తెలంగాణ: 6 జిల్లాల్లో అత్యధిక డెత్‌ రేట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-9.87 శాతంతో నారాయణపేట టాప్‌
– నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఆరుకుపైనే..
– నిజామాబాద్‌, ఖమ్మం, మెదక్‌లో 5శాతం నమోదు
– కొన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య గల్లంతు
– కరోనా నివారణ చర్యలు గాలికొదిలేసిన యంత్రాంగం

హైదరాబాద్‌: అన్‌లాక్‌ దశలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించిన వైరస్‌ ఎక్కడ బయటపడుతుందో తెలియని స్థితి నెలకొన్నది. సద్దుమణిగిం దని భావించిన కొన్ని జిల్లాల్లో మళ్లీ విజృంభణ కొనసాగడంతో పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల శాతం కూడా పైపైకి ఎగబాకుతోంది. జిల్లాల్లో కరోనా నివారణ చర్యలు గాలికి వదిలేయడం, కాంటాక్టుల విషయం విస్మరించడంతో పరిస్థితి సాధారణంగా మారిపోయిందనే భావన వ్యక్తమవుతున్నది. కేసులు తక్కువగా ఉన్న సమయంలో కంటైన్మెంట్‌ చేసి, పెరుగుతున్న తరుణంలో ఇండ్లకే పరిమితం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడికక్కడ కట్టడి చేసిన అధికారులు అన్‌లాక్‌లో చర్యలు తగ్గించినట్లు ప్రజలు భావిస్తున్నారు. మార్కెట్లలోకి అనుమతులిచ్చినా గుంపుగుంపులుగా బయటకు వస్తుండటంతో ఎక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా పోతోంది. అన్‌లాక్‌ కంటే ముందు నిజామాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాల్లో కట్టడైన కరోనా మళ్లీ వ్యాప్తిం చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల 24 గంటల్లోనే 6గురు మరణించిన నేపథ్యంలో జిల్లాలో మరణాల శాతమూ పెరుగుతోంది. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లోనూ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు నారాయణపేట జిల్లా మరణాల రేటులో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 6.72శాతం నాగర్‌కర్నూల్‌ రెండోస్థానంలో ఉంది. వీటితో పాటు మరో నాలుగు జిల్లాలు 5శాతాన్ని మించిపోయాయి. మొత్తం మరణాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ 300తో టాప్‌లో ఉండగా.. డెత్‌ రేటులో మాత్రం 1.15 శాతంతో అట్టడుగులో ఉంది. రంగారెడ్డి జిల్లాలోనూ 42 మంది మరణించగా.. 1.07 శాతంతో గ్రేటర్‌ కంటే కిందిస్థానంలో నిలిచింది. సంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ అర్బన్‌ (12) ఈ ఆరు జిల్లాల్లో అత్యధిక మృతులున్నారు.

లెక్కల్లో తేడాలు..
కొన్నిచోట్ల పాజిటివ్‌ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నా అధికారులు మాత్రం పొంతన లేకుండా చూపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 187 మందికి పాజిటివ్‌ కేసులు వస్తే 120 మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. ఏడుగురు మరణించగా ఇద్దరే చనిపోయినట్లు లెక్కల్లో వెల్లడిస్తున్నారు. మిగతా ఐదుగురికి సంబంధించిన సమాచారాన్ని పేర్కొనడం లేదు. చౌటుప్పల్‌లో రిటైర్డ్‌ టీచర్‌, రామన్నపేటలో విడో మహిళ, రాజపేట మండలం దూదివెంకటపురంలో బాలింత, యాదగిరిగుట్టలో ఆటోడ్రైవర్‌, వలిగొండలో మాజీ సర్పంచ్‌, భువనగిరిలో యువకుడు, బొమ్మలరామారంలో ఒక వ్యక్తి చనిపోయిన తరువాత కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇలా ఏడుగురు చనిపోగా ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం.

శానిటైజ్‌ మానేశారు…
పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లోనూ శానిటైజ్‌ చేయడం లేదని తెలుస్తోంది. ఆ ఇంటిని కంటైన్మెంట్‌గా ప్రకటించి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ సాధారణ స్థితితోనే వ్యాప్తి జరుగుతున్నట్టు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో ఒకేరోజు 92 కేసులు, వనపర్తి జిల్లాల్లో 51 కేసులు నమోదుకావడం పట్ల అధికారుల చర్యలపై విమర్శలొస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని కాపువాడ, విద్యానగర్‌, బోయవాడ, కిసాన్‌నగర్‌, ఓల్డ్‌బజార్‌, టవర్‌సర్కిల్‌, శాస్త్రినగర్‌లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తపల్లి, వీణవంక, హుజురాబాద్‌, జమ్మికుంట, రామడుగు మండలాల్లో కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నా పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోనే పరిస్థితి క్షీణిస్తోంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates