అక్కడ మానవత్వం లేదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పైసలు కట్టకపోతే ఆక్సిజన్‌ పీకేస్త అంటున్నరు…
– మృతదేహాల చుట్టూ చిల్లర దందా
– ఓవైపు కరోనా…మరోవైపు వేధింపులు
– ప్రయివేటు ఆస్పత్రుల ధనదాహం
– ఇండ్లు ఖాళీ చేయాలంటూ బాధితులపై ఒత్తిళ్లు

హైదరాబాద్‌ : కరోనా లేదు..గిరోనా లేదు…ఎవరైతే మాకేంటి దొరికిందే సందు ధనదాహం తీర్చుకునే పనిలో కార్పొరేట్‌ ఆస్పత్రులు పడ్డాయి. పైసలు కట్టకపోతే ఆక్సిజన్‌ పైపు తీసేస్తామంటూ బెదిరింపులకు దిగి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ‘వైద్యం మాకు సేవ కాదు వ్యాపారం’ అని కార్పొరేట్‌ ఆస్పత్రులు తమ వక్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. మరికొన్ని ఆస్పత్రులేమో పైసలు కట్టనిదే కరోనా రోగుల మృతదేహాలు ఇవ్వబోమంటూ మెలికబెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అదే సమయంలో కరోనా వచ్చి రోగులు ఇబ్బంది పడుతుంటే ….వారి కుటుంబ సభ్యులకు ఇంటి యజమానులు, ఇరుగుపొరుగు వారి నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. యజమానులు ఇల్లు…హాస్టల్‌ ఖాళీ చేయాలంటూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఇవే..

ఆరు లక్షలు కట్టనిదే డెడ్‌బాడీ ఇవ్వనన్నరు..
మిగిలిన ఆరు లక్షలు కట్టనిదే కరోనా రోగి మృతదేహాన్ని ఇవ్వబోమంటూ ఆస్పత్రి యాజమాన్యం మెలికబెట్టి కూర్చున్నది. తీరా, మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లడం…అప్పుడే హైకోర్టు కార్పొరేట్‌ ఆస్పత్రుల ఫీజుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త రావడం…చూసి యాజమాన్యం ఏమనుకుందో ఏమోగానీ ఎంతో కొంత కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండని మృతుని కుటుంబ సభ్యులకు చెప్పారు. మా దగ్గర రూ.20 వేలకు మించి ఒక్కపైసా లేదని వేడుకోగా…ఆ 20 వేల రూపాయలను కట్టించుకుని డెడ్‌బాడీ ఇచ్చారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల మానవత్వలేమికి ఈ ఘటన తాజా ఉదాహరణ. బాధితుని సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం…’మాది యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట. జూన్‌ 23వ తేదీన మా అన్న ఊపిరితిత్తులకు నీరొచ్చింది. ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయాం. హైదరాబాద్‌లోని బేగంపేటలోని గల కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. 23న రాత్రి ఏడుగంటలకు అడ్మిట్‌ చేసుకున్నారు. బ్రీతింగ్‌ సరిగా లేకపోతే వెంటిలేటర్‌పై పెట్టారు. అప్పటికే కరోనా టెస్టు చేశారు. 25వ తేదీన నెగిటివ్‌ అని వచ్చింది. అందులో కరోనా పేషెంట్ల వార్డు కూడా ఉంది. మరో రెండు రోజుల తర్వాత మా అన్నకు కరోనా టెస్టు మళ్లీ చేశారు. అప్పుడు పాజిటివ్‌ వచ్చిందనీ, క్యూర్‌ అవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ, మా అన్న మంగళవారం ఉదయం చనిపోయాడు. మొత్తం 12.5 లక్షల రూపాయల బిల్లు చేసి పెట్టారు. అప్పటికే అందులో 6.30 లక్షల రూపాయల బిల్లు కట్టాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎంత బతిమిలాడినా మృతదేహం ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. మిగతా ఆరు లక్షల రూపాయల బిల్లు కట్టాలంది. మీడియా ప్రతినిధులు అక్కడకు వచ్చేసరికి యాజమాన్యంలో కదలిక వచ్చింది. మా దగ్గర రూ.20 వేలకు మించి డబ్బులేవని చెప్పేశాం. ఆ డబ్బులను కడితే మృతదేహాన్ని అప్పగించారు’ అంటూ తన ఆవేదన వెళ్లబోసుకున్నాడు.

భర్తకు కరోనా…భార్యకు టార్చర్‌
70 ఏండ్ల తన భర్తకు కరోనా వచ్చిందన్న బెంగతో కుమిలిపోతుండగా…ఇంటి యజమాని, ఇరుపొరుగువారు ఇల్లు ఖాళీ చేయాలని సూటిపోటిమాటలతో వృద్ధురాలిని మానసికంగా మరింత చంపేస్తున్నారు. దగ్గరుండి మరీ భర్తకు ఫోన్‌ చేయించారు. ఆస్పత్రిలోనేమో కరోనాతో ఎప్పుడు బయట పడుతానో అన్న టెన్షన్‌ ఓవైపు.. ఒంటరైన తన భార్య ఏమవుతుందో అన్న బెంగ మరోవైపు..ఇలా ఆయన మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. కరోనా రోగి వివరాల ప్రకారం…ఆ పెద్దాయన వయస్సు 70 ఏండ్లు. బోరబండలో ఉంటున్నాడు. సినిమా ఇండిస్టీలో లైటింగ్‌ విభాగంలో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేశాడు. ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. మరో కొడుకు ఇక్కడ ఉండడు. వృద్ధాప్యంలో ఇద్దరే ఉంటున్నారు. కరోనా భయంతో కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకోవడానికి తప్ప పెద్దగా ఆయన బయటకు వెళ్లలేదు. ఎలా సోకిందో ఏమోగానీ ఆయనకు కరోనా వచ్చింది. దగ్గుతూ, ఆయాసపడుతూ కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఆయనకు ఫోన్‌లు రావడం మొదలైంది. ‘ఫస్ట్‌ ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటున్నరు. ఎక్కడకు పోవాలో అర్థమైతలేదు. ఇరుగుపొరుగువారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నరు’ అని భార్య విజయలక్ష్మి తన భర్తకు ఫోన్‌లో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. ‘ఇంటోళ్లకే కరోనా వస్తే విడ్చి పోతరా? ఇదే న్యాయం. నీవేం భయపడకు’ అంటూ దగ్గుతూ, ఆయాసపడుతూనే భార్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఇంటి దగ్గర పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఆమెను ఖాళీ చేయాలని ఆమెపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి.

9 రోజులు…10 లక్షలు
‘అది హైదరాబాద్‌లోని ఓ పెద్ద ప్రయివేటు ఆస్పత్రి. 83 ఏండ్ల కరోనా బాధితునికి తొమ్మిది రోజుల చికిత్సకుగానూ ఏకంగా పదున్నర లక్షల బిల్లు వేసింది. బిల్లు కట్టేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు 12 గంటల సమయం అడిగినా.. ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. బిల్లు ఇప్పుడు కట్టకుంటే రోగిని తీసుకెళ్లిపోండి అటూ బెదిరించారు’ అని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి కాసుల కక్కుర్తి గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సలహాదారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త, సీనియర్‌ జర్నలిస్టు పరకాల ప్రభాకర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. ఆ ఆస్పత్రి ప్రవర్తించిన తీరు దారుణమనీ, కరోనా విషయంలో మానవత్వం మంటగలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంత గొప్ప ఆస్పత్రి పేరు బయటపెట్టండి’ అంటూ ఎక్కువ మంది పరకాలను కోరారు. దీనికి స్పందించిన పరకాల ప్రభాకర్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘లక్షల బిల్లు వేసిన ఆస్పత్రి పేరు తెలుసుకోవాలనే ఆతృత ఉండటం సహజమే. కానీ, ఆ ఆస్పత్రి పేరు బయటపెట్టి నేను ఆ కరోనా పేషంట్‌కు హాని తలపెట్టలేను. రూ. 10.5 లక్షల బిల్లు కట్టేందుకు ఆస్పత్రి యాజమాన్యాన్ని పన్నెండు గంటల సమయం అడిగితే యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదు. పైగా, రోగికి అమర్చిన ఆక్సిజన్‌ పైపులు, ఇతర వైద్య పరికరాలు తొలగిస్తామని భయపెట్టారు. వారు ఎంత కఠినాత్ములో!’ అని పరకాల ట్వీట్‌ చేశారు.
– ఓ పెద్దాస్పత్రి వ్యవహారంపై ట్వీట్‌ చేసిన పరకాల ప్రభాకర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates