కరోనాకు ఖర్చు 475 కోట్లు.. సచివాలయ నిర్మాణానికి 500 కోట్లు…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వెయ్యి కోట్ల దాకా అంచనాలు పెరిగే అవకాశం
– విపత్కర పరిస్థితుల్లో అవసరమా అంటున్న మేధావులు
– ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– అప్పుల కోసం సర్కారు తిప్పలు
– ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ చట్ట సవరణతో రూ. 16 వేల కోట్ల రుణం

‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చు చేసింది…’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించటం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, నియంత్రణ చర్యల కంటే నూతన సచివాలయ నిర్మాణంపైనే ప్రభుత్వం ఎక్కువ మక్కువ కనబరుస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది.

హైదరాబాద్‌ : ఇటీవల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో మూణ్నెల్లపాటు కోత విధించిన సర్కారు… ఆదాయం అనుకున్నంత స్థాయిలో రాకపోవటం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకుంది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ సచివాలయం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై మాత్రం ఎక్కడా రాజీపడేది లేదంటూ స్పష్టం చేసింది. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.

ఖజానాలో డబ్బులు నిండుకున్నప్పుడు కొత్త సచివాల య నిర్మాణానికి నిధులెక్కడి నుంచి వస్తాయన్న సందేహం సహజం గానే అందరికీ వస్తుంది. కానీ సర్కారు పెద్దలు ఇందుకు తమదైన శైలిలో చక్కని ఉపాయాన్ని ఆలోచించారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ (ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ బడ్జెటరీ మేనేజ్‌మెంట్‌) చట్టానికి సవరణలు చేయటం ద్వారా అప్పులు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆమేరకు కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగానే జూన్‌ 30న ఆగమేఘాల మీద అర్థరాత్రి పూట ఆర్డినెన్సును తీసుకొచ్చారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో సాధారణ పరిమితి అయిన 3 శాతానికి మించి అదనంగా మరో 2 శాతం మేర (మొత్తం 5 శాతం) అప్పులు తెచ్చుకునేందుకు సర్కారు తనకు తానే వెసులుబాటు కల్పించుకుంది. తద్వారా మొత్తం రూ.16 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇప్పుడు ఈ అప్పులోంచే కొత్త సచివాలయ నిర్మాణానికి నిధులు కేటాయించను న్నారని సమాచారం. మరోవైపు కరోనా నియంత్రణ కోసం అవసరమైతే వెయ్యి కోట్లయినా కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఖర్చు చేసింది రూ.475 కోట్లేనని సీఎస్‌ స్పష్టం చేశారు. ఇప్పటికీ జీహెచ్‌ఎమ్‌సీతోపాటు జిల్లాల్లోనూ విరివిగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలంటూ శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను, వెంటీలేటర్ల సంఖ్యను యుద్ధ ప్రాతిపది కన పెంచాల్సిన అవసరమున్నది. కానీ వీటిపై దృష్టి సారించని సర్కా రు, సచివాలయం కూల్చివేతకే ప్రాధాన్యతనివ్వటంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో కేవలం సచివాలయం నిర్మాణంపై దృష్టిపెట్టడంతో విస్మయం వ్యక్తమవుతున్నది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates