బాలింత మరణాల కట్టడిలోనూ కేరళ టాప్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-అట్టడుగున బీజేపీ పాలిత అసోం, యూపీ, మధ్యప్రదేశ్‌
– ఉత్తరాది రాష్ట్రాల్లో పాక్షిక వృద్దే..
– కేంద్రానికి రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదిక
– పిల్ల తల్లుల సంరక్షణలో సౌతిండియాదే అత్యుత్తమ పనితీరు
– నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ: మాతమూర్తుల మరణాల తగ్గింపు లేదా కట్టడిలో వామపక్ష పాలిత రాష్ట్రమైన కేరళ దేశంలోనే టాప్‌ స్థానంలో నిలిచింది. అక్కడి ప్రభుత్వం బాలింతల సంరక్షణకు అవలంభించిన పథకాలు, అత్యుత్తమ పనితీరు ఇందుకు దోహదపడిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిపోర్టు అభిప్రాయపడింది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లు మాత్రం మాతృమూర్తుల సంరక్షణలో చిట్ట చివరిస్థానంలో నిలిచాయి. శిశు మరణాల రేటుని అరికట్టడంలోనూ ఈ రాష్ట్రాలు పేలవమైన ప్రదర్శన చూసిన తెలిసిందే. అయితే, బాలింతల రక్షణలో గతం కంటే ఇవే బీజేపీ పాలిత రాష్ట్రాలు పాక్షిక వద్ధి సాధించినట్టు… పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోయినట్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ విభాగం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఆ రిపోర్టు ప్రకారం, ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణ భారత రాష్ట్రాలే… పిల్లల తల్లుల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించాయి. కాగా, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 49 ఏండ్ల మధ్య గల మహిళలు… పిల్లలకి జన్మనిచ్చే క్రమంలో లేదా కొద్ది రోజుల తర్వాత మృతి చెందితే దాని ఆధారంగా బాలింత మరణాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రసవాల సమయంలో 2018 వరకు లెక్కించిన గణాంకాల ప్రకారం మెటర్నల్‌ డెత్స్‌ (పిల్ల తల్లుల మరణాలు) 7.4 శాతం తగ్గినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేసింది. కాగా, 2015-2017 సంవత్సరాలకి గానూ ప్రతి లక్ష జననాలకి 122 మంది పిల్ల తల్లులు మృతి చెందగా… 2016-18 సంవత్సరానికి ఆ సంఖ్య 113కి తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌)లో భాగంగా మెటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌ (ఎంఎంఆర్‌) లెక్కలను కూడా రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా రికార్డ్‌ చేసింది. దీనికి సంబంధించిన నివేదికని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల మీడియాకి విడుదల చేసింది.

అసోం, యూపీల్లో అత్యధికం… కేరళలో అత్యల్పం
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ఆధారంగా… 2015-17 సమయానికి గానూ దేశంలో 11,880 బాలింత మరణాలు సంభవించాయి. అయితే, 2016-18 సంవత్సరాలకు 10,890 పిల్లల తల్లులు మరణిస్తే… సమారు 990 మంది బాలింతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సంయుక్త కృషితో కాపాడుకోగలిగామని నివేదిక అభిప్రాయపడింది. 2014-16 సంవత్సరాల దేశ సగటు ఎంఎంఆర్‌ 130 ఉంటే, 2015-17 సంవత్సరాల సగటు ఎంఎంఆర్‌122కు తగ్గింది. అయితే, 2016-18 సంవత్సరాలకు 113కు తగ్గిముఖం పట్టింది.

సర్వే చేపట్టే క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి మూడు విభాగాలుగా చేశారు. అసోం, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను సాధికారికత చేయాల్సిన రాష్ట్రాలు(ఎంపవర్‌డ్‌ యాక్షన్‌ గ్రూప్‌)గా, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఒక పార్ట్‌(దక్షిణాది రాష్ట్రాలుగా)గా, మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలుగా చేసి సర్వే చేపట్టి దానికి సంబంధించిన ఫలితాలను రిజిస్ట్రార్‌ జనరల్‌ వెల్లడించింది. సాధికారిత చేపట్టాల్సిన విభాగ రాష్ట్రాల్లో మాతల మరణాల రేటు సగటున 175 ఉండగా, సౌత్‌ స్టేట్స్‌లో 72, ఇతర రాష్ట్రాల్లో 90 ఉంది. ఇక అత్యధికంగా అసోంలో ప్రతి లక్ష బాలింతలకు 215, ఉత్తరప్రదేశ్‌లో 197, మధ్యప్రదేశ్లో 173 మెటర్నల్‌ డెత్స్‌ నమోదవుతుండగా, అత్యల్పంగా కేరళలో 43 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులో పేర్కొంది.

తెలంగాణ ఐదు శాతం తగ్గిన ఎంఎంఆర్‌
దక్షిణాది రాష్ట్రాల సగటు ఎంఎంఆర్‌ గతంలో 77 ఉండగా, ఇప్పుడు72కు తగ్గింది. ఇందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక 97 మెటర్నల్‌ డెత్స్‌తో సౌతిండియాలో ఆఖరి స్థానంలో ఉంది. పక్కనున్న ఆంధప్రదేశ్‌లో కూడా 63 మాతృమూర్తుల మరణాలు చోటు చేసుకున్నట్టు సమా చారం. అయితే, తెలంగాణలో ఎంఎంఆర్‌ గతంలో 81 ఉంటే, ఇప్పుడు ఐదుశాతం తగ్గి 63కి చేరింది. ఇక మెటర్నల్‌ డెత్స్‌లో అత్యధికంగా 24 ఏండ్ల లోపు వయసు యువతులవే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక పేర్కొంది. ప్రతి వంద మెటర్నల్‌ డెత్స్‌లో 15 నుంచి 19 ఏండ్లలోపు వయసున్న తల్లుల మరణాలు 4శాతం, 20 నుంచి 29 ఏండ్లలోపు తల్లుల మరణాలు 3.4శాతం ఉంటున్నట్టు రిపోర్టులో వెల్లడైంది. చిన్న వయసులో పెండ్లిళ్లు కావడం, పోషకాహారలోపం, రక్త హీనత వంటివి ఎక్కువగా మెటర్నల్‌ మరణాలకు దారితీస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో మాత మరణాలు జీరోకి చేరేదెప్పుడు?
తెలంగాణ మాతమూర్తుల మరణాలు జీరో శాతానికి చేరుకోవాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కషి చేస్తుందని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర ఆవిర్భావమై, సుమారు ఆరు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఆ లక్ష్యానికి చేరుకోలేదు. రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్‌, బాలింతలకు ఇచ్చే రూ.12 వేల ఆర్థికసాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నా… తాను నిర్దేశించుకున్న జీరో లక్ష్యాన్ని ఎందుకు చేరుకోవడం లేదన్నపై కేసీఆర్‌ సర్కారు సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

బాలింత మరణాలు సగటు (2016-18) శాతం
అసోం 215 14.0
ఉత్తరప్రదేశ్‌ 197 17.8
మధ్యప్రదేశ్‌ 173 15.9
ఆంధ్రప్రదేశ్‌ 65 3.6
తెలంగాణ 63 3.6
కేరళ 43 2.1

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates