వెంకటేశా… ఏమిటీ వైపరీత్యం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దారుణంగా తగ్గిపోతున్న దర్శనాలు

తిరుపతి : ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ, గోవింద నామస్మరణలతో మార్మోగే తిరుమల కొండ వెలవెలబోతోంది. దర్శనాలు తిరిగి ప్రారంభించిన తర్వాత కూడా లాక్‌డౌన్‌ కాలపు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోజూ 12 వేల మంది దర్శనాలకు అనుమతించినా అందులో సగం మందీ కొండకు రావడం లేదు. లాక్‌డౌన్‌కి ముందే తిరుమల ఆలయంలో దర్శనాలు రద్దుచేసి ఏకాంతంగా స్వామికి అన్ని పూజాకైంకర్యాలనూ కొనసాగించారు. జూన్‌ 11న తిరిగి దర్శనాలు మొదలు పెట్టినప్పుడు రోజుకు ఆరువేల మందినే ఆనుమతించినా టికెట్ల కోసం భక్తులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడ్డారు. ఆ తర్వాత దర్శనాల సంఖ్యను 9వేలకు పెంచారు. అప్పటికీ భక్తుల రద్దీ కొనసాగడంతో 12 వేలు చేశారు. ఆన్‌లైన్‌లో అనుమతించగానే గంటల్లో టికెట్లు బుక్‌అయిపోయేవి. తిరుపతిలో మాత్రం సర్వదర్శనం టోకెన్లు రోజూ 3వేలు కేటాయించేవారు.

పరిస్థితి చూసి రూ.300 దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అనుమతించారు. శ్రీవాణీ ట్రస్టు కింద బ్రేక్‌దర్శనాలు కూడా మొదలు పెట్టారు. జూలై నెలాఖరు దాకా టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి కూడా. అయితే తిరుమలలో వైరస్‌ జాడే లేదని చెబుతూ వచ్చిన అధికారులు… టీటీడీ ఉద్యోగులు కూడా బాధితులయ్యారని ప్రకటించాక భక్తుల రాక తగ్గింది. రోజురోజుకూ వైరస్‌ వ్యాప్తి పెరగడం, ఏకంగా 17 మంది అర్చకులే కరోనా బారినపడడం, దాదాపు 200 మందికిపైగా టీటీడీ ఉద్యోగులు బాధితులు కావడంతో తిరుమలకు రావడానికి భక్తులు భయపడుతున్నారు. టికెట్లు ముందుగా బుక్‌ చేసుకున్నవారు కూడా ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. జూన్‌ చివరి రెండు వారాల్లో ఏనాడూ పదివేలకు దర్శనాలు తగ్గలేదు. జూలై ఒకటిన 12,273 మంది స్వామిని దర్శించుకున్నారు. వారం రోజులుగా మాత్రం ఈ సంఖ్య దారుణంగా పడిపోతూ వచ్చింది. ఈ నెల 14న 5016 మంది మాత్రమే దర్శనానికి వచ్చారు.

20న కూడా ఈ సంఖ్య 5767కే పరిమితమైంది. ఇంత తక్కువగా స్వామి దర్శనాలకు భక్తులు రావడం తిరుమల చరిత్రలో ఇటీవలకాలంలో ఎన్నడూ లేదు. 1955వ సంవత్సరం వరకే రోజుకు అయిదారువేల మంది భక్తులు దర్శనం చేసుకునేవారు. 1958లో మహాకుంభాభిషేకం తర్వాత ఈ సంఖ్య పెరగడమే తప్ప తరగడం ఎన్నడూ చూడలేదు. లాక్‌డౌన్‌ ముందు సగటున రోజుకు 60 నుంచి 70 వేలమంది దర్శనం చేసుకునే వారు. కాగా ప్రస్తుతం భక్తుల రాక తగ్గిపోవడంతో వెంకన్న హుండీ ఆదాయం కూడా పడిపోతోంది. లాక్‌డౌన్‌కి ముందు రోజుకు రెండు కోట్లు ఉండే ఆదాయం దర్శనాల పునరుద్ధరణ తర్వాత 50 నుంచి 60 లక్షలకు పడిపోయింది. జూన్‌లో అత్యధికంగా 88 లక్షలు వచ్చిన హుండీ ఆదాయం ఈ నెల 20న 38 లక్షలకు పడిపోయింది. దీనికి అనుగుణంగానే తిరుమలలో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి.

ఎందుకీ పట్టుదల?
టీటీడీ పాలకమండలి ఇంత పట్టుదలతో ఎందుకు దర్శనాలు కొనసాగిస్తోందన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. వైరస్‌ మరింత తీవ్రం అయ్యే సూచనలే ఉన్నా మొండి వైఖరి వీడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రోజూ వచ్చే అయిదారు వేల మంది భక్తుల కోసం దాదాపుగా నాలుగు వేల మంది టీటీడీ సిబ్బంది విధులు నిర్వహించాల్సి రావడమే విడ్డూరంగా భావిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉన్నపుడు వైరస్‌ వల్ల పరిస్థితి చేయి దాటిపోతే తిరుమల ప్రతిష్ట మంటగలిసే ప్రమాదం ఉందని స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates