పనుల్లేక నేత కార్మికుల పస్తులు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆసరా పింఛను, రేషన్‌ బియ్యమే దిక్కు
మూలనపడ్డ రూ.2వేల కోట్ల వస్త్ర నిల్వలు
ఐదుగురు నేతన్నల బలవన్మరణం
ఆర్థిక సంక్షోభంలో నేత కార్మికులు
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌/రాజోలి: అసలే అంతంతమాత్రంగా ఉన్న చేనేత కార్మికుల బతుకులు కరోనాతో పూర్తిగా చతికిలపడ్డాయి. చేతిలో పనుల్లేక.. ఉత్పత్తులను కొనేవారు లేక, పైసలు రాక.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని లేకపోవడంతోపాటు పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో పూట గడవడమెలా? అన్న ఆందోళన నేత కార్మికుల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1.72 లక్షలకు పైగా కుటుంబాలు చేనేత, మరమగ్గాల రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని వీరంతా 3 నెలలుగా పని లేకపోవడడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల, జనగామల్లో ఇద్దరు చొప్పున నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితిని కూడా కొందరు దళారులు, వ్యాపారులు వస్ర్తాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40,533 మంది చేనేత, 35,588 మంది మరమగ్గాల కార్మికులు ఉన్నారు. కాటన్‌, ఉన్ని సిల్క్‌కు సంబంధించిన సహకార సంఘాలు 615 ఉండగా, మరమగ్గాల సహకార సంఘాలు 157, గార్మెంట్‌/టైలర్‌ సొసైటీలు మరో 122 ఉన్నాయి. అయితే ప్రభుత్వ లెక్కలకు మించివేలాది కుటుంబాలు ఈ రంగంలో ఉన్నాయి. అసలే అంతంత మాత్రంగా కూలీ లభించే ఈ రంగంపై కరోనా పిడుగు పడటంతో వస్త్రోత్పత్తులకు మార్కెటింగ్‌ నిలిచిపోయింది. పండుగలు, వేడుకల ఆర్భాటం తగ్గిపోయింది. మరికొంత కాలం పాటు పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరిపే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ చేనేత, మరమగ్గాల ఉత్పత్తులు పేరుకుపోయాయి. ఇప్పటికే రూ.2 వేల కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం. కొత్త ఉత్పత్తులకు పెట్టుబడులు లేకపోవడంతో మరమగ్గాల యజమానులు కూడా కార్మికులకు పని కల్పించలేకపోతున్నారు. చాలా చేనేత కు టుంబాలు ఆసరా పింఛను, కరోనా కాలంలో అందించిన 12 కిలోల ఉచిత బియ్యం, రూ.1500 నగదుతో కొన్ని రోజులు నెట్టుకొచ్చాయి. కొన్నిచోట్ల మాత్రం నేత కార్మికులకు ఊరట లభిస్తోంది.

ప్రభుత్వం ఏటా దసరాకు ముందుకు బతుకమ్మ చీరలను రాష్ట్రంలోని కోటి మందికి ఉచితంగా అందిస్తుంది. ఈ చీరలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో సిరిసిల్ల, కొద్ది మేరకు సిద్దిపేట ప్రాంతం వారి ద్వారానే ఉత్పత్తి చేయిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల విలువ గల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో సుమారు 10 వేల మంది నేత కార్మికులకు కొద్దోగొప్పో పని లభిస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నేసిన తువాళ్లు కరోనా కారణంగా పేరుకుపోవడంతో మానవతావాదులు స్పందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించడంతో 20 లక్షల తువాళ్లను అమ్ముకోగలిగారు. అవి కూడా తక్కువ ధరలకే అమ్ముడుపోయాయి. కొన్నింటిని టెస్కో కొనుగోలు చేసింది. దుబ్బాక చేనేత సంఘానికి రూ.2 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి రుణ సహాయం ప్రకటించి స్టేట్‌ ఫైనాన్స్‌ ద్వారా రూ.కోటిని విడుదల చేయగా పాత బకాయిల కింద డీసీసీబీ జమ చేసుకుంది. దీంతో పెట్టుబడి లేక చేనేతలు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ చీరలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌, ముస్లిం-క్రిస్టియన్‌ పండుగలకు వస్త్రాలు, సాంఘిక సంక్షేమ శాఖకు అవసరమైన దుస్తులు, తదితర వస్త్రాలను ప్రభుత్వం, సిరిసిల్ల నుంచి సేకరిస్తుండడంతో ఆ ప్రాంతం వారికి వేతనాలు లభిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాలో 500 మంది మరమగ్గాల యజమానులు వద్ద రూ.300 కోట్ల విలువైన పట్టు చీరల ఉత్పత్తులు నిలిచిపోయాయి. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోనే సుమారు రూ.100 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉన్నాయని, దీంతో వస్త్రాల తయారీని ఆపేశామని మాస్టర్‌ వీవర్స్‌ చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 13 వేల చేనేత కుటుంబాలుండగా, 900 పైచిలుకు మగ్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కోటకొండ పైఠానీ, గద్వాల, కొత్తకోట, రాజోలి పట్టు చీరలు ప్రఖ్యాతిగాంచాయి. ఈ వస్త్రాల్లో అత్యధిక భాగం మహారాష్ట్రకు ఎగుమతి అయితే, కొంతమేర హైదరాబాద్‌లో అమ్ముడవుతాయి. 3 నెలలుగా అమ్మకాల్లేకపోవడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని మగ్గాల యజమానుల వద్ద సుమారు రూ.540 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉన్నాయని చెబుతున్నారు.

గద్దల్లా తన్నుకుపోతున్నారు
నేతన్నల కష్టాన్ని దళారులు, వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. కార్మికుల కష్టార్జితమైన వస్త్ర నిల్వలను అతి తక్కువ ధరలకు చేజిక్కించుకుంటున్నా రు. ఖరీదైన పట్టు చీరల విషయంలో ఈ దోపిడీ మితిమీరిపోయింది. సాధారణంగా ఒక పట్టు చీరను తయారు చేసేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. కొన్నింటికైతే నెల రోజులూ పడుతుంది. పెట్టుబడి, తయారీకి పట్టిన సమయం ఆధారంగా నేత కార్మికులు వాటి ధరను నిర్ణయించి వ్యాపారులకు అమ్ముతుంటారు. రూ.10 వేలకు విక్రయించే చీరలో దాదాపు రూ.5-7 వేల వరకు పెట్టుబడే ఉంటుంది. ఇక వారి కష్టానికి ప్రతిఫలంగా రూ.3-5 వేల వరకు వచ్చేది. ఇప్పుడు అదే చీరను సగం ధర అంటే రూ.5-6 వేలకే ఇవ్వాలని.. వాటికి వెంటనే నగదు ఇస్తామని వ్యాపారులు తేల్చిచెబుతున్నారు. రూ.7 వేలు కావాలంటే కనీసం వారం పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు డబ్బుల కోసం ఆగాలని చె బుతున్నట్లు తెలిసింది.

ఎలా చూసినా చీర పెట్టుబడి మాత్రమే మిగిలే పరిస్థితి. అయినా, తమ వద్ద ఉన్న వస్త్ర నిల్వలను ఏదో ఒకఽ ధరకు అమ్ముకోక తప్పని పరిస్థితి. ఇదే చీర షోరూంలలో గరిష్ఠంగా రూ.20 వేల వరకు విక్రయిస్తుంటారని చేనేత కార్మికులు చెబుతున్నారు. ఇక, మాస్టర్‌ వీవర్‌లు, సహకార సంఘాల ఽవారు, మగ్గాలు అధిక సంఖ్యలో ఉన్న యజమానులు.. కార్మికులతో చీరలు నేయించి కూలీ ఇస్తుంటారు. చీరను బట్టి వీరికి కూలీ ఉంటుంది. ప్రస్తుతం ఈ యజమానులు కూడా వస్త్రాల విక్రయం నిలిచిపోవడంతో కూలీ చెల్లించలేకపోతున్నారు.

పస్తులుండొద్దనే.. తెగనమ్ముతున్నాం
గతంలో వరదలు, భూకంపాలు వచ్చి నా కూడా 20, 30 రోజుల్లో చేనేత కార్మికులు కోలుకునేవారు. కరోనాతో 4 నెలలుగా కోలుకోలేకపోతున్నారు. చీరలు నేసే కార్మికులకు కూలీ కూడా ఇవ్వలేకపోతున్నారు. కార్మికులు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతోనే పెట్టుబడి కూడా రాకపోయినప్పటికీ చీరలను అమ్ముకుంటున్నాం. ఆ డబ్బుతో కార్మికులకు కూలీ ఇస్తున్నాం.
– నారాయణ, రాజోలి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు

నష్టాలకు అమ్ముకుంటున్నాం..
కరోనా ప్రభావంతో చేనేత రంగం తీవ్రంగా నష్టపోతోంది. రోజంతా మగ్గంపై కూర్చున్నా కార్మికుల ఆదాయం అంతంత మాత్రమే. ఇప్పుడు పెట్టుబడి కూడా రావడం లేదు. నష్టాలకు అమ్ముకోవాల్సి వస్తోంది. రూ.10 వేల విలువైన చీరను రూ.5-6 వేలకు అమ్ముకుంటున్నాం. మా అవసరాలను ఆసరాగా చేసుకుని, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
– సిరిసాల మధు, రాజోలి చేనేత కార్మికుడు

ప్రభుత్వ సాయం తప్పనిసరి
సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత, మరమగ్గాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.500 కోట్లు కేటాయించి, నేత కార్మికుల కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలి. పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏపీలో అమలవుతున్నట్లుగా ప్రతి నేత కార్మికుని కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి రూ.లక్షను వడ్డీ లేని రుణంగా కార్మికులకు ఇవ్వాలి.
– రమేశ్‌, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates