ఉపాధి హామీ సరైన మార్గం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈ పథకాన్ని కేంద్రం ఆదరించాలి
పని దినాలను 200 రోజులకు పెంచాలి
అనాలోచిత లాక్‌డౌన్‌తో అసంఘటిత శ్రామిక శక్తిపై దెబ్బ
దాదాపు 50 కోట్ల మందిపై ప్రభావం

న్యూఢిల్లీ : మోడీ సర్కారు అనాలోచిత లాక్‌డౌన్‌ నిర్ణయం, ఏకపక్ష విధానాల కారణంగా దేశంలోని అసంఘటిత రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. ఫలితంగా దీని ప్రభావం ఇప్పటికే ఈ రంగంలోని దాదాపు 50 కోట్ల మందిపై పడింది. దీంతో కరోనా సమయంలో దేశంలోని కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణాల నుంచి సొంతూర్లకు కార్మికులు వలసబాట పట్టారు. ఈ ఆపత్కాలంలో శ్రామిక శక్తికి జరిగిన నష్టాన్ని కొంతలో కొంత పూడ్చడానికి ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ)’ ఒక సరైన ఎంపిక అని పలువురు నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, మోడీ సర్కారు మాత్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం మోడీ సర్కారు ఈ పథకంపై దృష్టిని సారించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధిని కల్పించడానికి కృషి చేయాలని వారు సూచిస్తున్నారు. 2005లో ఆమోదించిన ఈ చట్టం… ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పనికి హామీనిస్తుంది.

పెరుగుతున్న నిరుద్యోగం.. తగ్గుతున్న ఆదాయాలు

లాక్‌డౌన్‌కు ముందు పరిస్థితిని చూస్తే..జాతీయ గణాంక కార్యాలయం చేసిన కార్మిక శక్తి సర్వే ప్రకారం.. 2012-2018 మధ్య గ్రామీణ పురుషులలో నిరుద్యోగం మూడురెట్లు పెరిగింది. గ్రామీణ మహిళల విషయంలో ఇది రెట్టింపయ్యింది. అలాగే లీకైన వినియోగ వ్యయ సర్వే ప్రకారం.. గ్రామీణ జనాభాలో 50శాతం మంది పేద ప్రజల సగటు నెలవారీ వినియోగ స్థాయిలు 2012లో రూ.1138 నుంచి 2018లో 1082కు తగ్గాయి. ఈ కాలంలో గ్రామీణ భారతావని కొనుగోలు శక్తి తగ్గి పేదరికాన్ని చవిచూసిందని సర్వే స్పష్టం చేసింది.
మోడీ సర్కారు హాయాంలో పాలన, వాస్తవాల వెల్లడికి సంబంధించిన విషయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడింది. కేంద్రం.. సమాచారాన్ని సకాలంలో విడుదల చేయకుండా వాస్తవాలను తొక్కిపెట్టింది. కాగా, లాక్‌డౌన్‌.. నిరుద్యోగం, పడిపోతున్న ఆదాయాల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని అనేక అధ్యయనాలు కుండబద్దలు కొట్టాయి.

బడ్జెట్‌ తగ్గింపు.. వేతనాలు ఆలస్యం
ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా రూ.40వేల కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రస్తుత సంవత్సరం ఉపాధి హామీకి కేటాయించిన మొత్తం రూ. 1 లక్ష కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల కన్నా తక్కువ కేటాయింపు సరిపోదని ఉపాధి హామీ కార్యకర్తలు అంటున్నారు. 2020-21 ప్రారంభ బడ్జెట్‌ అంచనా.. 2019-20లో చేసిన వాస్తవ వ్యవయం కంటే రూ.9500 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. 2014 నుంచి ప్రతి ఏడాదీ కేటాయింపులు 2010-11 ఏడాది కంటే తక్కువగా ఉన్నాయి. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం.. కేటాయింపులు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 1.7శాతం ఉండాలి. కానీ, ఈ కేటాయింపులు 2014 నుంచి 0.3శాతం తగ్గిపోతున్నాయి. అలాగే పని పూర్తయిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌ పరిశోధన ప్రకారం.. 21శాతం చెల్లింపులు మాత్రమే సమయానికి జమ అయ్యాయి. మిగతా చెల్లింపులకు 50 రోజుల కన్నా ఎక్కువ సమయాన్ని కేంద్రం తీసుకున్నదని తెలిపింది.

ఇదిలా ఉండగా, 20 రాష్ట్రాలపై చేసిన విశ్లేషణ ప్రకారం.. ఉపాధి వేతనాలు, కనీస రాష్ట్ర వ్యవసాయ వేతనాల మధ్య విస్తృత అంతరం కనిపిస్తున్నది. రాష్ట్రాల కనీస వ్యవసాయ వేతనాలు.. ఉపాధి వేతనాల కంటే రూ.85 ఎక్కువ కావడం గమనించాల్సిన అంశం.

ప్రస్తుత సంక్షోభం కారణంగా ప్రతి వ్యక్తి పని ప్రదేశంలో పనిని డిమాండ్‌ చేయగలగాలి. వారికి ఏడాదికి కనీసం 200 రోజుల పనిని కల్పించాలి. వర్క్‌మెన్‌ వర్సెస్‌ రాప్తాకోస్‌ బ్రెట్‌ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. వృద్ధాప్యంలో జీవన భృతి, కనీస వినోదం, పిల్లల విద్య, వైద్య సంరక్షణ ఖర్చుల కోసం ఆర్థిక నిబంధనలను అమలు చేయాలి. ఒడిషా సర్కారు ఇప్పటికే కార్మికులకు అత్యంత హాని కలిగించే బ్లాకులలో ఉపాధి పని దినాలను 20 నుంచి 200కు పెంచింది. మరో వంద రోజులకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్రం రాజకీయాలు మరచి.. ఒడిషా సర్కారు నుంచి నేర్చుకోవాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. పేదలకు సహాయపడాల్సిందిగా మోడీ సర్కారుకు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌లో ప్రభుత్వ పాత్ర
లాక్‌డౌన్‌ సమయంలో యజమానులందరూ తమ ఉద్యోగులకు వేతనాలు చెలించాలని మార్చి 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కానీ, కేంద్రం మాత్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. పనిదినాలను తగ్గించింది. కార్మికులకు ఏప్రిల్‌నెల పూర్తి వేతనాల చెల్లింపులు జరగలేదు. దీంతో మోడీ సర్కారే స్వతహాగా తన ఆదేశాలను పాటించలేకపోవడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates