దు:ఖంగా ఉంది. అలజడిగా ఉంది.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నన్ను హైదరాబాద్ తీసుకువచ్చిన వాడు ఉసా.
రైలు టిక్కెట్టు తెలీదు. ఆటోకు మీటరుంటుందని సికింద్రాబాద్ స్టేషన్నుంచి ఉసా ఇంటికెళ్లినపుడే తెలిసింది. జేబులో అర్థరూపాయితో సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన వాణ్ణి నేను. యాక్టివిస్టు లైఫ్ అంతో ఇంతో ఉన్నప్పటికీ బితుకుబితుకు మనే పల్లెటూరి వాసన పోని పిల్లాడిని హైదరాబాద్ అనే మహానగరానికి ఇక్కడి ప్రపంచానికి ఇక్కడి రాజకీయాలకు ఇక్కడి లైబ్రరీలకు పరిచయంచేసిన మనిసి ఉసా.

బాగా గుర్తు. ఆయన హైదరాబాద్ రమ్మని పిలిచినపుడు ఎంత రఫ్‌గా జవాబిచ్చానో. మనకు శాఖా బేధం ఉంది కదా, మేము ఫలానా కుదురు, నాకు దాంతో పేచీలున్నా కుదురైతే అదే. మీరది కదా! మేమిది కదా! ఇట్లా మాట్లాడాను. అమాయత్వంతో కూడిన మొరటుతనమది. 20 నిండలేదప్పటికీ. బహుశా 92 ఆఖరు. లేదా 93 మొదలు.

నీ విశ్వాసాలు నువ్వుంచుకో, ఎదురీత కోసం పనిచేయి. నీకు రాయాలనిపించినపుడు నీ అబిప్రాయాలు రాయి. చర్చిద్దాం. విభేదాలుంటే కలిసి పనిచేయకూడదని ఉందా అన్నారు ఉసా.

ప్రజాస్వామికమైన తండ్రి తన పిల్లాడితో చెప్పినట్టు చెప్పారు. ప్రజాస్వామికమైన అనే పదం ఊరికే వాడుతున్నది కాదు. ఆయన్ను ఎప్పుడు గుర్తుచేసుకున్నా తటాలున అనిపించే లక్షణమదే. మార్క్సిస్టు, లెనినిస్టుల యందలి శాఖోపశాఖలు, నాగిరెడ్డికి కొరియెర్‌గా పనిచేయడాలు, రకరకాల దళిత బహుజన వేదికలు, సమాఖ్యలు, ఇటీవలి బుద్ధిజం వగైరాలన్నింకంటే కూడా నాకు ప్రధానంగా కనిపించేది ఆయన ప్రజాస్వామిక లక్షణం. అదేమీ సాధారణ లక్షణం కాదు. మన చుట్టుపక్కల అంతగా కానరాదు.

అన్నట్టుగానే నాచేత ఆ వయసులోనే రాయించారు. అయిలయ్య అప్పటికే చాలా పెద్దవాడు. ఆయన దళిత వాడల్లో పితృస్వామ్యం ఉండదు అంటే లేదూ, రూపం వేరు కానీ ఉంటుంది అని నేను రాసినట్టు గుర్తు. వివేకానంద మీద ఎదురీతలో బోలెడంత చర్చ. పిడిఎస్‌యులోని రెండు శిబిరాల మధ్య ప్రధానంగా కేంద్రీకృతమైందనుకుంటా. ఆచర్చ సందర్భంగానే కాదు. ఆయన్ను అవమానపర్చడానికి భార్య బట్టలు ఉతుకుతాడు (పదాలు ఏవో కానీ దాదాపు సారాంశం అదే) అట్లా ఏవో కొందరు రాశారు. అందులో ఆయన పాత కామ్రేడ్స్ కూడా ఉన్నట్టు గుర్తు. ఊరికే, మనిషిని అవమానించడానికి మగఅహంకారపు ఆయుధంతో దాడిచేయడం, అంతే. పదాలు ఉత్తి ఆయుధాలు. మనం శత్రువుల కంటే కూడా మిత్రులతో భలే కరుగ్గా మొరటుగా తలపడతాం కదా. ఆ సందర్భంగా ఆయన చూపించిన సంయమనం, చేసిన చర్చలు, ఆయన నిజమైన ప్రజాస్వామిక లక్షణానికి గుర్తు. అప్పటికే పద్మగారు పెద్ద ఆఫీసరు. ఆమెకూడా ఆయనతో తొలిదశలో కలిసి నడిచిన సహబాటసారి అయినప్పటికీ ఒక దశలో ఆ బాట వదిలి పరీక్షలు రాసి ఆఫీసరయ్యారు(ఆమె కొద్ది సంవత్సరాల క్రితం చనిపోయారు). ఆమె ఈ రాజకీయ వాదోపవాదాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నప్పటకీ ఈ సందర్భంగా మాత్రం తిరిగి కలం పట్టి అవును, ఆయన ఏం ఉతికితే మీకేంటి, మీ సమస్య ఏంటి అని ఫెమినిస్టు కోణంలో ఓ కవిత రాసినట్టు గుర్తుంది. హయత్ నగర్ వెళ్లడానికి ముందు వారం రోజులు వాళ్లింట్లోనే ఉన్నాను.

చీమకుర్తి, చుండూరు, ఇంకా ఏదో గ్రామం(పేరు గుర్తులేదు) అప్పటికే కలిసి పనిచేశాం. శివసాగర్ అప్పటికే బయటికొచ్చి వీటిలో భాగమయ్యారు. నాయకులుగా ఉన్నారు. శివసాగర్, ఉసాలతో పాటు రవిమారుత్, రామకృష్ణ ,ఉపేంద్ర, ఉషా, వీళ్లంతా సీనియర్లు, నాయకులు. ఇంగ్లిష్ ఎక్స్పోజర్ ఉన్నవారు కూడా. నేపాల్ గురించి అప్పట్లోనే విపరీతంగా మాట్లాడేవాళ్లు. నేను బచ్చా. అయినా ఉసాలో ఎక్కడా ఆ అహంకారం కనపడేది కాదు. అనేక ఆందోళనల్లో భాగమయ్యాం, వేదికలూ పంచుకున్నాం.

బహుశా తొలిసారి కాలేజీలో చర్చా వేదికకు పిలిచినట్టున్నాం. కులం-వర్గం అట్లా ఏదో. అప్పట్లో యాక్టివిస్టు శిబిరాల్లో ఎక్కడ చూసినా అదే. ప్రజాపంథా వెంకట్రామయ్యగారిని, ఉసా గారిని ఇద్దరిని పిలిచినట్టు గుర్తు. తర్వాత మట్లె వెంకటసుబ్బయ్య ఇంటిలో కూడా కలిసినట్టు గుర్తు. మట్లె వెంకటసుబ్బయ్యగారు కారంచేడు కేసు వాదించిన న్యాయవాది. బహుశా తిమ్మసముద్రం రోజులనుకుంటా. ఆరోజు తారకం, ఉసా, అయిలయ్య ముగ్గురినీ అక్కడ కలిసినట్టున్నా. నువ్వేదో సొంతంగా స్టూడెంట్ యూనియన్ పెట్టుకున్నావని చెప్పారు. మన బిఎస్‌పికి అనుబంధంగా మార్చుకోవచ్చు కదా అని తారకంగారు అక్కడే అడిగినట్టుకూడా గుర్తు.

ఎదురీత బాధ్యతల్లోనే తెలుగునేల మీద దాదాపు ప్రతి రెవిన్యూడివిజన్ తిరిగే అవకాశం దొరికింది. కాస్తో కూస్తో బావి వైశాల్యం పెరగడానికి దోహదం చేసింది. అనంతపురాన్ని, ఆదిలాబాద్ను చూసిన కళ్లతో అమలాపురాన్ని చూసి అక్కడ మిత్రుడు గౌతమ్‌తో నా ఆశ్చర్యాన్ని అదే పనిగా పంచుకోవడం ఇంకా గుర్తుంది. ప్రాంతం, నీటి ప్రాముఖ్యం, అందులోనూ హరిత విప్లవం ప్రాముఖ్యం వగైరా విషయాలను మెదడులోకి చొప్పించిన రోజులవి.

దైనందిన వ్యవహారాల్లోనా లాగే ఆయన కూడా ఆమాయకుడు. ఆ 90ల రోజుల్లోనే సిటీలో రూమ్ దొరకడం కష్టమేమోఅని హయత్ నగర్ బస్ డిపోకు ఎదురుగా ఉండే రోడ్డులో రూమ్ చూశాడు మొదట్లో. నాకు చదివే అలవాటుందని అర్థమై అన్వేషి అని ఉస్మానియాలో ఒక లైబ్రరీ ఉంటది. నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అని ఆయనే చెప్పారనుకుంటా. హయత్ నగర్ నుంచి చాలా రోజులు నడుచుకుంటూనే ఉస్మానియా క్యాంపస్లోని అన్వేషికి వచ్చి గేట్లు మూస్తున్నాం అని హెచ్చరించేదాకా ఏదో చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఎదురీత బాధ్యతలు చూసే మరో పెద్దమనిషి కెజె రామారావు ఇల్లు ఈ ప్రయాణంలో మరో మజిలీ అపుడపుడు. ఉసా సంపాదకీయాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం, ప్లానోగ్రాఫర్స్ మురళీ ప్రెస్సులో అలా మఠం వేసుకుని కూర్చొని తొందరపెడుతూ ఎదురీత తేవడం అపుడే అచ్చయిన పత్రిక అంత ఫ్రెష్ జ్ణాపకం.

ఎదురీత ఒడుదుడుకుల్లో ఉండి పత్రిక’భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినపుడు నన్ను పాశం యాదగిరి గారి దగ్గరకు పంపించింది కూడా ఉసానే. పాశం యాదగిరి గారు రెండు ప్రశ్నలు వేశారు, ఏదన్నా రాయమన్నారో లేదో గుర్తులేదు. వర్తమానంలో భాగం చేసుకున్నారు. మధ్యలో ఎక్కడన్నాకలిస్తే బాగా రాస్తున్నావు కానీ సంక్లిష్టంగా ఉంటున్నాయ్ అనే వారు ఉసా .ఇంకాస్త వివరిస్తే బాగుంటుందేమో అనేవారు. ఇప్పటికే అతి విస్తరణ అనుకుంటున్నాను సర్ అనేవాణ్ణి. మా వాడు ఏదో ఒక ప్లేన్‌లో రాస్తున్నాడబ్బా అని ఎవరికో పరిచయం చేస్తూ చెప్పేవారు.

ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు. విభేదించొచ్చు. జీవితాంతం ప్రజాజీవనంలో ఉన్నవాడు. ప్రతి ఎన్నికల సందర్భంగా ఏదో ఒక దళిత బహుజనవేదికను ఫ్లోట్ చేసి అందర్నీ ఒకచోటచేర్చి ఏదో ఒక ప్రయత్నం చేసినవాడు. కులమూ వర్గమూ జమిలి ప్రయాణం ఇట్లా ఏదో తపన పడినవాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ఎంఎల్ పార్టీ పుట్టుకకు ప్రేరణగా చోదకశక్తిగా ఉన్నవాడు. పదిమందిని ఒకచోట పోగేయడానికి ఏదో ఒకటి చేస్తూనే వచ్చిన మనిషి. విముక్తి మాతోనే, ఎదుటి వాళ్లది తప్పుడు పంథా అని ఎవరికి వారు ఘాట్టిగా అనుకునే గుంపుల్లో పదిమందిని ఒకచోటకు చేర్చడం అంత మామూలు విషయం కాదు. ఆ పని ఆయన తరచుగాచేస్తూ వచ్చారు.

నోస్టాల్జియానే. బోల్డన్ని జ్ణాపకాలు. కనీసం పదిమంది కలిసి కష్టసుఖాలు అనుభవాలు పంచుకోలేని రోజులు. నాలుగు పిడికిళ్లతో మట్టిపోసి నలభై పిడికిళ్లతో నినాదాలిచ్చి నాలుగొందల మందిలో యాదిచేసుకోలేని రోజులు.
బై సర్!

– జీఎస్‌ రామ్మోహన్‌
ఎడిటర్‌, బీబీసీ న్యూస్‌ తెలుగు

RELATED ARTICLES

Latest Updates