ఒకరికొకరు తోడుగా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-వైద్యులందరూ కలిసికట్టుగా…
– హెచ్‌ఆర్‌డీఏ ఆధ్వర్యాన పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
– రూ.60 లక్షల విలువైన కిట్లు అందజేత
– పీహెచ్‌సీ నుంచి గాంధీ, ఉస్మానియా దాకా వితరణ
– సర్కారు సాయానికి తోడు తమ వంతు కృషి అంటున్న ప్రతినిధులు

బి.వి.యన్‌.పద్మరాజు
వారందరూ ప్రభుత్వ వైద్య రంగంలో పని చేసే డాక్టర్లు. ఆ రంగంలో నిష్ణాతులు. రోగులు, చికిత్సలు, శస్త్ర చికిత్సలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు ఆయువు పోస్తున్న సేవాతత్పరులు. కోవిడ్‌-19 రాష్ట్రంలో వ్యాపించినప్పటి నుంచి వంతుల వారీగా డ్యూటీలు చేస్తూ.. వైరస్‌ విజృంభణతో కుటుంబాలకు దూరంగా గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కార్యదీక్షులు. ఈ క్రమంలో కరోనాకు చికిత్సలందించే వైద్యులకు అత్యంత ప్రధానమైంది పీపీఈ కిట్లు. వీటిని ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి పంపాలంటూ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం… కరోనా తొలి దశలో (మార్చి, ఏప్రిల్‌ నెలలు) తన శక్తిమేరకు వీలైనంతగా కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఇదే సమయంలో హైదరాబాద్‌ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న హెల్త్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయానికి తోడు తనవంతుగా సర్కారీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందించాలని నిర్ణయించింది. తద్వారా వైద్యులు కోవిడ్‌ బారిన పడకుండా.. తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూనే రోగులకు సేవలందించేందుకు వీలు కలుగుతుందని భావించింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా… హెచ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ లోని ఎమ్‌జీఎమ్‌ వైద్య కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు, అక్కడ చదవుకుని వైద్య రంగంలో స్ధిరపడిన వారి ముందూ తమ ఆలోచలను పరిచారు. దీంతోపాటు తమ హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు విషయాన్ని విడమరిచి చెప్పారు.

కరోనా నేపథ్యంలో వైద్యులకు అత్యంత ఆవశ్యకమైన పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులను పంపిణీ చేసేందుకు వీలుగా ఆర్థిక సాయం చేయాలంటూ కోరారు. ఈ క్రమంలో మార్చి నుంచి ఇప్పటి దాకా రూ.60 లక్షల విరాళాలను హెచ్‌ఆర్‌డీఏ సేకరించింది. ఆ డబ్బు ద్వారా పీపీఈ కిట్లతోపాటు ఇతరాలను కొనుగోలు చేశారు. తద్వారా మారుమూలనున్న పీహెచ్‌సీల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా దాకా దాదాపు నాలుగు వేల మంది వైద్యులకు, మరో 1,500 మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి వీటిని అందజేశారు. తాజాగా ఫేస్‌ షీల్డ్‌ (ప్లాస్టిక్‌తో తయారు చేసేవి, ముఖానికి ధరించేవి)… మాస్క్‌లను పంపిణీ చేసేందుకు హెచ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు.

మున్ముందు మరిన్ని సేవలు…
డాక్టర్‌ మహేశ్‌ : అధ్యక్షుడు, హెచ్‌ఆర్‌డీఏ
‘కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు. అందువల్ల ఈ మహమ్మారి ఉన్నంతకాలం ఇటు సాధారణ ప్రజలు, కోవిడ్‌ సోకినవారు, అటు వారికి వైద్యమందించే డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మేం ఇంకో ఆరేడు నెలల వరకూ పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజుల పంపిణీని కొనసాగిస్తాం. తద్వారా వైద్యుల ఆరోగ్యాన్ని కాపాడటంలో క్రియాశీలక పాత్రను పోషించాలని భావిస్తున్నాం. మా ఈ ప్రయత్నానికి ఆర్థికంగా, హార్థికంగా సహకరిస్తున్న వారందరికీ హెచ్‌ఆర్‌డీఏ తరఫున ధన్యవాదాలు…’

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates