లక్ష్యం లేని లాక్డౌన్లు…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కారణాలేంటో తెలియజేయడంలో ప్రభుత్వాలు విఫలం
– ఏకపక్ష నిర్ణయాలతో జనానికి తప్పని తిప్పలు
– ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్థానికంగా నిర్బంధం

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ విధానం సహేతుకంగా ఉండటం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి విధిస్తున్న లాక్‌డౌన్లు వృథా అవుతున్నాయనే వాదన వినిపిస్తున్నది. దేశంలోని రాష్ట్రాలను సంప్రదించకుండా ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మోడీ సర్కారు విధించిన తొలి దశ లాక్‌డౌన్‌ సామాన్య జనాన్ని, పేదలను, వలసకార్మికులను, చిన్న వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా పొడిగించుకుంటూ వెళ్లిన మోడీ సర్కారు.. కరోనా కేసుల సంఖ్యను మాత్రం కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. వలసకార్మికుల వెతలు, ఆర్థిక నష్టాల్లో రాష్ట్రాలు, దెబ్బతీసిన వ్యాపారాలు దేశాన్ని ఇబ్బందుల పాల్జేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ లేకపోయినప్పటికీ.. పెరుగుతున్న కేసులు, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్థానికంగా లాక్‌డౌన్లను విధించాయి.

కానీ, లాక్‌డౌన్‌ విధింపుల విషయంలో ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంలేదు. దీంతో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య కమ్యూనికేషన్‌, సమన్వయం లోపిస్తోంది. ఫలితంగా అసలు లాక్‌డౌన్‌ను ఎందుకు విధిస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది? లాక్‌డౌన్‌ లక్ష్యం ఏమిటీ? అనే అంశాలు ప్రజలకు చేరటంలేదు. మరికొన్ని చోట్ల ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినన్ని రోజులు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. అయితే దీనికి ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రామాణికత ఏమిటో అర్థం కావడంలేదు. నిర్హేతుకమైన ఈ నిర్ణయాలు కరోనా కట్టడి లక్ష్యాన్ని సాధించలేకపోగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

బీహార్‌వ్యాప్తంగా 15 రోజుల లాక్‌డౌన్‌ ఉంటుందని నితీశ్‌ సర్కారు ఇటీవలే ప్రకటించింది. జూన్‌ 28 నుంచి గువహతి మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. బీహార్‌ రాజధాని పాట్నా జూన్‌ 10 నుంచి లాక్‌లో ఉన్నది. మహారాష్ట్రలోని పూణెలోనూ లాక్‌డౌన్‌ మొదలైంది. కర్నాటక సర్కారూ బెంగళూరులో ఇదే నిర్ణయాన్ని తీసుకున్నది. కోల్‌కతాలో కూడా లాక్‌డౌన్‌ ప్రకటించారు. యూపీలో వారాంతంలో (శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 5 వరకు) మూసివేతలు ఉంటాయి. అయితే ఓ వార్త సంస్థ సమాచారం ప్రకారం.. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఈ స్థానిక లాక్‌డౌన్లతో ప్రభావితమవు తున్నారు. దేశమొత్తం లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం కంటే.. స్థానిక లాక్‌డౌన్ల వైపే మొగ్గు చూపాలని నిపుణులు సిఫారసు చేశారు. కానీ, వాటి అమలు సక్రమంగా లేకపోవడం కారణంగానే నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయని వారు అంటున్నారు.

సమాచార లోపం
స్థానిక లాక్‌డౌన్లు మంచి చర్యే అయినప్పటికీ.. వాటి లక్ష్యాలను ప్రజలకు తెలియపర్చడంలో స్థానిక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అసలు లాక్‌డౌన్లను అంత అకస్మాత్తుగా ఎందుకు ప్రకటిస్తున్నాయో అన్న ప్రశ్నలకు తగిన సమాధానం లేదు. కరోనా కేసులలో భయంకరమైన పెరుగుదలతో బీహార్‌ లాక్‌డౌన్‌ ఆదేశాలు జారీచేసింది. అయితే కేసుల పెరుగుదల రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్నది. అయితే ఈ నిర్బంధ నిర్ణయాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకున్నారో స్పష్టత లేదు. అంతే కాదు, ఈ 15 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అన్నదానిపై బీహారీలకు నితీశ్‌ సర్కారు తెలియజేయలేదు.

దాదాపు నెలలుగా భారత్‌.. కరోనా వైరస్‌పై పోరాడుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ చర్యలు చాలా వరకు ఏకపక్షంగా ఉన్నాయి. వలసకార్మికులు తాము ఉంటున్న నగరాలను విడిచిపెట్టివెళ్లొదంటు వచ్చిన ఆదేశాలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ విధంగా ప్రతిసారీ అస్తవ్యస్త లాక్‌డౌన్‌ ఆదేశాలను పాటించడం భారతీయులకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు.. లాక్‌డౌన్‌పై ఉండే సీరియస్‌నెస్‌ ప్రజల్లో తగ్గే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ‘అధికార నిర్ణయాల’ను ప్రజలపై రుద్దకుండా.. నిర్ణయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రజాసంఘాల వాదన. కానీ మోడీ సర్కార్‌కు ఇవేం చెవికెక్కటం లేదు. వలసకార్మికులకోసమంటూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలేవీ..వారికి అందటంలేదని అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు వమ్ముఅయ్యాయంటూ..సొంతూర్లకు వెళ్లిన కార్మికులంతా ఇపుడు పొట్టచేతపట్టుకుని ఉపాధికోసం నగరాల బాట పడుతున్నారని అధికారగణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్టు లాక్‌డౌన్‌ తీరు మారుతున్నదన్నది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ మారింది. ముందస్తు ప్రణాళిక లేకుండా.. హడావుడిగా మోడీ సర్కార్‌ తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం ఇప్పటికే కాదు.. సుదీర్ఘప్రభావం పడనున్నది. కేంద్రం మార్గదర్శకాలతో జనాన్ని నియంత్రిస్తూ.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ హోల్‌సేల్‌గా అమ్మకాలకు పెడుతున్నది. రాష్ట్రాలకు పైసలు విదిల్చకుండా..కరోనా కేసులు పెరుగుతుంటే..మీ చావు మీదే అంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని రాష్ట్రాలు ఇటు కోవిడ్‌-19కు మందులేక.. ఇంకోవైపు జనాన్ని కాపాడటానికి లాక్‌డౌన్‌ ఒక్కటేనన్న వాదన రాష్ట్ర పాలకుల్లో వ్యక్తమవుతున్నది. అయితే కరోనా కేసులు, మరణాలు ఆగటంలేదు. ఇంకోవైపు గత మూడునాలుగునెలల నుంచి ఉపాధికి దూరమైన వలసకార్మికులు దిక్కుతోచక…తిరిగి పొట్టచేతపట్టుకుని మళ్లీ నగరాలబాట పడుతున్నారు.

COurtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates