పల్లె మారింది.. గ్రామాల్లో కొత్త మనుషుల సందడి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనాతో పట్నం నుంచి తిరుగు వలసలు
షార్ట్‌లు, టీషర్ట్‌లతో యువత పొలం పనుల్లో
శివార్లలో మార్నింగ్‌వాక్‌లు, వ్యాయామాలు
దుకాణాల్లో పెరిగిన గిరాకీ.. షావుకార్లకు పండగ
లాక్‌డౌన్‌ కొందరికి మోదం, ఇంకొందరికి ఖేదం
పట్నంలో ఆటోవాలాలు పల్లెల్లో కూలీలుగా..
వ్యవసాయ, ఉపాధి పనులకు పెరిగిన తాకిడి
‘వర్క్‌ ఫ్రం హోం’ఆస్వాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు
ఉద్యోగాలు వదిలేసి సాగులో ఇంకొందరు

చెట్ల కింద ల్యాప్‌టాప్‌లతో..
ములుగు మండలం మాధవరావుపల్లెకు చెందిన విష్ణువర్ధన్‌, వరుణ్‌ కవలలు. వీరు హైదరాబాద్‌లో ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలక్రితం ఇంటికి వచ్చిన విష్ణు, వరుణ్‌ ఇక్కడి నుంచే ఆఫీసు పనులు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నగర జీవితానికి అలవాటుపడ్డ అరుణ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా ఇదే గ్రామంలోని తన అత్తవారింటికి వచ్చి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ముగ్గురూ చెట్టుకింద చేరి తమ ల్యాప్‌టా్‌పల ద్వారా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా మల్లంపల్లికి చెందిన నర్సయ్య కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భార్యాపిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చారు. తనకున్న ఆరెకరాల పొలంలో సాగు పనులు మొదలుపెట్టాలనుకున్నారు. శివారుకు వెళ్లి పొలం వద్ద పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. నర్సయ్యకు రెండువైపులా ఉన్న ఇద్దరు రైతులు తన కమతం నుంచి చెరో ఎకరం దాకా కబ్జా చేసినట్లు గుర్తించారు. ఇన్నాళ్లుగా తాను పట్నంలో ఉండిపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి తన భూమిని కొలిపించే పనిలో పడ్డారు.

నారాయణపేట రూరల్‌ మండలం అమ్మిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్‌.. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడితో బతుకుదెరువు కోసం తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌కు వచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ ఆటో తోలుతూ రోజుకు రూ.1000 దాకా సంపాదించేవాడు. కరోనా దెబ్బకు కుటుంబసభ్యులతో కలిసి సొంతూరుకు చేరుకున్నాడు. ఉన్న ఇల్లు కూలిపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం చాయ్‌ దుకాణం పెట్టుకున్నాడు.

వికారాబాద్‌ జిల్లా కామునిపల్లె తండాకు చెందిన శంకర్‌, ముంబైలో తాపీ మేస్త్రీ. రోజుకు రూ.1000 దాకా గిట్టుబాటయ్యేది. మూడు నెలల క్రితం సొంతూరుకొచ్చేశారు. ఊర్లోనే మేస్త్రీ కింద కూలీగా పనిచేన్నారు. రోజుకు రూ.500 కూలీ ఇస్తున్నారని చెప్పారు.

వరంగల్‌ జిల్లా గీసుకొండకు చెందిన ప్రవీణ్‌, హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. లాక్‌డౌన్‌ నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదు. వర్క్‌ ఫ్రం హోంకు కంపెనీ అనుమతి ఇవ్వడంతో సొంతూరుకు వచ్చేశాడు. తల్లిదండ్రుల వద్ద ఉండటం, పల్లె వాతావరణం మధ్య ఇంటి నుంచే పనిచేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పాడు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా కాట్రపెల్లికి చెందిన రాంపల్లి అఖిల్‌ ఎంఎ్‌ససీ ఆర్గానిక్‌ కెమిస్టీ్ట్ర చేసి, చెన్నై క్యాంప్‌సలో రూ.75వేల జీతానికి ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. కరోనాతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంతూరుకొచ్చి పొలం పనులు చూసుకుంటున్నాడు.

..ఇలా నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు ఎంతోమంది హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేసి పుట్టి పెరిగిన ఊర్లోనే బతుకుదెరువును వెతుక్కుంటున్నారు. భూములున్న వారు.. వానాకాలం సీజన్‌ కావడంతో బీళ్లను దున్ని యవుసం పనిలో పడ్డారు. చాలామంది ఉపాధి కూలీలుగా మారారు. ఇంకొందరు చిన్న చిన్న కిరణాషాపులు, టీ కొట్లు వంటివి పెట్టుకున్నారు. పట్నంలో ఉండలేక వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఇతర ప్రైవేటు ఉద్యోగులు, ల్యాప్‌టా్‌పల ముందు కూర్చొని ‘వర్క్‌ ఫ్రం హోం’ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో పల్లెల్లో బోసిపోయిన వీధులన్నీ కొత్త మనుషులతో సందడిగా కనిపిస్తున్నాయి. బైక్‌లే పెద్దగా కనిపించని ఊర్లలో కార్లు తిరుగుతున్నాయి. గ్రామ శివార్లే జిమ్‌ సెంటర్లయ్యాయి. శివారు రోడ్లపై, చెరువు గట్లపై యూవత వాకింగ్‌, వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. వస్త్రధారణలోనూ పట్నం ఛాయలు కొట్టొస్తున్నాయి. గల్లీలు, పొలాల వద్ద లుంగీలతో కనిపించే మనుషుల మధ్య నిక్కర్లు (షార్ట్స్‌), టీషర్ట్స్‌ ధరించినవారు కనిపిస్తున్నారు.

దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. లూజ్‌ చాయిపత్తి దొరకడమే కష్టమైన షాపుల్లో కూడా వివిధ కంపెనీలకు చెందిన టీ పొడులు దొరుకుతున్నాయి. వివిధ బ్రాండ్‌లకు చెందిన టూత్‌పే్‌స్టలు, విభిన్న కంపెనీలకు చెందిన కూల్‌డ్రింక్‌లు, స్నాక్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. పట్టణాల్లో గడిపిన వారి అవసరాలను గుర్తించి సావుకారి, తన షాపులో అన్ని వస్తువులు పెడుతున్నారు. గతంలో అమ్మని రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు, నూడుల్స్‌ తదితర వస్తువులను షాపులకు తెచ్చి అమ్ముతున్నారు. మటన్‌, చికెన్‌, మద్యం అమ్మకాలు దండిగా పెరిగాయి. స్మార్ట్‌ ఫోన్‌, నెట్‌ వినియోగించేవారి సంఖ్య పెరిగింది. ప్రైవేట్‌ బడులు, ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టడంతో పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు కొనిస్తున్నారు. సినిమా థియేటర్‌లు మూతపడడం వల్ల టీవీ, వెబ్‌ సీరియల్స్‌ చూసేవారి సంఖ్య పెరిగింది. ఫోన్‌ల రీచార్జీకి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. దీంతో పల్లెలు కొత్తగా కనిపిస్తున్నాయి.

వలసలకు నెలవుగా చెప్పుకొనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ తిరుగు వలసల ప్రభావం ఎక్కువగా ఉంది. నారాయణపేట జిల్లా నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, పుణె వంటి నగరాల్లో భవన నిర్మాణాల్లో పనిచేసేందుకు పోయిన వారు, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో ఇటుక బట్టీలకు పోయిన వారు సొంతూర్లకు తిరిగొచ్చేశారు. ఈ సంఖ్య 25వేల దాకా ఉండొచ్చని అంచనా. మక్తల్‌ మండలం మాద్వార్‌ గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్‌ పదేళ్లుగా భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఓ కారు కొనుక్కొని ఓ క్యాబ్‌ సేవల కంపెనీలో పెట్టారు. నెలకు రూ.30వేల దాకా సంపాదించేవాడు. కరోనాతో ఉపాధి దెబ్బతినడంతో కుటుంబంతో మాద్వార్‌కు తిరొగిచ్చి ఉపాధి కూలీగా మారాడు. ఆయనకు ఇప్పుడు నెలకు రూ.6వేలు వచ్చే పరిస్థితి కూడా లేదు. జిల్లాలోని బైరంపల్లికి చెందిన ఉప్పరి రాములమ్మ, పుణెకు వెళ్లి కూరగాయల వ్యాపారం చేసేవారు. రోజుకు రూ.400 దాకా గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడామె స్వగ్రామానికి వచ్చి ఉపాధి పనులకు వెళుతున్నారు. రోజుకు రూ.200 వచ్చే పరిస్థితి కూడా లేదని వాపోయారు.

సాఫ్ట్‌వేర్‌ పల్లెలు
మునుపెన్నడూ లేనివిధంగా పల్లెలకు ‘సాఫ్ట్‌వేర్‌’ కళ్ల వచ్చింది. లాక్‌డౌన్‌ అమలు తర్వాత దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహించాయి. దీంతో ఐటీ ఉద్యోగులంతా సొంతూర్లకు వచ్చేశారు. మూడు నెలలుగా ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌తో మొదలయ్యే పని రాత్రి వరకు కొనసాగుతోంది. కొందరు నైట్‌షిఫ్ట్‌ కూడా చేస్తున్నారు. పండుగలకు పబ్బాలకు కూడా ఇంటికి రాని పిల్లలు ఇప్పుడు నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటుండటం, ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనుల్లో కూడా ఆసరా అవుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌కు చెందిన కె.అభిలాశ్‌ మూడు నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోని ఓరాకిల్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు సొంతూరుకొచ్చి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంటి వద్ద కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా కుటుంబ సభ్యుల మధ్య ఉండి పని చేయడం సంతోషంగానే ఉందని చెప్పారు.

ఉండబట్టలేక బోరు వేసి
తాండూరు పట్టణంలో మొబైల్‌షాపు నడుపుతూ ఎప్పుడూ బిజీగా ఉండే రాకేశ్‌, కరోనాతో బిజినెస్‌ డల్‌గా మారడంతో కుటుంబంతో కలిసి స్వగ్రామమైన చెంగోల్‌కొచ్చారు. 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఖాళీగా ఉండటం ఎందుకని.. బీడుగా ఉన్న తన ఆరెకరాల భూమిపై దృష్టిపెట్టారు. వర్షాలు పడటంతో భూమిని ట్రాక్టర్‌తో చదును చేసి, బోరు వేయించారు. పుష్కలంగా నీరు పడటంతో తుకం చల్లి.. వరినాట్లు కూడా వేశారు. ఎన్నడూ వ్యవసాయంపై ఆసక్తి చూపని రాకేశ్‌, కరోనా ప్రభావంతో సిని ఫక్కీలో తన లైఫ్‌స్టయిల్‌నే మార్చేసుకున్నారు. వ్యవసాయంపైనే మక్కువ పెంచుకుని వ్యాపారం కంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

వ్యవసాయ పనుల్లో ఫార్మసీ ఉద్యోగి
ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొండ్రుపాడుకుచెందిన కొమ్మినేని కృష్ణారావు చెన్నైలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెన్నై నుంచి కుటుంబంతో వచ్చారు. ఉద్యోగానికి వేళ్లే పరిస్థితి లేకపోవంతో ఇంటివద్దే ఉండి తండ్రికి సహాయం చేస్తున్నారు. తమకున్న నాలుగు ఎకరాల్లో సాగు పనులు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదని కొంతకాలం పాటు వ్యవసాయం చేస్తానని ఆయన చెప్పారు.

టీకా వచ్చినా బెంగళూరుకు వెళ్లను
నాది నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్‌. బెంగళూరులో ప్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మూడేళ్లుగా పనిచేశాను. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో ప్రింటింగ్‌ ప్రెస్‌ మూతపడింది. గత మార్చిలో మా ఊరికి తిరిగొచ్చి కొన్నాళ్ళు మిత్రులతో సరదాగా గడిపాను. తర్వాత ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయానికొచ్చి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను పెట్టాను. ఈ ఉపాధితో కుటుంబానికి ఆసరా అవుతనున్నాను. కరోనాకు టీకా వచ్చినా మళ్లీ బెంగళూరుకు వెళ్లదలచుకోలేదు.
బెడ్డ ప్రేమ్‌సాగర్‌, అబ్దుల్లాపూర్‌

ముంబైలో రిలయన్స్‌ ఉద్యోగి.. ఊరిలో వ్యవసాయ కూలీ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారంకు చెందిన ఇక్కుర్తి రాజశేఖర్‌ దాదాపు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబై వెళ్లారు. అక్కడ రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవారు. జీతంగా నెలకు రూ.30వేలు వచ్చేది. మార్చిలో ఉద్యోగం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సొంతూరుకు చేరుకున్నారు. తనకున్న ఎకరం పొలాన్ని సాగు చేసుకుని, ఇతర రైతుల వద్ద వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఇంటర్‌ మాత్రమే చదవిన తనకు ముంబైలో ఉద్యోగం ఎంతో భరోసాగా ఉండేదని, కరోనా రూపంలో ఉపద్రవం వచ్చిపడటంతో ఊర్లో కూలీ పనులు చేయక తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జొన్నరొట్టె, గట్టి పప్పు
పట్నం నుంచి పల్లెలకొచ్చిన ప్రజల ఆహార అలవాట్లూ మారాయి. పొద్దున లేవగానే ఇడ్లీ, దోసె, పూరి వంటి టిఫిన్లు తినే యువత, పిల్లలు.. ఇప్పుడు గట్టిపప్పుతో వేడివేడి జొన్నరొట్టెలు తింటున్నారు. వర్షాలు మొదలయ్యే ముందు వరకూ పెద్దగా అలవాటు లేని తైద అంబలినీ తాగారు. పట్నంలో పుట్టి, అక్కడి వాతావరణానికి అలవాటు పడిన పిల్లలకు పల్లెందాలు కట్టిపడేస్తున్నాయి. పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి మధ్య పొలాల గట్ల మీద తిరుగుతూ వ్యవసాయ పనుల్లో పెద్దవాళ్లకు తోడుగా ఉంటున్నారు. పరిశుభ్రతపై ఇంట్లోవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లలో శానిటైజర్‌, హ్యాండ్‌ వాష్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని పెద్దవాళ్లకు చెబుతున్నారు. బయటకు వెళితే మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. గ్రీన్‌ టీతో పాటు అల్లం, శొంఠి, దాల్చిన చెక్క, ,నిమ్మ రసంతో తయారైన టీలు తాగాలని సూచిస్తున్నారు.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates