడు. ఇలా లెక్కలేనన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు రచనలు చేసిన వ్యక్తి తో మనకు పరిచయము, సాన్నిహిత్యం ఉందంటే గొప్ప గర్వం కలుగుతుంది. అన్ని తరాలతో కలిసి పనిచేసిన గొప్పతనం తనది. అలాంటి ఒక గొప్ప మహానుభావుడు ఉ సాంబశివరావు ఇక లేడని అనుకోవడమే కష్టంగా ఉన్నది. అయనకు నా కన్నీటి నివాళి.

డాక్టర్‌ జిలుకర శ్రీనివాస్

RELATED ARTICLES

Latest Updates