ప్రోత్సాహకాలేవి?…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-‘ఏకగ్రీవ’ డబ్బులు రాక సర్పంచుల్లో అసహనం
– మంత్రి ఇలాకాలో ఉన్న భూమి ఇచ్చేసిన గిరిజన సర్పంచ్‌
– ఇల్లు అమ్మేసి రేకుల షెడ్డులో నివాసం

ఖమ్మం: ఏకగ్రీవమైతే పది లక్షలతో పాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో పదిహేను లక్షలు వస్తాయని ఆశపడ్డారు. ఈ మొత్తం నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామనుకున్నారు. ఎన్నికలు ముగిసిపోయి ఏడాదిన్నర పూర్తయినా ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేయలేదు. దీంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక గ్రామస్తులకు మొహం చూపించలేక పోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటూ అప్పుల పాలౌతున్న సర్పంచులు.. తమకున్న భూములను కూడా అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. గతేడాది జనవరిలో ఉమ్మడి ఖమ్మర జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో 81 పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ లెక్కన ఆయా పంచాయతీలు ఒక్కో పంచాయతీకి రూ.10లక్షల ప్రోత్సాహక నిధులు రూ.13.50 కోట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం వాటికి సంబంధించిన నిధులు పైసా విదల్చకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఖమ్మం జిల్లాలో 56, భద్రాద్రి జిల్లాలో 27 కలుపుకుని టీఆర్‌ఎస్‌ 83 పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయినప్పటికీ ఏకగ్రీవ నిధులు రాక అధికార పార్టీ సర్పంచులూ అసహనానికి గురవుతున్నారు. గిరిజన తండాల్లో అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోతున్నామని ఆ సర్పంచులు ఆవేదనకు లోనవుతున్నారు.

నిధులు విడుదల కాలేదు : కె.శ్రీనివాసరెడ్డి, డీపీవో ఖమ్మం
జిల్లాలో 2019 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు నిధులు రాలేదు. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు ప్రతి నెలా రూ.17కోట్ల వరకూ వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఊరికిచ్చిన మాటకోసం..
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ప్రాతినిధ్యం వహి స్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా ఏకగ్రీవమైంది. ఎన్నిక సందర్భంగా ఊరికిచ్చిన మాటకోసం సర్పంచ్‌ మాలోత్‌ బాబీ చంద్‌ తనకున్న ఎకరం పొలాన్ని రహదారి నిర్మాణానికి రాసిచ్చాడు. గ్రామం అవసరాల కోసం ఇల్లును సైతం అమ్మేసి చిన్న రేకుల షెడ్డులో భార్యతో కలిసి ఉంటున్నాడు. ‘ఏకగ్రీవ నిధులు రాలేదని ఇచ్చిన మాట తప్పడం న్యాయం కాదు. అందుకే భూమి దానం చేశాను’ అని ఆ సర్పంచ్‌ చెబుతున్నాడు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates