అష్ట దిగ్బంధం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నెల రోజుల్లోనే 8 రెట్లు పెరిగిన కరోనా కేసులు
8 రోజుల్లోనే రెట్టింపు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జూన్‌ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకి 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా  రాజధానిలో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 150 వరకు కొత్తగా కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం గుర్తించి కట్టడి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే 600 పోస్టులు మంజూరు చేసింది. గాంధీలో పడకలు నిండిపోతుండటంతో కరోనా చికిత్స కోసం టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడా మరో 600 పోస్టులు కేటాయించింది. ఈ పోస్టులన్నీ యుద్ధప్రాతిపదికన భర్తీ చేయనుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోవడంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది.

జూన్‌లో ప్రతి వారం నమోదవుతున్న కేసుల్లో 50 శాతం నుంచి ఒక్కో వారం 100 శాతం వరకు పెరుగుదల కనిపిస్తోంది. అన్‌లాక్‌ నిబంధనలు అమలులోకి రావడం, మరోవైపు పరీక్షల సంఖ్యను పెంచడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువ వ్యవధిలో రెట్టింపవుతున్నాయి. జూన్‌ గణాంకాలను పరిశీలిస్తే ఒకటో తేదీ నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యేందుకు 17 రోజుల సమయం పట్టింది. తర్వాత కేవలం 8 రోజుల్లోనే రెట్టింపయ్యాయి. ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల్లో యువత, నడివయస్కులు ఎక్కువ ఉంటున్నారు. మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాజిటివ్‌ రేటు ఎక్కువే
కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి 20 శాతానికి చేరువలో ఉంది. రాష్ట్రంలో శనివారం నాటికి 1,10,545 పరీక్షలు నిర్వహించగా.. 22,312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తమిళనాడు, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు అధికంగా నమోదవుతోంది. తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates