గాలికొదిలేశారు: తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది.. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే
సీఎస్‌ సహా ఆరుగురికి సమన్లు
బులెటిన్‌, పడకల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారు
ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
ఇద్దరు సంచాలకుల్ని తొలగించలేదేం?
కోర్టు ధిక్కారం ఎందుకు పెట్టొద్దు?
జాగ్రత్తలు తీసుకోకపోతే స్పెయిన్‌, ఇటలీ, అమెరికాల్లో పరిస్థితే ఇక్కడా 2 కోట్ల కేసులొస్తే ఎదుర్కోగలరా?
రాబోయే రోజుల్లో దారుణ పరిస్థితులు.. సర్కారుకు అవగాహనారాహిత్యం
సర్కారుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం

కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ఇది మీకిచ్చే నాలుగో, చివరి అవకాశం. దీనిని అమలు చేయకపోతే ఉద్యోగాలు పోతాయ్‌.

కరోనా విషయంలో ఓవైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారు.

ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం చికిత్స చేయాలని మేమిచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు. అధికారులు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారా…!
– హైకోర్టు

హైదరాబాద్‌: ‘‘ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసింది’’ అని హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, సమాచారం అందిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడం నేరపూరిత నిర్లక్ష్యమని, దానిలో ధర్మాసనం భాగస్వామి కాజాలదని స్పష్టం చేసింది. బులెటిన్‌, పడకల వివరాల విషయంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు పెంచాలని, వైరస్‌ సోకినవారికి ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం చికిత్స అందించాలంటూ తామిచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది.కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డిలకు ఎందుకు ఉద్వాసన పలకడం లేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. అధికారులు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారా…! అని ఆశ్చర్యపోతున్నానని ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌ వ్యాఖ్యానించారు. కోర్టు ఇచ్చిన స్వల్ప ఆదేశాలనే అమలు చేయని అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించడమే కాకుండా కోర్టు ధిక్కారంతోపాటు సీఆర్‌పీసీ సెక్షన్‌ 156 కింద వారిపై కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించింది.

తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్యం, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని నిర్దేశించింది. తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఎండగట్టింది. కరోనా వైర్‌సకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని, మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతూ విశ్రాంత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, సూర్యాపేటకు చెందిన సంకినేని వరుణ్‌, నిర్మల్‌కు చెందిన న్యాయవాది చిన్నోళ్ల నరేశ్‌ రెడ్డి, విశ్రాంత వైద్యులు డాక్టర్‌ కేపీ రాజేందర్‌, న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ తదితరులు దాఖలు చేసిన 9 ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కరోనా చికిత్స, టెస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రోజువారీ బులెటిన్లలో పేర్కొనాలని తేల్చి చెప్పింది.

ఆ వ్యాజ్యాల్లో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఇచ్చిన నివేదికలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్‌లో 21-24 సంవత్సరాల మధ్యనున్న వారు ఎంత మంది కరోనా బారిన పడుతున్నారో చూపడం లేదు. పది లక్షల జనాభాకు ఢిల్లీలో 25,145, ఏపీలో 26,121, తమిళనాడులో 14,669, కర్ణాటకలో 9,050, కేరళలో 6,287 మందికి కరోనా పరీక్షలు చేస్తుండగా, తెలంగాణలో 5,962 టెస్టులు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో తిరిగి లాక్‌డౌన్‌ విధించారు. జీహెచ్‌ఎంసీతోపాటు 13 జిల్లాల్లో కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇక్కడెందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదు?’’ అని నిలదీసింది.జాగ్రత్తలు తీసుకోకపోతే, స్పెయిన్‌, ఇటలీ, ఇప్పుడు అమెరికాలో నెలకొన్న పరిస్థితే ఇక్కడ కూడా పునరావృతమవుతుందని చీఫ్‌ జస్టిస్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. ‘‘సెప్టెంబరు నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దాని ప్రకారం, తెలంగాణలో 2 కోట్ల మంది ప్రభావితమవుతారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో ప్రభుత్వం ఉందా?’’ అని నిలదీశారు. రాబోయే రోజుల్లో ఎంత దారుణ పరిస్థితులు రాబోతున్నాయో ప్రభుత్వానికి అవగాహన లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అభినందించామని తప్పుదోవ పట్టిస్తారా?
కరోనా విషయంలో హైకోర్టు తమను అభినందించిందని బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొనడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని నిలదీసింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది.

ఇవి అమలు చేయండి: ధర్మాసనం
జిల్లాల్లో రోజువారీగా వెలుగులోకి వచ్చిన కొవిడ్‌-19 కేసుల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లు ప్రకటించాలి. ఈ సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో వైద్య ఆరోగ్య శాఖకు పంపాలి. దానిని రోజువారీగా విడుదల చేసే మెడికల్‌ బులెటిన్‌లో ప్రచురించాలి.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన సెకండరీ కాంటాక్టుల్లో ఎంతమందికి 5-10 రోజుల్లో పరీక్షలు చేశారో తెలపాలి.

వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలి. దాని నుంచి తొలగించిన పూర్వ సమాచారాన్ని పొందుపరచాలి.

కరోనాకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక పట్టికలో ప్రత్యేకంగా ప్రచురించాలి. దానిని స్థానిక పత్రికలతోపాటు ఇంగ్లిషు పత్రికల్లో రోజువారీ ప్రాతిపదికన ప్రచురించాలి.

ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు కొవిడ్‌-19 చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల సమాచారాన్ని మెడికల్‌ బులెటిన్లలో పేర్కొనాలి.

ఏ ఆస్పత్రిలో, లేబొరేటరీలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నారో బులెటిన్‌లో ప్రకటించాలి. ఆర్‌ఏటీ పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రజలకు చాలా అవసరం.

ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్‌ నంబరు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆ నంబరుకు ప్రచారం కల్పించాలి. అన్ని ప్రాంతీయ పత్రికల్లో, ఎలక్ర్టానిక్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి.

పెళ్లిళ్లకు 50 మందికి మించరాదు. కేంద్ర ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి. ఉల్లంఘనులపై ఏమేమి చర్యలు తీసుకున్నారో కోర్టుకు చెప్పాలి.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates