పక్కింట్లోనే పాజిటివ్‌?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

గప్‌చుప్‌పగా వ్యవహరిస్తున్న కరోనా బాధితులు
విడిగా గది లేకున్నా హోంక్వారంటైన్‌
ఆరా తీయకుండానే ఇంటికి పంపేస్తున్నారు
వెలివేతకు గురవుతామనే భయంతో
చుట్టుపక్కల వారికి చెప్పని పాజిటివ్‌లు
ఇంట్లో వారు ఎప్పట్లాగే బయటి పనులకు
పనులు చేయకుంటే ఇల్లు గడవదని భయం
శాఖల మధ్య సమన్వయ లోపంతో
పొరుగువారికి ఆలస్యంగా సమాచారం
కాంటాక్టులోకి వచ్చిన వారికి గుండెల్లో రైళ్లు
ప్రభుత్వానికి అందుబాటులో వందల గదులు
వినియోగంలోకి తెస్తేనే వ్యాప్తికి అడ్డుకట్ట

ఆయన హోంగార్డు. కరోనా లక్షణాలు కనబడటంతో ఎస్‌ఆర్‌ నగర్‌లో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలింది. ఆసుపత్రికి వెళితే, పరిస్థితి తీవ్రంగా లేదు కాబట్టి ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. మందులు ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చిన 3 రోజుల వరకూ ఇరుగు పొరుగు వారికి ఆ విషయం తెలియదు. ఆయన ఇంట్లోని వారంతా రోజూ బయట తిరుగుతూనే ఉన్నారు. చుట్టుపక్కల వారికి ఏం అనాలో తెలియని పరిస్థితి.

అభినవ్‌ ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తుంటాడు. సంస్థలో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా అభినవ్‌కు పాజిటివ్‌ అని తేలింది. లక్షణాలు తక్కువగా ఉండటంతో వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. స్థానిక అధికారుల ద్వారా కుత్బుల్లాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కు సమాచారం అందింది. ఆరా తీస్తే పాజిటివ్‌ అని అంగీకరించాడు. దాంతో అపార్ట్‌మెంట్‌ వాసుల గుండెల్లో రాయి పడింది. అప్పటికప్పుడు సమావేశం పెట్టుకున్నారు. కరోనా రోగి ఇంట్లోని వారందరికీ అసోసియేషన్‌ ఖర్చుతో పరీక్షలు చేయించారు. వారందరికీ నెగెటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా అవసరం ఉన్నా బయటకు రావొద్దని, ఫోన్లో సమాచారం ఇస్తే తెప్పించి పెడతామని చెప్పారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె నర్సుగా పని చేస్తుంటారు. ఆమెతో పాటు ఆసుపత్రిలోని 14 మంది సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు కనిపించక పోవడంతో అందరినీ ఇంటి దగ్గరే క్వారంటైన్‌లో ఉండాలని పంపించారు. మందులు కూడా ఇచ్చారు. సమస్య ఎదురైతే తమకు ఫోన్‌ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కాకుండా వేరే గదిలో ఉండాలన్నారు. సదరు నర్సు నివాసం ఉండే కాలనీలో కార్పొరేటర్‌కు అధికారుల ద్వారా విషయం తెలిసింది. ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. ఆమె బయటకు వెళ్లడం లేదు కానీ, కుటుంబ సభ్యులంతా ఎప్పటిలానే రోజూ బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. వెంటనే నర్సు ఫోన్‌ నంబరు కనుక్కొని, కార్పొరేటర్‌ ఆమెకు ఫోన్‌చేసి ఇదేం పద్ధతి అని అడిగితే, ‘‘తెలియక జరిగింది. క్షమించాలి. మరోసారి జరగకుండా చూసుకుంటాం’’అని ఆమె బదులిచ్చారు.

హైదరాబాద్‌ మూసాపేట్‌లో ఉంటున్న 39 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. జూన్‌ 24న హోంక్వారంటైన్‌ సూచించారు. హైదరాబాద్‌లో ఉండలేక గప్‌చు్‌పగా గురువారం సొంత ఊరైన వికారాబాద్‌ జిల్లా ఽనాగసమందర్‌ గ్రామానికి వచ్చాడు. విషయం తెలిగి గ్రామస్థులు అప్రమత్తం అయ్యారు. స్థానిక వైద్యాధికారికి సమాచారం అందించారు. తనను అదుపులో తీసుకుంటారనే భయంతో కరోనా రోగి ఊరి పక్కనే ఉన్న అల్లాపూర్‌ అడవిలోకి పారిపోయారు. వైద్యాధికారి, పోలీసులు అడవిలో గాలించి, అతన్ని పట్టుకొని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు.

హైదరాబాద్‌: తమకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పకుండా గప్‌చు్‌పగా హోం క్వారంటైన్‌లోకి వెళుతున్న వారు ఇటీవల హైదరాబాద్‌లో ఎక్కువయ్యారు. ప్రస్తుతం నగరంలో ఐదు నుంచి ఆరు వేల మంది కరోనా పాజిటివ్‌లు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వారిలో కొందరు బాధ్యతగానే వ్యవహరిస్తున్నప్పటికీ మరి కొందరి వ్యవహార శైలితో ఇరుగుపొరుగు వారికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సామాజిక వెలివేత భయం వల్ల, ఆర్థిక భారం భరించలేక, అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది కరోనా పాజిటివ్‌లు జాగ్రత్తలు పాటించకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. తొలినాళ్లలో పకడ్బందీ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తర్వాతి కాలంలో నిర్ణయాల్నిమార్చుకోవడమే కొత్త సమస్యలకు కారణమని అంటున్నారు.

కరోనా సోకిందన్న విషయం నలుగురికి తెలిస్తే తమను వెలివేసినట్లుగా చూస్తారన్న భయాందోళనలతో రోగులు విషయాన్ని గుట్టుగా ఉంచేస్తున్నారు. మూడు, నాలుగు రోజులకు అధికారుల నుంచి ఇరుగు పొరుగు వారికి సమాచారం వచ్చిన తర్వాత, ‘‘అబ్బే… పెద్ద లక్షణాలు లేవు. అందుకే ఇంటికి పంపారు’’ అని చెబుతున్నారు. ఇలాంటి వారి వైఖరి చుట్టుపక్కల వారికి సంకటంగా మారింది. అప్పటికే వారిని కలిసి ఉండటం వల్ల ఎక్కడ తమకు సోకిందోనని హడలిపోతున్నారు. తమకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు.

ఇంట్లో విడిగా వసతి లేకపోయునా…
పాజిటివ్‌గా తేలిన వెంటనే లక్షణాల్లేవని ఇంటికి పంపేయకూడదు. ఇంట్లో విడిగా గది, టాయ్‌లెట్‌ ఉంటేనే హోంక్వారంటైన్‌ అవకాశం ఇవ్వాలి. లేదంటే ప్రభుత్వ క్వారంటైన్‌కో, క్వారంటైన్‌ కోసం అనుమతించిన హోటల్‌కో తరలించాలి. పాజిటివ్‌గా తేలిన వెంటనే కనీసం వసతుల గురించి ఆరా తీయకుండా హోంక్వారంటైన్‌కు వెళ్లమని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. దాంతో రోగులు ఇంట్లో విడిగా ఉండే వసతులు లేకున్నా ఉన్నంతలో సర్దుకుంటున్నారు. కొద్ది మందే ధైర్యం చేసి, తమకు ఇంట్లో వసతులు లేవని, ప్రభుత్వమే దారి చూపించాలని పట్టుబడుతున్నారు. అలాంటి సమయంలో తప్పనిసరై హైదరాబాద్‌లోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో బెడ్‌ కేటాయిస్తున్నారు. 250 బెడ్ల ఆసుపత్రిలో 210 బెడ్లు ఇప్పటికే నిండిపోయాయి. కొత్తగా కొవిడ్‌ ఆస్పత్రులేవీ సిద్ధం కాలేదు. అందుకే, ఇళ్లకు పంపించడానికే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో ఒకరికి పాజిటివ్‌ వస్తే ఇంటిని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాలి.

కాంటాక్టు పర్సన్లుగా ఇంట్లో వారు అందరికీ కరోనా పరీక్షలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం అవన్నీ వదిలేసి, కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తోంది. దాంతో కరోనా రోగుల కాంటాక్టు పర్సన్లయిన కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే మిగతా వారంతా నెల రోజుల పాటు బయటకు వెళ్లకుండా ఉండటం పేద, దిగువ మధ్య తరగతి కుంటుంబాల్లో కుదరదు. అంతకాలం పాటు పోషించుకునే పరిస్థితి లేకపోవటం, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయంతో రోగిని ఇంట్లో పెట్టుకొని ఇతర కుటుంబ సభ్యులు రోజూ బయటకు, విధులకు వెళుతున్నారు. రోగుల కోసం విడిగా గదులు లేని ఈ కుటుంబాల వారు నగరంలో వైరస్‌ వాహకులుగా మారారని ఆందోళన వ్యక్తమవుతోంది.

సమన్వయం లేదు
వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎవరైనా పాజిటివ్‌గా తేలితే ఆ సమాచారం వెంటనే రోగి ఇంటి చుట్టుపక్కల వారికి చేరడం లేదు. తొలుత మూడు శాఖలూ సమన్వయంతో పని చేసినా రాన్రాను ఎవరికి వారన్నట్లుగా మారింది. పైవ్రేటు ల్యాబుల్లో పరీక్షల ఫలితాలు మున్సిపల్‌ అధికారులకు నేరుగా అందటం లేదు. అప్పటికే అంతో ఇంతో నష్టం జరుగుతోంది. నమూనా కేంద్రాల్లో నమూనాలను సేకరించి, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలి. అక్కడి నుంచి ల్యాబ్‌లకు వెళ్లాలి. ఫలితాలు వచ్చాక సమాచారాన్ని కొవిడ్‌ యాప్‌లోకి అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం నివేదికలు రూపొందించి, నిఘా వర్గాలకు, వైద్య ఆరోగ్య శాఖకు చెరో కాపీ పంపుతారు. నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందిస్తాయి. ఇన్ని వరుసల దాటిన తర్వాత సమాచారం స్థానిక అధికారులకు చేరుతోంది. వారు స్పందించే సరికి పుణ్యకాలం గడిచిపోతోంది.

విధానం మారాలి
లక్షణాలు తక్కువగా ఉన్న వారిని ఇంటికి పంపే పద్ధతి మారాలని మున్సిపల్‌, వైద్య అధికారులు అంటున్నారు. ఇలాగైతే కట్టడి కష్టమని చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండదని అంటున్నారు. ‘‘కొందరి ఇళ్లు చిన్నవిగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. బయటకు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు. పాజిటివ్‌గా తేలిందంటే.. కనీసం నెల రోజుల పాటు మిగిలిన వారికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి అందరికీసాధ్యం కాదు. ఈ కారణంతోనే తప్పులు చోటు చేసుకుంటున్నాయి’’ అని సీనియర్‌ వైద్యాధికారి ఒకరు చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఇళ్లకు పంపకుండా వేరుగా చికిత్స చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు సూచించారు. నగరంలో క్వారంటైన్‌ కోసం వందల గదుల్ని సేకరించారని, వాటిని పూర్తి స్థాయిలో పని చేయిస్తే వైర్‌సను కట్టడి చేయొచ్చని అన్నారు.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates