విస్తరణ శక్తులకు ఓటమి తథ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • చైనాకు పరోక్షంగా గట్టి సందేశమిచ్చిన ప్రధాని మోదీ
  • లద్దాఖ్‌లోని సైనిక స్థావరం ఆకస్మిక సందర్శన
  • జవాన్లనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం
  • అమరులైన వీర సైనికులకు నివాళులు

ఇది అభివృద్ధి యుగం. ప్రాదేశిక విస్తరణవాదానికి కాలం చెల్లింది. విస్తరణవాద శక్తులు ఓటమిని లేదా వినాశనాన్ని చవిచూడటం ఖాయం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. విస్తరణ ఆకాంక్షలను జగమంతా నిరసిస్తోంది. నేటి ప్రపంచం ప్రగతిసాధనకే అంకితం.

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ

లేహ్‌/దిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశానికి గట్టి హెచ్చరిక…ప్రాదేశిక, ఆర్థిక విస్తరణ కాంక్షలతో రగిలిపోతున్న డ్రాగన్‌కు భవిష్యత్‌ దర్శనంపై ఉద్బోధ…ప్రగతి పథంలో సాగటమే ఈ యుగ ధర్మమని హితబోధ…

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల్లోని సైనిక శిబిరాలను సందర్శించటం ద్వారా చైనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సంకేతాలనే పంపించారు.
విస్తరణవాద యుగానికి కాలం చెల్లిందని, అలాంటి శక్తులకు ఓటమి తప్పదని చరిత్ర ఎప్పుడో నిరూపించిందని గుర్తు చేస్తూ చురకలు వేశారు. హింసాత్మక ఘర్షణతో ప్రతిష్టంభన నెలకొన్న తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. సరిహద్దులకు సమీపంలో, ఇండస్‌ నది ఒడ్డున ఉన్న నిము సైనిక స్థావరానికి వెళ్లిన ప్రధాని అక్కడున్న సైనిక, వాయుసేన, ఐటీబీపీ సిబ్బందితో సంభాషించారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తుల్లో ఈ ప్రాంతం ఉంది. సాయంత్రం లేహ్‌లోని సైనిక ఆస్పత్రికి వెళ్లి గల్వాన్‌ లోయ ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. వారితో కొంత సమయంపాటు మాట్లాడారు. ప్రధాని పర్యటనలో త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి నరవణె తదితరులు పాల్గొన్నారు. జవాన్లు ‘వందేమాతరం’ అంటూ బిగ్గరగా నినదిస్తుండగా సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కొనియాడుతూ ప్రధాని ప్రసంగించారు.

అమరులకు నివాళులు
గల్వాన్‌ లోయ ఘర్షణలో ఇటీవల వీరమరణం పొందిన 20 భారత జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. తమకు ఆగ్రహంవస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో శత్రువులకు భారత సైనికలు రుచిచూపించారన్నారు. సైనిక దళాల సాహసం దేశమంతటా మార్మోగుతోందని తెలిపారు. భారత సైనిక అపురూప సాహసాలను యావత్తు ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు.

శాంతి, స్నేహం.. దేశ బలహీనత కాదు
ప్రాచీన కాలం నుంచి శాంతి, స్నేహం, ధైర్యసాహసాలు వంటి సుగుణాలు భారతీయుల సంస్కృతిలో మమేకమై ఉన్నాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో గుర్తుచేశారు. శాంతికి, అభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులకు భారత్‌ గట్టి గుణపాఠమే చెబుతూ వస్తోందన్నారు. మిత్ర ధర్మానికి భారత్‌ ఎంతో నిబద్ధతతో కట్టుబడి ఉంటుందని, దీనిని బలహీనతగా భావించరాదని హెచ్చరించారు.

హిమాలయాలను మించిన నిబద్ధత
గతంలో కన్నా భారత్‌ అన్నింటా ఎంతో బలమైన దేశంగా అవతరించిందని ప్రధాని మోదీ చెప్పారు. వైమానిక, నావికాదళ శక్తితో పాటు సైనిక పరంగానూ ఎంతో పురోభివృద్ధి సాధించామనీ ఆయన గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల పెంపు, ఆయుధాల ఆధునికీకకరణతో దేశ రక్షణ సామర్థ్యాలు ఎన్నో రెట్లు పెరిగాయని తెలిపారు. దేశ రక్షణ వ్యవస్థల బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలనూ ప్రధాని ప్రస్తావించారు. లేహ్‌-లద్దాఖ్‌, కార్గిల్‌, సియాచిన్‌ …తదితర ఎత్తైన, అతి శీతల, తీవ్ర ప్రతికూల ప్రాంతాలేవైనా సరే భారత సైనికుల సాహసాలకు ఇవన్నీ అతిపెద్ద రుజువులుగా నిలుస్తున్నాయన్నారు. మన సైనికుల శక్తిసామర్థ్యాలు, నిబద్ధత హిమాలయ శిఖరాల కన్నా ఎంతో సమున్నతమైనవంటూ సైన్యంలోని 14వ కోర్‌ అధికారులు, సిబ్బంది త్యాగాలను గుర్తుచేశారు. లద్దాఖ్‌ను త్యాగ భూమిగా అభివర్ణించారు. పులువురు వీర పుత్రులను ఈ నేల దేశానికి అందించిందని కొనియాడారు.

సైన్యం స్థైర్యానికి ఊతం: అమిత్‌షా, రాజ్‌నాథ్‌
లద్దాఖ్‌లో ప్రధాని పర్యటన మన వీర సైనికుల్లో ఆత్మ స్థైర్యాన్ని మరింత పెంచిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని పర్యటన దేశ ప్రజలందరి భావోద్వేగాలకు అద్దంపట్టిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. ముందుండి నడిపించే సాహసోపేతమైన నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌లో శుక్రవారం పర్యటించాల్సి ఉంది. అయితే, గురువారం సాయంత్రం ఆయన పర్యటన అకస్మాత్తుగా రద్దయ్యింది.

మురళీగానాన్ని వినిపించే శ్రీకృష్ణుడిని భక్తితో ఆరాధించే మనమే… దుష్ట శిక్షణ అవసరమైన వేళ సుదర్శన చక్రధారి అయిన అదే కృష్ణుడిని ప్రార్థిస్తాం.  ప్రధాని మోదీ

మీ సాహసం ఇప్పుడు మీరు సేవలందిస్తున్న ఎత్తైన హిమాలయ ప్రాంతానికి కన్నా ఎంతో సమున్నతమైనది. దేశ రక్షణ బాధ్యత మీ చేతుల్లో ఉండటం మాకెంతో భరోసా. నేను ఒక్కడినే కాదు…యావత్తు దేశం మిమ్మల్ని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. మిమ్మల్ని చూసి మేమెంతో గర్విస్తున్నాం. లద్దాఖ్‌లో సైనికులతో ప్రధాని మోదీ

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates