షాదీ మాటే వద్దు గురూ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా దెబ్బకు వివాహాలు వాయిదా..
ఈసారి వరుసగా మూఢం, శూన్యం
మాఘంలోనూ తక్కువ ముహూర్తాలే
అందరి చూపులూ శ్రావణ మాసంవైపే
ఈసారి కనీసం 50 వేల పెళ్లిళ్లు అంచనా
అందరి ఆశలపై నీళ్లు చల్లిన వైరస్‌
కనీసం 40 శాతం వివాహాలు వాయిదా
మూడు నాలుగు నెలల తర్వాత జరపాలని భావన
ఇదే అదనుగా తక్కువ ఖర్చుతో చేసేస్తున్న మరికొందరు

హైదరాబాద్‌: ఈసారి మాఘ మాసంలో పెద్దగా ముహూర్తాలు లేవు! అంతకుముందు మూఢం.. శూన్య మాసం! అందుకే, పెళ్లి కావాల్సిన వేల మంది యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూసింది.. శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండే శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని! ఇప్పుడు శ్రావణం వచ్చింది! మామూలుగా అయితే, మెహందీ మురిపాలు, సంగీత్‌ సరసాలు, వివాహ విందులతో ధూమ్‌ధామ్‌ దుమ్ము రేగిపోవాలి! కానీ, ఇప్పుడు ఆ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు! వస్త్రాభరణాల దుకాణాల్లో సందడి లేదు. ఫంక్షన్‌ హాళ్లు బోసిపోతున్నాయి. హోటళ్లు వెలవెలబోతున్నాయి. యువతీ యువకుల్లోనూ నైరాశ్యం ఆవరించింది! ఇందుకు కారణం కరోనా! పెళ్లి చేసుకుంటే 50 మందికి మించి అతిథులను పిలవరాదని కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ నిబంధన ఎలా ఉన్నా.. ఎక్కువ మందితో వివాహం జరిపించే పరిస్థితి ఇప్పుడు లేదు! బంధుమిత్రులందరినీ పిలవకపోతే పెళ్లి కళ ఉండదు. జీవితంలో ఒక్కమారు జరిగే వేడుక సాదాసీదాగా జరగడానికి చాలామంది ఒప్పుకోవడం లేదు. తీరా, పెళ్లి చేసిన తర్వాత, వారిలో కొందరికి కరోనా వస్తే, పరిస్థితి ఏమిటన్న ఆందోళన తల్లిదండ్రులను పీడిస్తోంది. ఇక, ‘పెళ్లికి మమ్మల్ని పిలవలేదేం’ అని నిష్ఠూరమాడేవాళ్లు కూడా.. ఇప్పుడు పిలవకపోతేనే బాగుండని అనుకుంటున్నారు.

ఫంక్షన్లు ‘సూపర్‌ స్ర్పెడర్లు’గా మారుతుండడంతో పెళ్లికి వెళితే తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని కొందరు భయపడుతున్నారు. దాంతో, శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన వారంతా ఇప్పుడు వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈ సీజన్‌లో జరగాల్సిన వివాహాల్లో కనీసం 40 శాతానికిపైగా వాయిదా పడ్డాయి. మరీ ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ వివాహాల్లో 80 శాతానికిపైగా వాయిదా వేసేశారని అంటున్నారు ఈవెంట్‌ మేనేజర్లు, పురోహితులు. అంతర్జాతీయ విమానాలు లేకపోవడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు. ఈ సీజన్‌లో 50 వేలకుపైగానే వివాహాలు జరగాల్సి ఉందని, వాటిలో పది శాతానికిపైగా వచ్చే సంవత్సరానికి; మరో 30సంవత్సరాంతానికి వాయిదా పడ్డాయని తెలిపారు. తాము జరపాల్సిన 4-5 హిందూ వివాహాలు వాయిదా పడ్డాయని, అవన్నీ కనీసం 900-1200 మంది అతిథులతో నిర్వహించాల్సినవని ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ తెలిపారు. వాటిలో ఒకటి ఎన్‌ఆర్‌ఐ వివాహం ఉందన్నారు. ఈయనొక్కరే కాదు.. నగరంలో చాలామంది వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కూడా ఈనెలలో జరగాల్సిన భారీ వివాహాలన్నీ వాయిదా పడటమో, ముందు వేసుకున్న అంచనాలను కుదించి పరిమిత అతిథులతో చేయడమో చేస్తున్నారని వివరించారు. వాయిదా పడుతున్న వివాహాల్లో అధిక శాతం ఒక్కరే సంతానం ఉన్న కుటుంబాల్లోనేనని చెబుతున్నారు. సంవత్సరాంతానికి వ్యాక్సిన్‌ వస్తుందనే అంచనాలు వివాహాల వాయిదాకు కారణంగా అభివర్ణిస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల తర్వాత ముహూర్తాలు ఉన్నాయా? అంటూ చాలామంది అడుగుతున్నారని ఓ దేవాలయంలో పూజారిగా పని చేసే రాజేశ్‌ శాస్త్రి వివరించారు.

ఏడడుగుల బంధానికి ఆరడుగుల దూరం
కరోనా విజృంభిస్తున్నప్పటికీ కొంతమంది వివాహాలను వాయిదా వేసుకోవడానికి సుతరామూ ఇష్టపడడం లేదు. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తుండడమూ ఇందుకు కారణం. అతిథులు, బంధుమిత్రులు వచ్చినా రాకపోయినా పెళ్లి ముఖ్యం అనుకునేవాళ్లు జరిపించేస్తున్నారు. అందుకే, మాస్క్‌ పెట్టుకున్నామా.. శానిటైజ్‌ చేసుకున్నామా.. ఆరడుగుల దూరం ఉన్నామా.. వెళ్లిపోయామా అనే రీతిలో ఈ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు అతి తక్కువ మంది అతిథులనే పిలుస్తున్నారు. తమ డాబు, దర్పం చూపించుకోవడానికి కొంతమంది మాదాపూర్‌, హైటెక్‌ సిటీ వంటి చోట్ల కన్వెన్షన్‌ సెంటర్లను బుక్‌ చేసుకుంటున్నారని ఈవెంట్‌ మేనేజర్లు తెలిపారు. మరికొందరి నెత్తిన మాత్రం కరోనా నిజంగానే పాలు పోసింది. తక్కువ ఖర్చుతో పెళ్లి అయిపోతోందని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా పెళ్లి ఖర్చు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా, తమకు చెప్పలేదనే సూటిపోటి మాటలు లేవు. చెబితే బాధ పడుతున్నారిప్పుడు అని నవ్వుతూ చెప్పారు ఇటీవలనే తన కుమార్తెకు వివాహం చేసిన పాండురంగారావు.

4 వివాహాలు వాయిదాపడ్డాయి
కరోనా వచ్చిన తర్వాత ఈవెంట్‌ పరిశ్రమకు కూడా కష్టాలు వచ్చాయి. కానీ, మేం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. మే నుంచి ఇప్పటి వరకూ ఐదు క్రిస్టియన్‌, ముస్లిం వివాహాలు బాగానే చేశాం. కానీ, ఈసారి మా దగ్గర శ్రావణ మాసంలో హిందూ వివాహాలు ఏవీ లేవు. బుక్కయిన నాలుగు హిందూ వివాహాలూ వాయిదా పడ్డాయి.
విజయ్‌ పాల్‌, వెడ్డింగ్‌ ప్లానర్‌

పెళ్లి ఇప్పుడే చేయండి..
మా రెండో అమ్మాయి వివాహం మేలో చేశాను. లాక్‌డౌన్‌ నిబంధనలు కలిసి వచ్చాయి. అటు ఇటు కలిపి 40 మంది మించిలేదు. పిల్లలు హ్యాపీ, మేమూ హ్యాపీ. ఎంత ఖర్చు పెట్టినా రెండు మూడు రోజులు మాట్లాడతారు. ఆ డబ్బేదో పిల్లలకు ఇస్తే వాళ్లింకా సంతోషపడతారు. నేనైతే ఈ కరోనా కాలంలోనే పెళ్లి చేసేయమని చెబుతున్నా.
పాండురంగారావు

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates