కరోనా: ప్రైవేటుపై వేటు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

టెస్టులపై రూల్స్‌ పాటించని ప్రైవేటు ల్యాబ్‌లు: నిపుణుల కమిటీ
కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
కొన్ని ల్యాబ్‌లు తప్పుడు నివేదికలిస్తున్నాయి
పరీక్షలు చేసేవారికి సరైన శిక్షణ ఇవ్వలేదు
నిపుణుల బృందం నివేదిక వివరాలు తెలిపిన సర్కారు
16 ల్యాబ్‌లకు నాలుగు టీమ్‌లను పంపిన ప్రభుత్వం
నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం

హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో నిబంధనలు పాటించని ప్రైవేటు ల్యాబ్‌లపై కఠినచర్యలు తీసుకోబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు నిపుణుల కమిటీ తమకు సిఫారసు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పరిశుభ్రత, భద్రత చర్యల వంటి అంశాలను చాలా ల్యాబ్‌లు పట్టించుకోవట్లేదని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలకు, ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతినిస్తూ జూన్‌ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. 16 ప్రైవేటు ల్యాబ్‌ల్లో తనిఖీలకు వైద్య ఆరోగ్యశాఖ జూన్‌ 25న నాలుగు బృందాలను పంపింది. పరీక్షల నిర్వహణలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను వారు పాటిస్తున్నారా, శిక్షణ పొందిన సిబ్బంది తగినంత మంది ఉన్నారా? పరీక్షలు ఎలా చేస్తున్నారు? వాటి నాణ్యత ఏ మేరకు ఉంది? తదితర అంశాలపై ఈ బృందాలు పరిశీలన జరిపి తమ నివేదికను సర్కారుకు అందజేశాయి. దీనిపై శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ బృందాల తనిఖీలో బయటపడిన లోపాలను, నిపుణుల సూచనలను ప్రభుత్వం శుక్రవారంనాటి మీడియా బులెటిన్‌లో తెలిపింది.

ఉదాహరణకు.. గచ్చిబౌలిలో ఉండే ఓ ప్రైవేటు ల్యాబ్‌లో 3 వేల దాకా టెస్టులు చేయగా అందులో 280కి పైగా పాజిటివ్స్‌ వచ్చాయి. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కేవలం పాజిటివ్‌ వివరాలను మాత్రమే ఉంచారు. మొత్తం టెస్టుల వివరాలను పొందుపరచలేదు. ఇలా ఎన్నో లోపాలు బయటపడిన నేపథ్యంలో.. ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షల కొనసాగింపుపై ప్రభుత్వం నేడో, రేపో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

నిపుణుల కమిటీ గుర్తించిన లోపాలు..
ప్రైవేటు ల్యాబ్స్‌లో సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. సిబ్బంది పీపీఈ కిట్లు ధరించట్లేదు. సేఫ్టీ కేబినెట్లు లేవు. పరిశుభ్రమైన వాతావరణ పరిస్థతులు లేవు.

కొవిడ్‌-19కు సంబంధించి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంలో సిబ్బందికి సరైన శిక్షణ పొందలేదనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.

నాణ్యత నియంత్రణ,టెస్టుల వ్యాలిడిటీ ప్రమాణాలను కొన్నిచోట్ల పాటించట్లేదు.

పూల్‌టెస్టింగ్‌ చేస్తున్న కొన్ని ల్యాబ్‌లు.. పరీక్షలో పాజిటివ్‌ వస్తే, ఒక్కో నమూనానూ మళ్లీ విడిగా పరీక్షించకుండా.. అన్నిటినీ పాజిటివ్‌గా చూపుతున్నాయనే అనుమానాన్ని నిపుణుల కమిటీ వ్యక్తం చేసింది. దీనివల్ల కొన్ని నెగెటివ్‌ కేసులు కూడా పాజిటివ్‌ ఖాతాలో పడుతున్నాయి.

ల్యాబుల్లో సరైన భద్రత చర్యలు, పాటించాల్సిన ప్రొటోకాల్స్‌ పాటించకపోవడం వల్ల నమూనాలు మలినమై అధిక పాజిటివిటీ రేటు వచ్చే ప్రమాదం ఉందన్న అనుమానాన్ని నిపుణుల కమిటీ వ్యక్తం చేసింది.

ఐసీఎంఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ డేటా పోర్టల్‌కు ప్రైవేటు ల్యాబల్‌లు అప్‌లోడ్‌ చేసిన గణాంకాల్లో కూడా తేడాలుండడం ఆందోళన కలిగించే విషయంగా నిపుణుల కమిటీ పేర్కొంది. కమిటీ తెలిపిన ప్రకారం.. 9577 టెస్టులు చేయగా 2076 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాయి. అదే సమయంలో.. 6733 టెస్టులకుగాను 2836 పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్రపోర్టల్‌కు అప్‌లోడ్‌ చేశాయి. వారి రికార్డుల్లో మాత్రం 12,700 టెస్టులు చూపి, అందులో 3571 పాజిటివ్‌ ఉన్నట్లుగా రాసుకున్నారు.

ఒక ప్రముఖ ఆస్పత్రిలో ల్యాబ్‌లో వాస్తవంగా 3940 టెస్టులు నిర్వహించినా అప్‌లోడ్‌ మాత్రం 1568 టెస్టులు చూపారు. ఇందులో 475 పాజిటివ్‌ కేసులుగా పేర్కొన్నారు (అంటే.. పాజిటివ్‌ రేటు 30.29 శాతం. కానీ, వాస్తవంగా చేసిన పరీక్షల ప్రకారమైతే పాజిటివ్‌ రేటు 12.05 శాతమే). ఇది చాలా ఎక్కువ. వాస్తవంగా చేసిన పరీక్షల సంఖ్యను అప్‌లోడ్‌ చేసినట్లయితే పాజిటివ్‌ రేటు చాలా తక్కువగా ఉండేదని నిపుణుల కమిటీ వ్యాఖ్యానించింది.

కొన్ని ల్యాబ్‌లు చాలా ఇరుకు ప్రాంతంలో, అపరిశుభ్రంగా ఉన్నాయి. పరికరాల నిర్వహణ కూడా సరిగా లేదు.

లక్షణాలున్న వారికి, ఆస్పత్రుల్లో చేరినవారికి మాత్రమే పరీక్షలు చేయాలని సర్కారు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలున్నా.. కొన్ని ల్యాబ్‌లు మాత్రం నేరుగా వచ్చినవారికి టెస్టులు చేస్తున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో నమూనాలను సేకరిస్తామని ప్రకటనలు ఇస్తున్నాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కూడా అవి పాటించట్లేదు.

తప్పుడు పాజిటివ్‌ రిపోర్టులు ఇవ్వడమే కాక.. తమ వద్దకు వస్తున్న ఇతర పే షెంట్లను, సిబ్బందిని కొవిడ్‌ బారినపడేలా కొన్నిల్యాబ్‌లు వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని తనిఖీలు..
నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని కొన్ని ల్యాబ్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కాగా.. ప్రైవేటు ల్యాబ్‌ల్లో లోపాలపై మరింత అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ మరిన్ని తనిఖీలను చేయనుంది. నివేదికలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసేందుకు.. ఆర్టీపీసీఆర్‌ యంత్రాల్లోని యాంప్లిఫికేషన్‌ ప్లాట్లను, ఇతర సమాచారాన్ని సీనియర్‌ మైక్రోబయాలజిస్టులుతనిఖీ చేయనున్నారు. మరోవైపు.. ప్రైవేటు ల్యాబ్స్‌లో నాణ్యత నియంత్రణ పరీక్షలు నిర్వహించాలని గాంధీ వైద్యకళాశాలను ఐసీఎంఆర్‌ ఆదేశించింది.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates