ఆశలు రేకెత్తిస్తున్న ‘ఆక్స్‌ఫర్డ్‌’ వ్యాక్సిన్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • మనుషులపై తొలి 2 దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు
  • వలంటీర్లలో యాంటీబాడీలు, టీ-సెల్స్‌ క్రియాశీలం
  • రెండు వైపులా పదునున్న కత్తిలా వైరస్‌పై వ్యాక్సిన్‌ దాడి
  • ప్రయోగ పరీక్షల వివరాలతో లాన్సెట్‌ జర్నల్‌లో అధ్యయన నివేదిక
  • ఇది గొప్ప శుభవార్త : డబ్ల్యూహెచ్‌వో
  • ఆగస్టు నుంచి భారత్‌లోనూ పరీక్షిస్తాం : సీరం ఇన్‌స్టిట్యూట్‌
  • సెప్టెంబరుకల్లా వ్యాక్సిన్‌ అంచనాలు

లండన్‌ : కరోనా వ్యాక్సిన్‌ తయారీలో అందరికంటే ముందున్న బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ.. మనుషులపై జరిపిన తొలి 2 దశల ప్రయోగ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేసి.. యాంటీబాడీలు, టీ-సెల్స్‌ను చైతన్యవంతం చేసిందని ప్రకటించింది. ఈ మేరకు వివరాలతో ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ఓ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం.. బ్రిటీష్‌ – స్వీడిష్‌ బహుళజాతి ఫార్మా కంపెనీ ఆస్త్రా జెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలు కలిసి ‘ఏజెడ్‌డీ1222’ పేరిట అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ను అందించిన 18 నుంచి 55 ఏళ్లలోపు 1,077 మంది వలంటీర్లలో సానుకూల ఫలితాలు వచ్చాయి.

వలంటీర్లకు వ్యాక్సిన్‌ను అందించిన 14 రోజుల తర్వాత టీ-సెల్స్‌ సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరగా.. యాంటీబాడీలు 28 రోజుల తర్వాత పతాకస్థాయికి పెరిగాయి. కేవలం ఒక్క వ్యాక్సిన్‌ డోసుకే దాదాపు 90 శాతం మందిలో వైర్‌సను కట్టడి చేసే యాంటీబాడీలు ఉత్పత్తి కాగా, మిగతా 10 శాతం మందిలో రెండో డోసుల వ్యాక్సినేషన్‌ తర్వాత వెలువడ్డాయి. ఈ క్రమంలో వాళ్లలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తకపోగా.. వ్యాక్సిన్‌ ప్రభావంతో యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు), టీ-సెల్స్‌ చైతన్యవంతమై వైర్‌సను తిప్పికొట్టాయు. అతి కొద్దిమంది వలంటీర్లకు అప్పుడప్పుడు స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తినా.. పారాసెటమాల్‌ను అందించగానే తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే రెండు డోసులు సురక్షితమని, ఒక డోసుతో తలెత్తే ప్రభావాన్ని తదుపరి దశ ప్రయోగాల్లో పరీక్షిస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఈ ఫలితాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న మానవాళికి కొత్త ఆశలను రేకెత్తించేలా ఉన్నాయని చెబుతున్నారు.

అమెరికాలో 30వేల మందిపై పరీక్షలు
ఇక రోగ నిరోధక వ్యవస్థ వ్యాక్సిన్‌ను బాగా గుర్తుంచుకుంటోందని ప్రయోగ పరీక్షల ఫలితాల్లో స్పష్టమైందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న ‘ఆక్స్‌ఫర్డ్‌’ శాస్త్రవేత్త ఆండ్రూ పోలార్డ్‌ అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన వ్యాక్సిన్‌ ప్రజలకు వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ కలిగించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈవిషయాన్ని గట్టిగా ధ్రువీకరించాలంటే వ్యాక్సిన్‌పై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఫలితాలపై ‘ఏజెడ్‌డీ1222’ వ్యాక్సిన్‌ ఆవిష్కృతమైన జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ) డైరెక్టర్‌ అడ్రియన్‌ హిల్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ వ్యాక్సిన్‌ రెండువైపులా పదునున్న కత్తిలా పనిచేస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అమెరికాలో 30వేల మంది, బ్రిటన్‌లో 10వేల మంది, దక్షిణాఫ్రికాలో 2వేల మంది, బ్రెజిల్‌లో 5వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తొలి రెండు దశల ప్రయోగ ఫలితాలు సానుకూలంగా రావడాన్ని గొప్ప శుభవార్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. ఈ పరిణామంపై భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా స్పందించారు. ఆగస్టు నుంచి తాము ఆ వ్యాక్సిన్‌ కేండిడేట్‌తో ప్రయోగాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందుకు అనుమతుల కోసం ఈ వారంలోనే దరఖాస్తు చేసుకుంటామన్నారు. అయితే సెప్టెంబరుకల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌ రిసెర్చ్‌ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ డేవిడ్‌ కార్పెంటర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.  కాగా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధిచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘వెక్టర్‌’ రకానికి చెందింది.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఇలా..
వ్యాక్సిన్‌ను పరీక్షించిన వలంటీర్ల బృందాలు ఒకదానిలో 543 మంది, రెండో దానిలో 534 మంది ఉన్నారు. ఒక గ్రూపునకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను.. రెండో బృందానికి మెనింగోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. మెనింగోకోకల్‌ వ్యాక్సిన్‌ వేసిన వారితో పోలిస్తే.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో అలసట, తలనొప్పి కనిపించాయి. పారాసెటమాల్‌తో సమస్య పరిష్కారమైంది.

వ్యాక్సిన్‌ ప్రయోగానికి ముందు పారాసెటమాల్‌ ఇచ్చినవారిలో 40 మందికి అలసట, 34 మందికి తలనొప్పి రాగా.. వ్యాక్సిన్‌ ప్రయోగానికి ముందు పారాసెటమాల్‌ ఇవ్వనివారిలో 340 మందికి అలసట, 331 మందికి తలనొప్పి వచ్చాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates