జమ్మూకాశ్మీర్‌లో కొత్త మీడియా విధానం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పత్రికా స్వేచ్ఛకు కేంద్రం తూట్లు
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు
– పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

శ్రీనగర్‌ : ఏడాది కిందట అధికారం బలంతో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన మోడీ సర్కారు అక్కడ అశాంతిని రాజేసింది. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి పాలనను తన చేతిలోకి తెచ్చుకున్నది. ఇప్పుడు ప్రశ్నించే ప్రజాగొంతుక అయిన మీడియాను అణగదొక్కాలని మోడీ సర్కారు భావిస్తున్నది. దీంతో మీడియా అడ్డు తొలగించుకొని జమ్మూకాశ్మీర్‌లో తన నియంతృత్వ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం చూస్తున్నది. ఇందులో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో అక్కడి యంత్రాంగం కొత్త మీడియా విధానాన్ని తీసుకొచ్చింది. అయితే జర్నలిస్టుల స్వేచ్ఛను హరించే ఈ విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విధానంపై అక్కడి జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

”నకిలీ వార్తలు, దోపిడీ, అనైతికత లేదా దేశవ్యతిరేక సమాచారం” విషయంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఇతర రకాల మాధ్యమాలను వార్తలను పరిశీలించడానికి అక్కడి యూటీ పరిపాలనా యంత్రాంగం ఈ ఏడాది జూన్‌ 2న కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీంతో ఈ విధానం ద్వారా పైన పేర్కొన్న విధంగా వార్తల విషయంలో జర్నలిస్టులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అధికారులకు హక్కు కలుగుతుంది. ఈ విధానంతో అక్కడి జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఏ వార్త రాసినా దానిలో తప్పులు వెతికి మరీ ‘కొత్త విధానం’ ద్వారా తమపై అధికారులు చర్యలు తీసుకుంటారనీ, ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని అక్కడి జర్నలిస్టులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌ మీడియా పాలసీ జర్నలిస్టుల్లో ఆగ్రహాన్ని తెప్పిచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఈనెల 6న జర్నలిస్టుల బృందం లాల్‌చౌక్‌లోని ప్రెస్‌ కాలనీలో సమావేశం నిర్వహించింది. కొత్త విధానానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన చేపట్టారు. మీడియా పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. జమ్మూకాశ్మీర్‌ మీడియా గిల్డ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కాగా, ఈ కొత్త విధానం వచ్చే ఐదేండ్ల పాటు అమలులో ఉండనుంది.
కాగా, ఈ విధానంతో జర్నలిస్టులపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందనే ఆందోళనను ఓ సీనియర్‌ జర్నలిస్టు వెల్లడించారు. ”ఓ ఐఏఎస్‌ లేదా కాశ్మీర్‌ ఉన్నతాధికారి ఇప్పుడు ఒక జర్నలిస్టు ఉద్యోగాన్ని నిర్ణయిస్తారు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఇంతకంటే వింత ఏంటంటే.. ఒక బ్యూరోక్రాట్‌ లేదా ఒక పోలీసు ఉన్నతాధికారి ఇప్పుడు ఏవి వార్తలు? ఏవి వార్తలు కావు? అని నిర్ణయిస్తారు” అని ఆ జర్నలిస్టు తెలిపారు. ఈ విధానం లక్ష్యం స్థానిక మీడియాను చంపడం.. ప్రభుత్వ విధానాన్ని మోయడమేననీ, ఇది ప్రజాస్వామ్య విధానానికి అంత శ్రేయస్కరం కాదని మరొక జర్నలిస్టు వాపోయారు. వార్తా పత్రికలు నిర్భయంగా కథనాలను రాసే రోజులు పోయాయని ఓ ఉర్దూ వార్తా పత్రిక అసోసియేట్‌ ఎడిటర్‌ అన్నారు.

ఈనెల 9న శ్రీనగర్‌లో కాల్పుల గురించి నివేదించినందుకు స్థానిక వార్తా పత్రిక ది కాశ్మీర్‌ వల్లా చీఫ్‌ ఎడిటర్‌ను పిలిపించి అధికారులు ప్రశ్నించడం గమనార్హం. కాగా, ఈ విధానం.. జర్నలిస్టుల్లో భయాన్ని సృష్టించి అణచివేతను మరింత అధికారికం చేస్తుందని జమ్మూకాశ్మీర్‌లోని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కొత్త మీడియా విధానాన్ని ప్రకటించే ముందు ప్రభుత్వం వార్తా పత్రికల సంపాదకులను సంప్రదించలేదనీ, ఇది పూర్తిగా జర్నలిస్టులను అణచివేయడానికి తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని కాశ్మీర్‌ ఎడిటర్స్‌ గిల్డ్‌ సభ్యుడు అన్నారు. నూతన విధానం ద్వారా.. జర్నలిజాన్ని స్టెనోగ్రఫీ భర్తీ చేస్తుందనీ మరో సీనియర్‌ జర్నలిస్టు వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వ విధానాలలో లొసుగులను బహిర్గతం చేయడమే మీడియా పాత్ర అని, ఇప్పుడలా లేకుండా పోయిందని తెలిపారు. కాగా, ఈ విధానంపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వద్దకు వెళ్లామనీ, జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం నుంచి కౌన్సిల్‌ సమాధానం కోరిందని కాశ్మీర్‌ ప్రెస్‌ క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొజుమ్‌ మహమ్మద్‌ అన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates