ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా నుంచి ‘రెట్టింపు రక్షణ’

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19కు సరైన టీకాను అందించే దిశగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముందడుగు వేశారు. వీరు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ నుంచి ‘రెట్టింపు రక్షణ’ లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది.

ఈ ప్రయోగాత్మక టీకాను పొందిన వాలంటీర్ల నుంచి రక్త నమూనాలను ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు పరిశీలించారు. యాంటీ బాడీలతోపాటు వైరస్‌ హంతక ‘టి కణాల’ను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు ఈ నమూనాలు చెబుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘ఇది చాలా కీలకాంశం. ఎందుకంటే యాంటీబాడీలు కొద్ది నెలల్లోనే సమసిపోతాయని, టి కణాలు మాత్రం ఏళ్ల తరబడి రక్తంలో ఉంటాయని విడిగా చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. పరీక్ష ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. కరోనా వైరస్‌ నుంచి సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఇంకా రుజువు కాలేదు. అయితే ఇది టి కణాలను, యాంటీబాడీ ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడం వల్ల ప్రజలకు కరోనా వైరస్‌ నుంచి మరింత రక్షణ లభించే అవకాశం ఉంది. ప్రయాణించాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని వివరించాయి.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అభివృద్ధి ప్రక్రియ సరైన దిశలో సాగుతుందని బెర్క్‌షైర్‌ పరిశోధక నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌ డేవిడ్‌ కార్పెంటర్‌ చెప్పారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలకు అనుమతించింది ఈ కమిటీయే. ‘‘అయితే ఎప్పటిలోగా ఇది వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు ఎదురుకావొచ్చు. అయితే అతిపెద్ద ఔషధ కంపెనీతో కలిసి పనిచేయడం వల్ల సెప్టెంబరు నాటికి ఈ టీకా అందుబాటులోకి రావొచ్చు. ఈ లక్ష్యం దిశగానే ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు’’ అని డేవిడ్‌ చెప్పారు.

సీహెచ్‌ఏడీఓక్స్‌1 ఎన్‌కోవ్‌-19 అనే ఈ టీకాను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తోంది. దీనికి బ్రిటన్‌ ప్రభుత్వం, ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు మొదలయ్యాయని, దీనికింద వేల మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి, దాని సమర్థతను పరిశీలిస్తామని ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలిపింది. చింపాంజీల్లో ఇన్‌ఫెక్షన్లను కలిగించే ఒక వైరస్‌కు సంబంధించిన బలహీన వెర్షన్‌ ఆధారంగా ఈ టీకా రూపొందింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates