కరోనాలో గిరిజనుల కష్టాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా చాలా మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. గిరిజన ప్రాంతంలో కష్టాలు తీవ్రంగా వున్నాయి. గిరిజనుల జీవితాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఒడిషా, ఇటు మైదాన ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో గిరిజనులు భయాందోళనలతో జీవిస్తున్నారు. టూరిజం కేంద్రమైన అరకు ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల నుండి మరసటి రోజు ఉదయం 7 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. అత్యంత క్రమశిక్షణతో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తూ నేటికీ కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు వచ్చాయి. ప్రజల బతుకులు అతులాకుతలం అవుతున్నాయి.

సంతలు లేక గిరిజన జీవితాలు అతలకుతలం
గిరిజన జీవన విధానంలో సంతలు కీలకమైనవి. ఒక్కొక్క సంతలో లక్షలాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. విశాఖ ఏజెన్సీలో 42 సంతలు వున్నాయి. ప్రజలు వందల నుండి వేల సంఖ్యలో సంతలకు వస్తుంటారు. గిరిజనులకు సంతలు బహుముఖ అవసరాలు తీర్చేవిగా వుంటాయి. గిరిజనులు పండించిన పంటలు అమ్ముకొని వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులైన ఉప్పు, పప్పు మొదలు బట్టలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తారు. సంతలు కేంద్రంగానే వైద్యం తీసుకుంటుంటారు. కరోనా నేపథ్యంలో సంతలు జరగడం లేదు. ఈ సీజన్‌లో పనస, క్యారట్‌, క్యాబేజీ, బీన్స్‌, చిక్కుడు, మొక్కజొన్న, టమోటా, పచ్చి మిర్చి వంటి పంటలు చేతికి వస్తాయి. పండించిన పంటలకు ధరలేదని మాయమాటలు చెప్పి దళారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం దళారులను తిప్పికొట్టే చర్యలు చేపట్టడం లేదు. పట్టణ ప్రాంత రైతు బజార్లో, ఇతర ప్రాంతాల్లో అమ్ముకుందామంటే రవాణా సదుపాయం లేదు. గిరిజన సహకార సంస్థ ఈ వస్తువులను కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ సహకారం లేదు. గిరిజన కార్పొరేషన్‌ సహాయం లేక గిరిజన రైతుల బాధలు వర్ణనాతీతం. పండించిన పంటలు తమ అవసరాలు తీర్చుతాయనుకుంటే కరోనా రూపంలో తీవ్ర అన్యాయం జరిగింది. గిరిజనులను చైతన్యవంతం చేసి భౌతిక దూరాన్ని పాటిస్తూ సంతలు నిర్వహణ చేయవచ్చు.

ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలి
‘ఉపాధి’ పనులతో కొంత మేరకు ఉపశమనం వుంటుంది. అరకువేలి మండలం, శరభగుడ మోడల్‌ కోలనీలో వున్న ప్రజలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరంతా ఎక్కువ మంది టూరిజం, మ్యూజియంలో పనిచేసే కార్మికులు. ఇతర అసంఘటితరంగంలో పనిచేసిన వారే. లాక్‌డౌన్‌ వల్ల టూరిజం మూతబడింది. దీనితో వారంతా ఉపాధిహామీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఇప్పటికే కుటుంబానికి100 రోజుల ఉపాధి పనులు పూర్తయ్యాయి. ఇక పని ఇవ్వం అని అధికారులు చెబుతుంటే ప్రత్యామ్నాయం లేక వారు బాధ పడుతున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు ఒకేచోట 150 మంది వరకు పనుల్లో నిమగమై వున్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పని చేస్తున్నారు. కూలీలకు ఇవ్వాల్సిన గునపాలు, పారలు, తట్టలు వంటి పరికరాలు అందజేయలేదు. తమ సొంత పనిముట్లు తెచ్చుకొని పనిచేసుకుంటున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుండి మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ వారు తయారు చేసుకున్న మాస్క్‌లు కొందరు ధరిస్తే, మరి కొందరు టవళ్ళు, మహిళలు చీర కొంగును ముఖానికి కట్టుకొని పనిచేస్తున్నారు. ఇన్ని పరిమితులతో ఉపాధి పనులు చేస్తున్నారు. తమ కూలి డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. వస్తున్న వేతనం కూడా తమ కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రధానంగా బిజెపి, బిజెపి భాగస్వామ్య పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది. వెనుకబడిన ప్రాంతాలకు ముఖ్యంగా అత్యధికులు ఉపాధి కోల్పోయిన ప్రాంతాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలి. కాని బిజెపియేతర పాలిత రాష్ట్రాలపట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. తమ రాజకీయ లబ్ధికోసం బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిస్సా రాష్ట్రాలకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది. ఇలాంటి పరిస్థితిలో ఉపాధిహామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయించి ఆదుకోవాల్సి వున్నా దానికి భిన్నంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 200 రోజులు పని దినాలు, రోజు కనీస వేతనం అమలు చేయకపోతే వచ్చేవి ఆకలి కేకలే.

స్థానికులకు ఉపాధి కల్పించాలి – అవినీతి అరికట్టాలి
ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంలో బిల్డింగ్‌లు, బాత్‌ రూములు, భవనం నిర్మాణాలు, రిపేర్లు వంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది ఉపాధి పొందుతున్నారు. నాణ్యత పేరుతో ఇసుకను విశాఖ నగరం నుండి ఏజెన్సీకు తెస్తున్నారు. అనంతగిరి మండలం కాశీపట్నం, డుంబ్రిగుడ మండలం గోరాపూర్‌లో ఇసుక పుష్కలంగా దొరుకుతుంది. ఏజెన్సీలో ఒక లారీ ఇసుక రూ.5000/-లు అయితే విశాఖ నగరం నుండి తీసుకొస్తున్న ఇసుకకు రూ. 35వేల నుండి 40వేల వరకు ఖర్చు అవుతుంది. ఇది కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చే పథకంగా మారబోతుంది. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లో ఏర్పాటు చేసి అక్కడ నుండి ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వ నిబంధన. కాని ఏజెన్సీలో దీనికి భిన్నంగా జరుగుతోంది.

కరోనా విజృంభించడంతో ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్‌ వ్యాధుల బారినపడిన వారిని కూడా విశాఖ కెజిహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. టూరిజం కేంద్రమైన అరకులో కరోనా టెస్ట్‌ కేంద్రం పెట్టలేదు. గిరిజన ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమౌతుంది. ఆటో, క్యాబ్స్‌, కార్లు, జీపులు వంటి వాహనాలు నడుపుకుంటూ వందల మంది జీవిస్తున్నారు. నేడు ఆ వాహనాలు రోడ్లపై నిలిచి వున్నాయి. ఎక్కువ మంది వాహనాల కొనుగోలుకు ప్రైవేట్‌ ఫైనాన్స్‌, బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు. రుణాలు కట్టమని ఆ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వానికి వివిధ రకాల టాక్స్‌లు చెల్లించాల్సి వస్తుంది. గత్యంతరం లేక వాహనాలు అమ్ముకుని అప్పులు తీర్చుకుంటున్నారు. కొంతమంది డిసెంబర్‌ వరకు అప్పులు తీర్చకుండా ఉండటానికి టాక్స్‌, లోన్‌ హాలీడేని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు.

ప్రజలను ఆదుకోవాలి
కరోనాతో విలవిలలాడుతున్న గిరిజన ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలి. వివిధ పంటలను గిరిజన కార్పొరేషన్‌ ద్వారా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలి. నిత్యావసర సరుకులు డి.ఆర్‌.డిపోలు, వాలంటీర్ల ద్వారా అందించాలి. వెనుకబడిన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన పథకం ద్వారా 200 రోజులు అమలు చేయాలి. ప్రతి కుటుంబానికి ప్రతి నెలా రూ.7,500/-లు చొప్పున డిసెంబర్‌ వరకు చెల్లించాలి. ప్రతి వ్యక్తికి నెలకు 10కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలి. కేరళ తరహాలో 17 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలి. లేనియడల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజల ఆకలి కేకలు తప్పవు.

కె. లోకనాథం
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates