అటవీ భూముల్లోనే విస్తరణ !

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానం
– హైవే ప్రాజెక్టులతో క్షీణిస్తున్న వన్య సంపద

న్యూఢిల్లీ : జాతీయ రహదారుల నిర్మాణ విషయంలో అటవీ నియమాలకు కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు వదులుతోంది. రోడ్ల నిర్మాణ సమయంలో తొలగించే అటవీ ప్రాంతంలోని చెట్లకు పరిహారంగా అటవీ యేతర భూముల్లో చెట్లు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలన్న నియమాన్ని మోడీ సర్కార్‌ ఉల్లంఘిస్తోంది. అటవీ యేతర భూముల్లో కాకుండా అటవీభూముల్లోనే చెట్లు నాటుకోవచ్చునంటూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ పరిరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీయేతర కార్యక్రమాల కోసం అటవీ భూములను ఉపయో గించుకున్న సందర్భంలో అందుకు సమానమైన విస్తీర్ణంలో అటవీయేతర భూమిలో అటవీకరణ జరగాలి. అయితే జూన్‌ 30న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాసిన లేఖలో హైవే ప్రాజెక్టుల కోసం నరికివేసిన అడవికి బదులుగా అటవీకరణకు క్షీణించిన అటవీ భూమాలను ఉపయోగించుకోవాలని కోరింది.

క్షీణించిన అటవీ భూములు అటవీయేతర భూముల కిందకు రావు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అవీ కూడా అటవీ భూములు. వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అధిక మేత, ఆక్రమణలు, ఇతర కారణాలతో అటవీకరణను కోల్పోయిన భూములను అధోకరణం చెందిన లేదా క్షీణించిన అటవీ భూములుగా పేర్కొంటారు.

కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టిహెచ్‌) తాజా లేఖతో కేంద్రం తరుపున హైవే నిర్మాణ పనులు నిర్వహించే పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పిడబ్ల్యూడి) వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు అటవీ క్లియరెన్స్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంలో తమ పేరును నమోదు చేయవు. ఎంఓఆర్‌ టిహెచ్‌ పేరు నమోదు చేస్తాయి. కేంద్రం తాజా లేఖ రాష్ట్రప్రభుత్వాలకు ఈ స్వేచ్ఛ ఇచ్చింది. పర్యావరణవేత్తలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ విషయంపై కన్జర్వేషన్‌ యాక్షన్‌ ట్రస్ట్‌ (లాభాపేక్ష లేని సంస్థ) ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ, ప్రముఖ పర్యావరణవేత్త డెబి గోయెంకా మాట్లాడుతూ ‘మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగించిన అటవీ భూములకు సమానమైన ప్రాంతాన్ని అటవీకరణ చేయాలనే సూత్రం పర్యావరణ సమతుల్యతను కాపాడ్డానికి ఉద్దేశించింది. దేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఒకే విధంగా కొనసాగించడానికి ఇది దోహదపడుతుంది. క్షీణించిన అటవీ భూములలపై అటవీకరణకు అనుమ తించినప్పుడు మీరు పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి మీరు ప్రయత్నించడం లేదని అర్థం. సహజ పర్యావరణాన్ని అడవులు కాపాడతాయి. నీటి వనరులు, వృక్షజాలం, జంతుజాలం, వన్యప్రాణులను కలిగి ఉండే సహజ పర్యావరణ వ్యవస్థయిన అడవులను కృతిమంగా సృష్టి చేయడం అసాధ్యం’ అని అన్నారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్‌ జనరల్‌ (ఫారెస్ట్స్‌), రహదారి రవాణ శాఖలోని డైరెక్టర్‌ జనరల్‌ (రోడ్లు)తో సమావేశం తరువాత బిజెపి మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీ మంత్రిగా ఉన్న ఎంఓఆర్‌టిహెచ్‌ జూన్‌ 30న ఈ లేఖను జారీ చేసింది. ‘సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం అటవీ భూములను కోరే దరఖాస్తులో యూజర్‌ ఏజెన్సీగా ఎంఓఆర్‌టి హెచ్‌ చేరడానికి డిజి, ఎస్‌ఎస్‌ (ఫారెస్ట్స్‌) అంగీకరించారు. అయితే ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి. కాబట్టి అటవీకరణకు అటవీయేతర భూములకు బదులుగా క్షీణించిన అటవీభూములను ఉపయోగిస్తారు’ అని లేఖలో పేర్కొన్నారు.

1980 చట్టం ప్రకారం అటవీకరణకు అధోకరణం చెందిన అటవీభూములను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే, అటవీ భూములను ఉపయోగించుకున్న సందర్భంలో సమానమైన విస్తీర్ణంలో అటవీయేతర భూమిలో అటవీకరణ జరగాలనే నిబంధనల నుంచి ఎంఓఆర్‌టిహెచ్‌కు కూడా మినహాయింపు ఇచ్చారు. జూన్‌ 30 లేఖ ప్రకారం ఈ మినహాయింపును రాష్ట్రాలకు విస్తరించాలని ఎంఓఆర్‌టిహెచ్‌ కోరుతోంది. అయితే ఇలాంటి మినహాయుంపులతో జాతీయ అటవీ లక్ష్యాలను చేరుకోవడం కష్టతరమవుతుందని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం అడవులు ఉండాలి. 2018లోనూ ఇదే విధంగా తీర్మానం చేశారు. అయితే 2019 డిసెంబరు నివేదిక ప్రకారం దేశం విస్తీర్ణంలో 24.56 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఇలాంటి మినహాయింపులు ఇస్తే 33 శాతం అడవుల లక్ష్యానికి చేరుకోవడం ఎప్పటీకి సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా, అటవీకరణకు క్షీణించిన అటవీ భూములను ఉపయోగించడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కారు. 2017 నవంబరున కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఇలాంటి ప్రయత్నం చేసింది. ల్యాండ్‌ బ్యాంకుల కోసం అధోకరణం చెందిన అటవీ భూములను ఉపయోగించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.

మరోవైపు, అటవీకరణ కోసం అధోకరణం చెందిన భూములు ఉపయోగించుకోవాలనే కేంద్ర ప్రతిపాదన చట్టబద్ధం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ మినహాయింపు ఇచ్చామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంటున్నా.. ఇలాంటి నిబంధనలతో ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదని, వ్యవస్థీకృత లోపాలతోనే ప్రాజెక్టులు జాప్యం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా, నితిన్‌ గడ్కారీ నేతృత్వంలోని కేంద్ర ఎంఓఆర్‌టిహెచ్‌ పంపిన లేఖపై శివసేన-కాంగ్రెస్‌ నేత్వత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వలోని పిడబ్ల్యూడి మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కారీ గతంలో మహారాష్ట్ర పిడబ్ల్యూడి మంత్రిగా పనిచేయడం ఇక్కడి విశేషం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates