ఉపశ్రేణుల ప్రవక్త గ్రాంసీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అధికారం క్రమేపీ క్రిందివర్గాలకి అందడమే చరిత్రగమన లక్షణమని గుర్తిస్తే ప్రాచీనయుగంలో రాచరికవర్గానికీ, మధ్యయుగంలో భూస్వాములకూ, ఆధునికయుగారంభంలో ఉన్నత మధ్య తరగతికీ అందివచ్చిన అధికారం ఇప్పుడు దళిత బహుజన శ్రామిక వర్గాలకు దక్కవలసి ఉందనుకోవడంలో గ్రాంసీ అస్తిత్వం ఉంటుంది.

భీమాకోరేగావ్ కేసులో వరవరరావు,తెల్తుంబ్డే తదితరుల్ని నిర్బంధంలోకి తీసుకోవడం ఫాసిస్టు నియంత ముస్సోలిని మీద హత్యాప్రయత్న నేరారోపణ మీద గ్రాంసీని నిర్బంధంలోకి తీసుకోవడాన్ని గుర్తుకు తెస్తున్నది.

‘పాతప్రపంచం మరణిస్తూ కొత్తప్రపంచం జనిస్తున్న ఈ సంధి కాలంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు’ అని ఇరవయో శతాబ్ది పూర్వార్ధంలో ఇటాలియన్ ఫాసిస్టు, జర్మన్ నాజీ పాలకుల్ని ఉద్దేశించి ఆంటోనియో గ్రాంసీ అన్నాడు. ఆయన ఆ వాస్తవాన్ని ఘోషించిన దాదాపు వంద సంవత్సరాల తర్వాత కూడా ఆ కఠోర రాజకీయ పరిస్థితుల్లో మార్పు లేకపోవడం గ్రాంసీని ఈ 21 వ శతాబ్దిలోనూ ప్రాసంగికం చేస్తున్నది. 1891లో జన్మించి ముస్సోలిని ఫాసిస్టు ప్రభుత్వ దమన నీతికి గురై చివరి పదకొండు సంవత్సరాలు జైలులోనే రాపాడి నలభై ఆరు ఏళ్లకే మరణించిన ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి గ్రాంసీ. రూళ్లకర్ర లాంటిదనుకున్న మార్క్సిస్టు సిద్ధాంతానికి వంగే గుణాన్ని ఆపాదించిన మౌలిక మేధావి. 1937లో మరణించినా గ్రాంసీ 1960ల తర్వాత, ముఖ్యంగా 1970ల తర్వాత జీవించడం ప్రారంభించి దశాబ్దాలు గడిచేకొద్దీ మరింత పఠనీయమూ, ఆచరణీయమూ అవుతున్నాడు. తీవ్ర అనారోగ్యంతో, దారుణ ప్రతికూల పరిస్థితుల మధ్య సాగిన జైలు జీవితంలో ఆయన రాసిన ముప్పైకి పైగా ప్రిజన్ నోట్ బుక్స్ రానున్న కాలానికి విజన్ నోట్ బుక్స్ అయ్యాయి. మార్క్స్ ఆలోచనల మీద ఆయన మౌలిక ప్రశ్నలు లేవనెత్తాడు. ప్రాథమిక సూత్రాలు కొన్నింటిని దిద్దడానికి ప్రయత్నించాడు. ఆ కారణం గానే మార్క్సిస్ట్ నియతివాదాన్ని వ్యతిరేకించి మార్క్సిస్టులు కానివారు సైతం అధ్యయనం చేయవలసిన వాడయ్యాడు. గ్రాంసీ రాజకీయ సామాజిక అంశాల మీద చేసిన కొత్త ఆలోచనలు 21 వ శతాబ్దపు మనుగడకు సూచికలయ్యాయి. గ్రాంసీని చదివి కొందరూ చదవకనే కొందరు అనుసరించడం దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత కూడా నిలబడిన అతని సిద్ధాంతాలలోని సమకాలీనతకు నిదర్శనం. మార్క్సిజానికి కొనసాగింపుగా గ్రాంసీ చేసిన ప్రతిపాదనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాయి.

ఆర్థిక సంబంధాలు పునాదిగా రాజకీయ సామాజిక మత సాంస్కృతిక సంబంధాలు నిర్మితమౌతాయనే రెండంచెల మార్క్సిస్ట్ దృక్పథంలో పౌరసమాజం అనే మధ్య అంచె ఉండడాన్ని గ్రాంసీ గుర్తించాడు. అది రాజ్య, న్యాయ, రక్షక వ్యవస్థల్లో భాగం కాని విభాగం. ఆర్థికసంబంధాలు మాత్రమే సామాజిక సాంస్కృతిక సంబంధాలని నిర్ధారించవనీ వాటి మధ్య ఆదానప్రదానాలు ఉంటాయనీ అనడంతో గ్రాంసీకి కొత్త్తదారులు తెరుచుకున్నాయి. సమకాలీన సమాజంలో విరివిగా వాడబడుతూ చర్చకు గురౌతున్న ‘సాంస్కృతిక ఆధిపత్యం’ (కల్చరల్ హెజిమొని) భావన ఆంటోనియో గ్రాంసీతో ముడిపడివుంది. ఇటలీలో ఫాసిజం ఆవిర్భావం వెనుక పనిచేసిన రోమన్ సాంస్కృతిక పునరుజ్జీవన భావజాలం గ్రాంసీని ఆలోచింప చేసింది. ఫాసిజం పేరిట ప్రగాఢ జాతీయభావం ఏర్పడడంలో ముస్సోలిని ప్రేరేపించిన రోమన్ సంస్కృతీ ఔన్నత్యం నిర్వహించిన పాత్ర గమనంలోకి వచ్చింది. అట్లాగే మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, రాజకీయ అస్థిరత, శ్రామికోద్యమాల వైఫల్యం నేపథ్యంలోంచి సాంస్కృతిక ఆధిపత్యం నిర్వహించగలుగుతున్న పాత్రను ఆయన అంచనా వేశాడు. ఆధిపత్యవర్గాలు ఆధిపత్య భావజాలాన్ని రాజకీయరంగంలో బలప్రయోగంతో సాధించగలిగితే సాంస్కృతిక రంగంలో పౌరసమాజం అంగీకారంతో సాధించగలుగుతాయని సూత్రీకరించాడు. ప్రభుత్వవర్గాల సాంస్కృతిక భావజాలమే విధాయకమనీ, అనుసరణీయమనీ, అదే తమ భావజాలం కూడా అని పౌరసమాజం చేత కూడా ఆమోదింపచెయ్యడాన్ని కల్చరల్ హెజిమొనిగా నిర్వచించాడు. ఫాసిస్టు ప్రభుత్వాలే కాదు సోషలిస్టు వ్యవస్థలో శ్రామికవర్గాలు కూడ తమ సాంస్కృతిక ఆధిపత్యాన్ని నెలకొల్పుకోగలగాలని గ్రాంసీ సూచించాడు. ఈ క్రమంలో కలుపుకుని వెళ్లవలసిన సామాజిక ఉపశ్రేణుల్ని ప్రస్తావిస్తూ వారిని మొదటిసారిగా ‘సబాల్టర్న్ వర్గాలు’గా పేర్కొన్నాడు. ఈ వర్గాల ఐక్యత రాజ్యాధికార స్థాపనను సుగమం చేస్తుందని సూచించాడు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ సమాజంలోని ఒకానొక ప్రాథమికవర్గం ఇతర సామాజిక ఉప శ్రేణుల్ని సమీకరించడం ద్వారా సాంస్కృతిక ఆధిపత్యాన్ని నెలకొల్పవచ్చుననీ, ఈ క్రమంలో వారి భాష, సంగీతసాహిత్యాలూ, కళలూ, జానపద సంప్రదాయాలూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయనీ అన్నాడు.

గ్రాంసీ మేధావుల్ని రెండు రకాలుగా వర్గీకరించాడు. ఇతరుల్ని సంప్రదాయ మేధావులుగా పేర్కొన్న గ్రాంసీ ఆయా వర్గాలనుంచీ ఉపశ్రేణుల్నించీ రూపొందే మేధావుల్ని సవర్గ మేధావులని (ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అన్నాడు. గ్రాంసీ అభిప్రాయంలో రాజకీయకార్యకర్తలు, నిర్వాహకులు, ఉద్యమ నాయకులు కూడా మేధావులే. భౌతిక, బౌద్ధిక కార్యకలాపాల పట్ల గ్రాంసీ తేడా చూపలేదు. ఏ భౌతిక కార్యకలాపమైనా ఎంతోకొంత బుద్ధిని ఉపయోగించకుండా ఎట్లా సాధ్యపడదో దేన్నైనా అధ్యయనం ద్వారా గ్రహించడానికి కొంతైనా శారీరకశ్రమను వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తించాడు. అనేక సందర్భాలలో జైలు అధికారుల సెన్సార్ నుంచి తప్పించుకోవడం కోసం మార్క్సిజంకు ‘ఆచరణీయసూత్రాల తత్వం’ (ఫిలాసఫీ ఆఫ్ ప్రాక్సిస్) గా మారుపేరు పెట్టిన గ్రాంసీ దానిని ఒక నైరూప్య తాత్వికతగా భావించలేదు. అది ప్రజల స్థితిగతులు తాము అనుభవిస్తున్నంత సహజంగా వారి చైతన్యంలోకి కామన్ సెన్స్‌లోకి ఇంకిపోయేటట్లు చెయ్యగలిగేదిగా చూశాడు.

రష్యాలోనూ, తూర్పు యూరప్‌లోనూ సోషలిస్ట్ వ్యవస్థల పతనంతో మార్క్సిస్ట్ సిద్ధాంతం ఆచరణ మీద నీడలు వ్యాపించాయి. కొత్త సామాజిక సమీకరణాలు రూపొందడం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో గ్రాంసీ రచనల అధ్యయనం పెరిగింది. 1980లకు ముందూ వెనుకా లెవనెత్తబడిన కొన్ని ప్రశ్నలకి గ్రాంసీలో సమాధానాలు దొరికాయి. ఆర్థిక సంబంధాల పునాదిమీద మాత్రమే రాజకీయ సామాజిక వ్యవస్థలు నిర్మితం కావనీ అవి పరస్పర ఆధారితాలన్న గ్రాంసీ మందికి ఆమోదయోగ్యుడయ్యాడు. మతం, ఆర్థికం మొదలైన అంశాల మీద ఆర్థికం ప్రభావం ప్రశ్నార్థకమైంది. గ్రాంసీ ప్రతిపాదించిన సాంస్కృతిక ఆధిపత్యం భారతదేశంలో వేర్వేరు కోణాల్లో చర్చకు వచ్చింది. బూర్జువాప్రభుత్వం తన భావజాలాన్నే ప్రజల భావజాలంగా అంగీకరింపచెయ్యడంలో విజయం సాధిస్తుందనీ దానికి ప్రత్యామ్నాయంగా శ్రామికవర్గమే ఇతర సామాజికవర్గాలను కలుపుకుని తానే సాంస్కృతిక ఆధిపత్యం నెలకొల్పాలనే గ్రాంసీ భావనకు ప్రచారం వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ ప్రజల మత పార్టీ అయినందున అది సాంస్కృతిక ఆధిపత్యాన్ని సునాయాసంగా సాధించ గలిగింది. గ్రాంసీ ప్రతిపాదించినట్టుగానే రాజకీయ ఆధిపత్యం వెనుక సాస్కృతిక ఆధిపత్యం దన్నుగా నిలబడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాపితంగా విస్తరిస్తున్న లౌకికోద్యమాలు గ్రాంసీని సజీవుణ్ణి చేస్తున్నాయి.

గ్రాంసీ ప్రయోగించిన పదాల్లో ప్రపంచం మీద, భారతదేశం మీద విస్తారమైన ప్రభావం చూపిన పదం ఆయనే మొదటిసారి ఉపయోగించిన ‘ఉపశ్రేణులు’ (సబాల్టర్న్). సబాల్టర్న్ గ్రూప్స్ అనీ, సబాల్టర్న్ క్లాసెస్ అనీ గ్రాంసీ ఉపయోగించిన మాటలు జైలు సెన్సార్‌ను తప్పించుకునేందుకు ప్రోలెటేరియెట్‌కు ప్రత్యామ్నాయంగా వాడాడని భావించినప్పటికీ అనేక సందర్భాలలో అది శ్రామికవర్గం ఇతర ఉపశ్రేణులతో కలవడం గురించిన సందర్భమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రోలెటేరియెట్‌లోని ఆర్థికకోణాన్ని సబాల్టర్న్‌లోని సామాజిక సాంస్కృతిక కోణంలోకి కొనసాగించడమే గ్రాంసీ తెచ్చిన విప్లవం. ఇది అంతర్జాతీయస్థాయిలో రణజిత్ గుహ వంటి చరిత్రకారుల సారథ్యంలో ఆదివాసీల, స్త్రీల, రైతుల దృష్టినుంచి చరిత్రను పునర్నిర్మించడానికి దారితీస్తే దేశీయంగా స్థానికంగా అనేక అస్తిత్వ ఉద్యమాలు ఆవిర్భవించడానికి కారణమైంది.

ఆర్థిక తారతమ్యం ప్రాతిపదికగా ఏర్పడిన శ్రామికవర్గం నుంచి సాంస్కృతిక వివక్షకు గురైన వర్గాలు విడిపోవడం గ్రాంసీ అవసరాన్ని ముందుకు తెస్తున్నది. ఉన్నవాళ్లు లేనివాళ్లూ అనే అడ్డుకోత విభజన నుంచి అగ్రవర్ణాలూ నిమ్నవర్ణాలూ, స్త్రీలూ పురుషులూ అనే నిలువుకోత విభజన జరుగుతున్నప్పుడు ఈ రెండురకాల విభజనలో ఎక్కువగా ఉన్నది శ్రామికవర్గాలు. కార్మికకర్షక వర్గంలో అధికంగా ఉన్నది దళిత బహుజనులైతే, దాదాపు దళిత బహుజనులంతా శ్రామికవర్గమే. కులం, వర్గం అనేవి రెండు వేర్వేరు సమస్యలైనా ఎదుర్కొంటున్న శ్రేణి ఒక్కటేనని గుర్తించడంలో గ్రాంసీ వర్తింపు ఉంది. దేశజనాభాలో అరవైఆరు శాతంగా ఉన్న ఈ శ్రేణులు ప్రధానశ్రెణులుగా రూపొందడానికి రాజ్యాధికారసాధనే లక్ష్యమని గుర్తించడంలోనూ గ్రాంసీ ఉంటాడు. ఐదువేల సంవత్సరాల నాగరిక చరిత్రలోనే కాదు, ఏడు దశాబ్దాల గణతంత్రంలోనూ ఈ వర్గాలకు రాజ్యాధికారం అందని ద్రాక్షే అయ్యింది. అందలేదు కదా అని ద్రాక్ష పుల్లనిదని సరిపెట్టుకునే కాల్పనికతకు కాలం చెల్లిందనుకోవడంలో గ్రాంసీ ఉంటాడు. అధికారం క్రమేపీ క్రిందివర్గాలకి అందడమే చరిత్రగమన లక్షణమని గుర్తిస్తే ప్రాచీనయుగంలో రాచరికవర్గానికీ, మధ్యయుగంలో భూస్వాములకూ, ఆధునికయుగారంభంలో ఉన్నత మధ్య తరగతికీ అందివచ్చిన అధికారం ఇప్పుడు దళిత బహుజన శ్రామిక వర్గాలకు దక్కవలసి ఉందనుకోవడంలో గ్రాంసీ అస్తిత్వం ఉంటుంది.

ఈ నేపధ్యంలో చూసినపుడు గ్రాంసీ- అంబేడ్కర్‌ల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ 1891 లోనే జన్మించారు. ఇద్దరూ తమ వర్గం చైతన్యీకరింపబడడంలోనే ఆ వర్గం భవిష్యత్తు ఉందని గుర్తించారు. ఇద్దరూ రాజ్యాధికార స్థాపన వెనుక సాంస్కృతిక ఆధిపత్యస్థాపనలో తమతమ వర్గాలు నాయకత్వం వహించాలని కాంక్షించారు సైద్ధాంతికంగా సవర్గ మేథావుల గురించి గ్రాంసీ రాస్తున్నపుడే అంబేడ్కర్ అందుకు గొప్ప ఉదాహరణగా ఆవిర్భవించడం వారిద్దరి మధ్య బలీయమైన బంధాన్ని సృష్టిస్తోంది. వారి తులనాత్మక అధ్యయన అవసరాన్ని సూచిస్తోంది. భీమాకోరేగావ్ కేసులో వరవరరావు, తెల్తుంబ్డే తదితరుల్ని నిర్బంధంలోకి తీసుకోవడం ఫాసిస్టు నియంత ముస్సోలిని మీద హత్యాప్రయత్న నేరారోపణ మీద గ్రాంసీని నిర్బంధంలోకి తీసుకోవడాన్ని గుర్తుకు తెస్తున్నది. అందుకే గ్రాంసీ అన్న ఈ వ్యాస ప్రారంభ వాక్యాల్నే ఇక్కడ మళ్ళీ ఉటంకించవలసి వస్తున్నది. ‘పాతప్రపంచం మరణిస్తూ కొత్త ప్రపంచం జనిస్తున్న ఈ సంధికాలంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు’.

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates