4 లక్షల టీబీ కేసులు మిస్సింగ్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– గణాంకాల్లో లేని పేర్లు 2.9 లక్షలు
– ఫాలోఅప్‌ చేసుకోనివారు 1.3 లక్షలు: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో గతేడాది 4 లక్షలకు పైగా క్షయ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వివరాలు మిస్‌ అయ్యాయి. వీరిలో పలువురి జాడ గుర్తించకపోగా.. మరికొందరు క్రమం తప్పకుండా చికిత్స చేయించు కోవడం (ఫాలోఅప్‌)లో విఫలమైనవారు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో వెలువరించిన ‘ఇండియా టీబీ రిపోర్టు 2020’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం… 2019లో 24.04 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఇది అంతకుముందు ఏడాది కంటే 11 శాతం ఎక్కువ. గతేడాది ఈ వ్యాధికి గురైనవారిలో 6.7 లక్షల మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా, 2019లో 26.9 లక్షల మంది క్షయ వ్యాధిగ్రస్తులున్నారని ప్రభుత్వం అంచనావేసింది. కానీ వీరిలో 2.9 లక్షల మందిని గుర్తించడంలో వైద్య శాఖ విఫలమైంది. ఇక గుర్తించిన 24.04 లక్షల మందిలో.. 22.7 లక్షల మందే విధిగా ఆస్పత్రులకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. మరో 1.3 లక్షల మంది ఫాలోఅప్‌లకు రావడం లేదు. మొత్తంగా చూస్తే 4.2 లక్షల మందికి పైగా క్షయ వ్యాధిగ్రస్తుల జాడ తెలియరావడం లేదు. ఇక గతేడాది నమోదైన కేసుల్లో 1,51,286 మంది చిన్నారులున్నారు. 2019లో టీబీ బారీనపడి 79,144 (4 శాతం) మంది చనిపోయారు.

లక్ష్యానికి దూరంగా…
భారత్‌లో 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలనీ.. ఒక్క టీబీ కేసు గానీ, మరణం గానీ నమోదుకాకూడదని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రధాని మోడీ 2017లో నేషనల్‌ స్ట్రాటజిక్‌ ప్లాన్‌ (ఎన్‌ఎస్‌పీ)ని స్వయంగా ప్రకటించారు. కానీ దాన్ని చేరుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏటేటా టీబీ కేసులు పెరుగుతుండగా.. లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యులో అడిషినల్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న ఓ అధికారి స్పందిస్తూ.. ‘టీబీ ఫ్రీ ఇండియా’ అనేది ఆచరణలో పలు సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. 2019లో దేశంలో ప్రతి లక్షమందిలో 159 మంది టీబీ బారిన పడ్డారనీ, ఇది ప్రపంచంలోనే అత్యధికం అని ఆయన చెప్పారు. వీరిలో సగం మందిని గుర్తించడమే లేదనీ, అలాంటప్పుడు టీబీ ఫ్రీ ఇండియా ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఆ రాష్ట్రాల్లోనే అధికం..
టీబీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ (20 శాతం) ప్రథమస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (9 శాతం), మధ్యప్రదేశ్‌ (8 శాతం), రాజాస్థాన్‌, బీహార్‌ (7 శాతం)లు ఉన్నాయి. దేశంలోని సగం కేసులు (53 శాతం) పైన పేర్కొన్న 5 రాష్ట్రాల నుంచే నమోదవుతుండటం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates