గ్రేటర్‌లో బేరానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మొదటి దశలో గచ్చిబౌలి
– పదెకరాలు విక్రయం
– 60 క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని సిబ్బందికి నోటీసులు
– స్థలం విలువ రూ.1500 కోట్లు
– రెండో దశలో టెలిఫోన్‌ ఎక్స్చేంజీలు, టవర్లు

హైదరాబాద్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులమ్మి వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కిల్‌లో హైదరాబాద్‌ టెలికం డిస్ట్రిక్ట్‌ (హెచ్‌టీడీ) పరిధిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులను విక్రయించడానికి రంగం సిద్ధం చేశారు. మొదటి దశలో గచ్చిబౌలిలోని రీజినల్‌ టెలికం ట్రైనింగ్‌ సెంటర్‌(ఆర్‌టీటీసీ)కు సంబంధించిన పదెకరాల స్థలాన్ని విక్రయించనున్నారు. దీన్ని తెలంగాణ సర్కిల్‌ సీజీఎం కార్యాలయం ఇప్పటికే ఆమోదించింది. రెండో దశలో టెలిఫోన్‌ ఎక్చ్సేంజీలు, ఇతర కార్యాలయాలు, టవర్లను సైతం అమ్మనున్నారు.

హెచ్‌టీడీ పరిధిలోనే (హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను కలిపి) బీఎస్‌ఎన్‌ఎల్‌కు విలువైన ఆస్తులున్నాయి. గచ్చిబౌలిలోని ఆర్‌టీటీసీకి 40 ఎకరాల స్థలం ఉంది. అందులో పదెకరాల స్థలాన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు లీజు ఇచ్చారు. మరో పదెకరాల్లో 60 స్టాఫ్‌ క్వార్టర్స్‌, 20 ఎకరాల్లో ట్రైనింగ్‌ సెంటర్‌ ఇతర కార్యాలయాలున్నాయి. పదెకరాల స్థలంలో క్వార్టర్స్‌తో పాటు ఖాళీ స్థలం ఉండగా.. దాని విలువ సుమారు రూ.1500కోట్లపైనే ఉంటుందని అంచనా. దీంతో క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని సిబ్బందికి నోటీసులు జారీచేశారు.

తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 345 టెలిపోన్‌ ఎక్చ్సేంజీలు, ఇతర కార్యాలయాలు ఉండగా.. హెచ్‌టీడీ పరిధిలోనే 126 ఉన్నాయి. వాటితోపాటు లింగంపల్లి, చార్మినార్‌, చాంద్రాయన్‌గుట్ట, ముషీరాబాద్‌, గౌలిగూడ, తిరుమలగిరి, గోల్కోండ, అమీర్‌పేట్‌, ప్యాట్నీ, ఆదర్శ్‌నగర్‌, పద్మారావునగర్‌, ఎర్రగడ్డ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని టెలిఫోన్‌ ఎక్చ్సేంజీలు, స్టోర్‌లు, పరిపాలన, క్యాంటీన్‌, సైకిల్‌ షెడ్‌, క్యాష్‌ కౌంటర్లకు సంబంధించిన భవనాల్లో 1.82లక్షల చదరపు అడుగులు, 22ఏటీఎం సెంటర్లకు సంబంధించిన 2200చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హెచ్‌టీడీతో పాటు ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం(డీఓటీ) పేరుతో ఉన్న 245 ల్యాండ్‌ పార్సిల్‌లోని 177 స్థలాలు బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరు మీద మ్యుటేషన్‌ చేశారు. ఇంకా 68 స్థలాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా మ్యుటేషన్‌ చేయాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. హెచ్‌టీడీ పరిధిలోనే 81 ల్యాండ్‌ పార్సిల్స్‌ ఉండగా, 14 స్థలాలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 6,400 2జీ, 3జీ బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఉంటే హెచ్‌టీడీ పరిధిలోనే 2,100, వీటితోపాటు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లైన్లు కూడా ఉన్నాయి.

రెండో దశలో భవనాలు, భూములు, టవర్లు
బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనాలు, భూములు, టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేటుల్స్‌ను దశలవారీగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2018 కంటే ముందు బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలను అద్దెలు, లీజుకు ఇచ్చి ఆదాయాన్ని రాబట్టుకోవాలనుకుంటోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత అద్దెలు, లీజు కాకుండా ఏకంగా విక్రయించేందుకు పూనుకుందని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులను గ్లోబల్‌ టెండర్ల పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని కేంద్రం యత్నిస్తుందని విమర్శిస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates