ఉపాధి హామీ చట్టం-గ్రామీణ భారతం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
బృందాకరత్‌

గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్గార్‌ అభియాన్‌ పేరుతో MGNREGAను నిర్వీర్యం చేయవద్దు. గ్రామీణ భారతదేశంలో బాధలు లేకుండా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు MGNREGA యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి. ప్రతి వ్యక్తికీ ఈ పథకం కింద పనిచేసేందుకు అర్హత కల్పించాలంటే కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం ఉండే నిబంధనను ఎత్తేయ్యాల్సిన అవసరం ఉంది. వంద రోజుల పనిదినాల పరిమితిని ఎత్తివేసి దానిని కనీసం 200 పనిదినాలకు పెంచాలి. పని నుంచి వెనక్కి తిప్పి పంపించిన నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం నిధులను అత్యవసరంగా విడుదల చేస్తామని హామీ ఇవ్వాలి.

భారతదేశ గ్రామీణ పేద కార్మికుల జీవనాధారంలో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం’ (MGNREGA) పాత్రను మరొకసారి లాక్‌డౌన్‌ అనుభవాలు రుజువు చేశాయి. ఏప్రిల్‌ నెలలో, మే నెలలో కొన్ని రోజులు ఉపాధిహామీ పనులులేని కారణంగా గ్రామీణ ప్రజల కష్టాలు, దురవస్థలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నెల రోజుల తర్వాత, ఏప్రిల్‌ 20 నుంచి ఉపాధిహామీ పథకం కింద పనులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పునఃపరిశీలన చేసింది. తరువాత నిధులను ఆలస్యంగా విడుదల చేసింది.

కానీ ఒకసారి నిధులు రాష్ట్రాలకు చేరిన తర్వాత ఫలితాలు స్పష్టం అయ్యాయి. ఏప్రిల్‌ 2020లో పని లభించిన కుటుంబాల సంఖ్య ఇన్ని సంవత్సరాలలో అతి తక్కువగా అంటే 95లక్షలు మాత్రమే. మే నెలలో ఆ సంఖ్య 3.05కోట్లకు పెరిగింది. జూన్‌ మూడవ వారం వరకు పని లభించిన కుటుంబాల సంఖ్య 2.84 కోట్లు. ఈ సంఖ్య గత ఏడాది ఇదే నెలలో నమోదైన సంఖ్య కన్నా చాలా ఎక్కువ. సగటున 23పని దినాలతో, రూ.200 రోజు వారీ సగటు వేతనంతో, పని లభించిన ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ.1500 ఆదాయం లభించింది. ఇది చాలా తక్కువ ఆదాయం అయినప్పటికీ, ఈ పథకం ఇంకా విస్తరించబడితే, ప్రజలకు పని కల్పించడంలో, సహాయాన్ని అందించడంలో MGNREGA (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ చట్టం) యొక్క శక్తి సామర్థ్యాలు రుజువు అవుతాయి.

కేంద్ర ప్రభుత్వం MGNREGAకొరకు 38000 కోట్లు విడుదల చేస్తే, దానిలో అప్పుడే 70శాతం నిధులను ఖర్చు చేశారు. వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు తిరిగి రావడం, గణనీయమైన సంఖ్యలో క్వారంటైన్‌ కాలాన్ని పూర్తి చేయడంతో పనిచేసే వారి సంఖ్య పెరిగి, పనికి డిమాండ్‌ పెరిగింది. కాబట్టి రాష్ట్రాల వద్ద ఉన్న మిగిలిన 8000 కోట్లు ఏ మాత్రం సరిపోవనేది స్పష్టమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రెండవ విడత నిధులను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
గడిచిన ఈ నెలల్లో కూడా, పని లభించిన కార్మికుల సంఖ్యలో ఆహ్వానించదగిన పెరుగుదల ఉన్న చోట కూడా పని కావాలని డిమాండ్‌ చేసిన 1.82కోట్ల మంది కార్మికులను తిరిగి వెనక్కి పంపించారు.

మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 8.07 కోట్ల మంది కార్మికులు పని కావాలని డిమాండ్‌ చేస్తే, 6.25కోట్ల మందికి మాత్రమే పని కల్పించారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒకే రోజు రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు కల్పించినట్టు మనం విన్నాం. ఇది ఖచ్చితంగా కొత్త తరహా గణాంకాల వివరణ. పని స్వభావం ఏమిటి? ఆ ఉద్యోగాలు శాశ్వత మైనవా? అవి వీ+చీ=జు+A పథకం కింద చేసే ఒక రోజు పని లాంటివా? ఉత్తరప్రదేశ్‌లో వీ+చీ=జు+A పథకం కింద చేసే పని కోసం ఒక కోటి మంది కార్మికులు దరఖాస్తు చేశారు, కానీ వారిలో మూడింట ఒక వంతు కార్మికులను వెనక్కి పంపించారు.

అదేవిధంగా బీహార్‌లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చారు. నలభై ఒక్క లక్షల మంది కార్మికులు పని కొరకు దరఖాస్తు చేసుకుంటే, 12 లక్షల మందిని వెనక్కి తిప్పి పంపించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని చట్టపరమైన ఒప్పందం ఉన్నప్పటికీ, ఇంత వరకు ఒక్క రూపాయి కూడా పరిహారంగా చెల్లించలేదు. ఇప్పుడు రుతుపవనాలు వచ్చేశాయి. ఇది మరింత సందర్భోచితమైన సమస్యగా మారుతుంది. వర్షాకాలంలో డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, పని చేయడానికి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. కాబట్టి పనికోసం డిమాండ్‌ చేసే కార్మికులందరికీ నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

MGNREGAను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 116 జిల్లాల్లో ఉన్న వలస కార్మికులకు పనిని కల్పించడానికి గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్గార్‌ అభియాన్‌ అనే ఒక ”కొత్త” పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నది. మొదటిది ఎంపికకు ఉన్న కొలమానం ఏమిటి? ఉదా:- రివర్స్‌ వలసలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను ఈ పథకం నుంచి ఎందుకు మినహాయించాలి? జూన్‌ 20-28 మధ్య ఖర్చు చేసిన 4,794 కోట్ల రూపాయల్లో, కేవలం బీహార్‌ రాష్ట్రానికే 50శాతానికిపైగా నిధులను విడుదల చేశారు. ఇంతకు ముందు మనకు తెలిసిన విధంగానే MGNREGA అమలులో బీహార్‌ చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం. ఈ సంవత్సరంలోనే బీహార్‌ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ పథకం సంకుచిత రాజకీయ లక్ష్యంతో ఉద్దేశించబడితే మాత్రం, ఇది ఒక ఘోరమైన ఎగతాళి తప్ప మరొకటి కాదు.

రెండవది ఈ ”పథకం” కింద చేర్చబడిన 25రకాల పనుల జాబితా ప్రకారం, వాటిలో ప్రతీది MGNREGA కార్యక్రమాల పరిధిలోకి అప్పటికే చేర్చబడిందనేది స్పష్టం. అవి ఇప్పటికే MGNREGA పరిధిలో ఉన్నాయి కాబట్టి, దీనికి మళ్ళీ కొత్తగా ”నైపుణ్యంతో కూడిన పని” అవసరం ఏముంది? భౌతికంగా చేతులతో చేసే పని : ప్రధానంగా నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు కేబుల్‌ వేయడానికి భూమిని తవ్వే పని. పైకి చెప్పకపోయినా, ఈ పనులు ఖచ్చితంగా ప్రయివేటు టెలికాం కంపెనీలకు లాభదాయకంగా ఉంటాయనేది స్పష్టం.

మరీ ముఖ్యంగా, ఈ కొత్త పథకం ఎంపిక చేసిన జిల్లాల్లో MGNREGA పనిపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఈ క్లిష్టమైన సమస్యపై గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఈ పథకాన్ని చూసే మంత్రిత్వశాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏ విధమైన స్పష్టత లేదు. ఈ 116 జిల్లాల్లో గత సంవత్సరం MGNREGA కింద సగటున నమోదైన పని దినాలు 43.7గా ఉన్నాయి. ఈ సగటు పని దినాల సంఖ్య జాతీయ సగటు పని దినాల (50రోజులు) కన్నా తక్కువ. ఇంత తక్కువ పని రోజుల నమోదు కారణంగానే ఈ జిల్లాల్లో వలసల రేటు చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది. కొత్తపథకాల బదులుగా కార్మికులు అందరికీ పనులు కల్పించేందుకు MGNREGAను ఎందుకు విస్తరించకూడదు? ఇది ఒక చట్టబద్ధమైన హక్కు. కానీ ‘గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్గార్‌ అభియాన్‌’ కు పాలనా యంత్రాంగం పైన ఆ విధమైన చట్టబద్ధమైన బంధం లేదు.
ఈ పథకం ప్రధానంగా ఆ జిల్లాల్లో 25వేలు లేదా అంతకు మించి ఉన్న వలస కార్మికుల కోసం ఉద్దేశించబడింది. అంటే ఈ ఎంపిక చేయబడిన జిల్లాల్లో తక్కువ శాతంగా ఉన్న మహిళా వలస కార్మికులను పెద్ద ఎత్తున మినహాయిస్తున్నారని అనుకోవాలి. కానీ ఈ జిల్లాల్లో మహిళల పని డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అది గడిచిన సంవత్సరంలో MGNREGA కింద మహిళల సగటు పని 53.5శాతంగా ఉంది, అంటే దేశంలోని మిగిలిన ప్రాంతాల మహిళల పని సగటు కన్నా ఎక్కువ. కాబట్టి MGNREGAకింద చేసే పనితో పాటు ఈ 116 జిల్లాల్లో అదనపు పని లేకుంటే మహిళలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్గార్‌ అభియాన్‌ పేరుతో MGNREGAను నిర్వీర్యం చేయవద్దు. గ్రామీణ భారతదేశంలో బాధలు లేకుండా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు MGNREGA యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి. ప్రతి వ్యక్తిని ఈ పథకం కింద పనిచేసేందుకు అర్హత కల్పించాలంటే కుటుంబానికి ఒక వ్యక్తికీ మాత్రమే అవకాశం ఉండే నిబంధనను ఎత్తేయ్యాల్సిన అవసరం ఉంది. వంద రోజుల పని దినాల పరిమితిని ఎత్తివేసి దానిని కనీసం 200 పని దినాలకు పెంచాలి. పని నుంచి వెనక్కి తిప్పి పంపించిన నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం నిధులను అత్యవసరంగా విడుదల చేస్తామని హామీ ఇవ్వాలి.

ది హిందూసౌజన్యంతో
అనువాదం:బోడపట్ల రవీందర్‌,

 

RELATED ARTICLES

Latest Updates