ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ @ 1,000

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • భారత్‌లో ధర వెయ్యిలోపే
  • నవంబరుకల్లా 40 కోట్ల డోసులు
  • మొట్టమొదటి వ్యాక్సిన్‌ ఇదే కావచ్చు
  • ఎస్‌ఐఐ సీఈవో అదర్‌ పూనావాలా

న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ధర భారత్‌లో దాదాపు రూ.వెయ్యి ఉండొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) అదర్‌ పూనావాలా ప్రకటించారు. దీన్ని ‘కొవి షీల్డ్‌’ పేరిట భారత్‌లో తాము ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. మనదేశంతో పాటు అల్ప, మధ్యస్థాయి ఆదాయ దేశాలన్నింటికి పుణెలోని తమ యూనిట్‌ నుంచే ‘కొవిషీల్డ్‌’ పంపిణీ జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ బహుశా ఇదే కావచ్చని అదర్‌ అంచనా వేశారు.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌తో ఆగస్టులో తాము భారత్‌లో చేయబోయే ప్రయోగ పరీక్షల్లోనూ సత్ఫలితాలు వస్తే .. తొలి వ్యాక్సిన్‌గా కొవిషీల్డే నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రయల్స్‌కు అనుమతులు కోరుతూ ఈ వారంలోనే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేస్తామని, అనుమతులు వచ్చిన వెంటనే మనుషులపై ప్రయోగాలను ప్రారంభిస్తామన్నారు. బహుళజాతి ఫార్మా కంపెనీ ఆస్త్రాజెనెకాతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. వచ్చే సంవత్సర కాలంలో ఎస్‌ఐఐ పుణె యూనిట్‌లో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని అదర్‌ ప్రకటించారు. ఇందులో నవంబరు కల్లా కనీసం 30 నుంచి 40 కోట్ల డోసులను విడుదల చేయగలమనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ప్రతినెలా 6 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని, అందులో సగం (3 కోట్లు) భారత్‌కే కేటాయించనున్నట్లు వెల్లడించారు. 2021 మార్చికల్లా భారీ సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్‌ చేరవచ్చని, దేశంలో అందరికీ వ్యాక్సినేషన్‌ జరిగేందుకు రెండేళ్లు పడుతుందన్నారు.

ఆర్‌ఎన్‌ఏ-వ్యాక్సిన్‌తో ఎలుకల్లో సత్ఫలితాలు
వాషింగ్టన్‌ : కరోనా నిర్వీర్యానికి అమెరికాలోని ‘పీఏఐ లైఫ్‌ సైన్సెస్‌’ అభివృద్ధిచేసిన ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ కేండిడేట్‌ ఎలుకలు, కోతి జాతి క్షీరదాలపై సానుకూలంగా పనిచేసింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను అందించిన రెండు వారాల్లోనే ప్రభావం చూపడం ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే కరోనా ఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థం ఎలుకలు, కోతి జాతి క్షీరదాల్లోని శరీర కణాల్లోకి ప్రవేశించి.. వైర్‌సను గుర్తించి, పనిపట్టే ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా ప్రేరేపించింది. దీనికి స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసిన ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు), టీ-సెల్స్‌ కరోనా వైర్‌సను నిర్వీర్యం చేశాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates