ఆక్సిజన్‌ అందక ఆగిన ఊపిరి!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రిలో నలుగురి మృతి
మృతుల్లో ముగ్గురు కరోనా రోగులు..
గంటల వ్యవధిలోనే మరణాలు
మృతుల కుటుంబసభ్యుల ఆగ్రహం..
అర్ధరాత్రి నుంచే ఆస్పత్రి ఎదుట ఆందోళన
ఇతర వ్యాధులున్నాయి: వైద్యులు

నిజామాబాద్‌: అది నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి. సమయం గురువారం రాత్రి 10:45 నిమిషాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మృతిచెందారు. ఆ తర్వాత మరొకరు.. కొద్దిసేపటికి ఇంకొకరు.. ఆ వెంటనే మరొకరు ఇలా కేవలం 4 గంటల వ్యవధిలో నలుగురు రోగులు ప్రాణాలు విడిచారు. మృతుల్లో ముగ్గురు కరోనా రోగులున్నారు. ఈ వరుస మరణాలతో ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. కుటుంబసభ్యుల్లో నెలకొన్న పెను విషాదం.. ఆగ్రహంగా మారడటంతో ఆస్పత్రి బయట ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ వరుస మరణాలకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే నలుగురు చనిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లను రోగుల్లో ఒకరికి బదులు మరొకరికి అమర్చే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని అంటున్నారు.ఆస్పత్రిలో కరోనా ఐసొలేషన్‌ వార్డులో 28 మంది, ఐసీయూలో 36 మంది చికిత్స పొందుతున్నారు.

వీరిలో కరోనా పాజిటివ్‌ ఉన్నవారితో పాటు వ్యాధి లక్షణాలున్న వారూ ఉన్నారు. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు, ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంపునకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు, భీమ్‌గల్‌ మండలం పురాణిపేట్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి 10:30గంటల దాకా వీరు చికిత్స పొందుతూనే ఉన్నారు. అప్పటి నుంచి అర్ధరాత్రి 2 గంటల లోపు ఈ ముగ్గురూ మృతిచెందారు. మృతిచెందిన నాలుగో వ్యక్తి.. జిల్లాలోని నందిపేట వాస్తవ్యుడు. గుండె సంబంధిత వ్యాధితో అతడు మృతి చెందాడు.

సెంట్రల్‌ ఆక్సిజన్‌ సరఫరాపైనే ఆరోపణలు
ఆస్పత్రిలో ముగ్గురు కరోనా బాధితుల మృతి ఘటనలో సెంట్రల్‌ ఆక్సిజన్‌ సరఫరాపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాలో లెవల్స్‌ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో కరోనా బాధితులకు ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో కొవిడ్‌ రోగుల కోసం 40 ఐసీయూ బెడ్‌లను ఉంచారు. వీటితో పాటు ఐసొలేషన్‌లో మరో 60బెడ్‌ల వరకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ ఈ ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. లెవల్స్‌ తగ్గినప్పుడు వైద్యుల సూచన మేరకు స్థానికంగా ఉన్న సిలిండర్ల ద్వారా లెవల్స్‌ను ఎప్పటికప్పుడు సరిచూస్తారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఆక్సిజన్‌ సిలిండర్లను ఒకరికి బదులు మరొకరికి అమర్చే సమయంలో రోగులకు, సిలిండర్లను అమర్చే వ్యక్తులకు మధ్య కొద్దిపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బయట ఉన్న బంధువులకు కరోనా బాధితులు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.దీంతో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన ఇబ్బందుల వల్లే తమవారు మృతిచెందినట్లు బంధువులు పక్కాగా చెబుతున్నారు.

అత్యవసరమైన ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలు సరిదిద్దివుంటే మరణాలు సంభవించేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు అర్ధరాత్రి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు వైద్యులు పరిస్థితిని వివరించి నచ్చజెప్పారు. కరోనాతో మృతిచెందిన వారు ముగ్గురు కూడా వృద్ధులు కావడం, వారికి ఆస్తమా, మధుమేహంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో మృతిచెందారని చెప్పడంతో శాంతించారు. అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ కరోనా రోగుల మృతదేహాలను తరలించారు. బంధువుల అనుమతితో మృతుల అంత్యక్రియలు సజావుగా నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతిచెందడంతో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులతో సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులతో పాటు ఆస్పత్రి సిబ్బందితో చర్చించారు. రోగుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇతర జబ్బులు ఉండటం వల్లే: కలెక్టర్‌
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఎవ్వరూ మృతిచెందలేదని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాత్రి సమయంలో సిలిండర్‌ మారుస్తుండగా ఒక రోగి చూసి ఆందోళన చెందాడని.. అది కాస్త రూమర్‌ అయిందన్నారు. గురువారం రాత్రి కరోనా తీవ్రతతో ముగ్గురు చనిపోయారని, వారితో పాటు మరో వ్యక్తి, ఇతర వ్యాధితో ఆస్పత్రికి తీసుకొస్తున్న తరుణంలోనే మృతిచెందినట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అన్ని ఐసీయూ బెడ్‌లకు ఉందన్నారు. చికిత్స పొందుతున్న అందరికీ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. వైద్యులు ఆస్పత్రిలో ఉండి 24గంటల పాటు సేవలు అందిస్తున్నారన్నారు.

కరోనాతోనే ముగ్గురి మృతి: సూపరింటెండెంట్‌
జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ముగ్గురు రోగులు కరోనాతోనే మృతిచెందారని సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. వీరందరూ ఇతర జబ్బులతో కూడా బాధపడుతున్నారన్నారు. వీరికి అన్ని రకాల చికిత్సలను అందించామన్నారు. వీరిలో ఆక్సిజన్‌ శ్యాచురేషన్‌ శాతం తక్కువగా ఉందని తెలిపారు. అలాగే ఆస్తమాతో పాటు మధుమేహం ఉండటం వల్ల సమస్య ముదిరిందని తెలిపారు. ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 24 గంటలు ఐసీయూ, ఐసొలేషన్‌ వార్డులో వైద్యులతో పాటు సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఆక్సిజన్‌ సిలిండర్లూ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates