రేషన్‌.. పరేషాన్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-వలస కార్మికుల సంఖ్యపై మోడీ సర్కారు వద్ద లేని స్పష్టత
-గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద 8 కోట్ల మందికి ప్రయోజనమని మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన
– మే, జూన్‌ నెలల్లో  2.5 కోట్ల మందికి మాత్రమే అందిన రేషన్‌

న్యూఢిల్లీ : దేశంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన అనాలోచిత లాక్‌డౌన్‌ కారణంగా వలసకార్మికులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంతో మంది తిండిలేక అలమటిం చారు. సొంత ఊర్లకు వెళ్లాలనే తపనతో కాలినడకన పయనం సాగించి ప్రాణాలూ ఒదిలిన సంఘటనలు అనేకం. అయితే దేశంలో వలసకార్మికులు ఎంత మంది ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం కేంద్రం వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. గరీభ్‌ కళ్యాణ్‌ యోజన, ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌(ఏఎన్‌బీఏ) వంటి డొల్ల పథకాలతో మోడీ సర్కారు అతిగా ప్రచారం చేసుకున్నది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఒక పక్క వాస్తవ లబ్దిదారులను గుర్తించడం కేంద్రానికి కష్టంగా మారింది. మరోపక్క, ఎనిమిది కోట్ల మంది లబ్దిదారులు ఏఎన్‌బీఏ కింద ప్రయోజనం పొందుతారని మే నెలలో మోడీ సర్కారు తెలిపింది. కానీ, ఎలాంటి అధికార గణాంకాలు లేకున్నా.. మోడీసర్కారు ఈ విధంగా ప్రకటనలు చేయడం, వాస్తవంగా అది అనుకున్న రీతిలో కార్యరూపం దాల్చకపోవడం కేంద్రం తీరుకు అద్దం పడుతున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

వలసకార్మికులను ఆదుకునేందుకు ఏఎన్‌బీఏ కింద ఆహార ధాన్యల పంపిణీ కాలపరిమితిని పొడిగిస్తున్నట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్‌ కార్డులు లేని దాదాపు 80 మిలియన్ల మంది వలసకార్మికులు(8 కోట్ల మంది) నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలు(ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు) అందిస్తామని మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. జూన్‌ చివరి నాటికి మొత్తం 8 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ఆహార ధాన్యాలు, 38వేల మెట్రిక్‌ టన్నుల(ఎంటీ) పప్పుధాన్యాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే నిజమైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు కొంత సమయం పట్టిందని కేంద్రం చెప్పడం గమనార్హం.

వాస్తవానికి పంపిణీ చేయాల్సిన 8 ఎల్‌ఎంటీలలో కేవలం 2.32 ఎల్‌ఎంటీ ఆహారా ధాన్యాలను మాత్రమే జులై 9 నాటికి రాష్ట్రాలు పంపిణీ చేశాయి. అంటే ఇది కేవలం 29శాతమే. మే నెలలో 2.24 కోట్ల మంది(22.4 మిలియన్ల మంది) వలసకార్మికులకు, జూన్‌లో 2.25 కోట్ల మంది(22.5మిలియన్ల మంది)కి మాత్రమే ఆహార ధాన్యాలను రాష్ట్రాలు అందించగలిగాయి. కేంద్రం చెప్పిన 8 కోట్ల మంది వలసకార్మికుల లెక్కకు ఇది చాలా తక్కువ. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) నుంచి రాష్ట్రాలు 6.39 ఎల్‌ఎంటీ ఆహార ధాన్యాలను పొందాయి.

మే, జూన్‌ నెలల్లో పంపిణీ చేయాల్సిన 38,000 మెట్రిక్‌ టన్నుల పప్పులలో 10,645 మెట్రిక్‌ టన్నులు మాత్రమే పంపిణీ జరిగింది. మే, జూన్‌ నెలల్లో వసలకార్మికుడికి పంపిణీ చేయాల్సిన ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలను ఆగష్టు 31 లోగా పంపిణీ చేయవచ్చని కేంద్రం ఇప్పుడు తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల, ఆహారా, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ(ఎంసీఏఎఫ్‌పీడీ) ఒక ప్రకటననూ విడుదల చేసింది. 80 కోట్ల మంది(800 మిలియన్ల మంది) జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) లబ్దిదారులకు ఆహార ధాన్యాల పంపిణీని నవంబర్‌ వరకు పొడగిస్తున్నట్టు జూన్‌ 30న మోడీ ప్రకటించారు. కానీ, ఆ ప్రకటనలో ఏఎన్‌బీఏ పొడగింపు లేకపోవడం గమనార్హం.

ఏఎన్‌బీఏతో ఉన్న ప్రధాన సమస్య లబ్దిదారులను గుర్తించడం. దానిని కేంద్రం కూడా ఇప్పుడు అంగీకరించింది. అయితే లబ్దిదారుల జాబితా, సరైన సమాచారం లేకుండానే 8 కోట్ల మంది ఈ దీని ద్వారా లబ్ది పొందుతారని సీతారామన్‌ ప్రకటించడం గమనించాల్సిన అంశం. 80 కోట్ల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్దిదారుల్లో ఇది పదిశాతం. అయితే దేశంలో వలస కార్మికులను అంచనా వేయడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్దిదారుల సంఖ్యను ఉపయోగించడం వెనుక గల సహేతుకతపై కేంద్రం ఇంకా ఎలాంటి అధికార స్పష్టతనూ ఇవ్వలేదు. ”వలస కార్మికుల సంఖ్యను లెక్కించడానికి ఇది ఉత్తమమైన పద్దతి కాకపోవచ్చు. కానీ, మా దగ్గర సమాచారం లేదు. ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలంటే లబ్దిదారుల సంఖ్యపై మాకు స్పష్టత అవసరం ” అని సంబంధిత మంత్రిత్వశాఖలోని ఒక సీనియర్‌ అధికారి అన్నారు.

కాగా, కేంద్రం అనుసరించిన పద్దతిపై మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంగటన్‌ సహ వ్యవస్థాపకుడు ఆందోళన వ్యక్తం చేశారు. ”కేంద్రం వద్ద గణాంకాలు ఎందుకు లేవు? కేటాయింపులు చేసిన తర్వాత కూడా ఈ ఆహార ధాన్యాలు ఎందుకు పంపిణీ జరగలేదు? ప్రజలకు తిండి చాలా అవసరమని తెలిసీ, అదనపు స్టాక్‌ ఉన్నప్పటికీ.. వాటిని పంపిణీ చేయటం లేదు” అని ఆయన అన్నారు. ఆహార ధాన్యాలు పంపిణీ చేసే తుది బాధ్యత రాష్ట్రాల పైనే ఉంటుంది. కానీ, వలసకార్మికులకు సంబంధించి సరైన సమాచారం అందుబాటులో లేనందున.. ఏ రాష్ట్రాలు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడంలో విఫలమయ్యాయో అన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates