విద్యలో అంతరాలు పెంచొద్దు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా మహమ్మారితో విద్యారంగంలో చాలా గందరగోళం నెలకొంది. ఈ విద్యాసంవత్సరమే వృధా అయిపోతుందా అని కొందరు భయపడుతుండగా ఏదో ఒకటి చేసి పిల్లలకు చదువు చెప్పేయాలని ఇంకొందరు ఆతృత పడుతున్నారు. వీటన్నిటి మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ పది, ఇంటర్‌తో సహా వివిధ పరీక్షలను వాయిదా వేశాయి. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలా రద్దు చేయాలా అన్న మీమాంసలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. విద్యా సంవత్సర క్యాలెండర్‌లో మార్పులు చేసి, జూన్‌ బదులు ఆగస్టులో మొదలు పెడతామని చెబుతున్నారు. వీటన్నిటి మధ్య దూర విద్య, ఆన్‌లైన్‌ విద్యపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

కరోనా వైరస్‌ మూలంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అసమానతలు చోటు చేసుకుంటున్నాయని ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక సంస్థ యునెస్కో మంగళవారంనాడు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. స్వల్ప, మధ్య ఆదాయాలు గల దేశాల్లో 40 శాతం మంది పిల్లలకు కరోనా నేపథ్యంలో చదువుకునే అవకాశాలే కల్పించలేదని స్పష్టం చేసింది. ప్రాథమిక, సెకండరీ విద్యార్థులకు చాలా పేద దేశాల్లో రేడియో, టి.వి పాఠాలకు పరిమితం కాగా స్వల్ప, మధ్యతరగతి ఆదాయాలు గల దేశాల్లో 55 నుండి 73 శాతం, అధిక ఆదాయ దేశాల్లో 93 శాతం ఆన్‌లైన్‌ విద్యను బోధించనున్నారని ఆ నివేదిక తెలిపింది. అయితే, దూరవిద్య లేదా ఆన్‌లైన్‌ విద్య ఏదైనాగాని తరగతి గది బోధనకు ప్రత్యామ్నాయం కాదని కుండ బద్దలు కొట్టింది. భారత్‌లో రేడియో, టి.వి, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా విద్యా బోధనకు ప్రభుత్వాలు పూనుకుంటున్నా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవి అందుబాటులో లేనందున ఆచరణలో తీవ్ర పరిమితులు ఏర్పడుతున్నాయని యునెస్కో పేర్కొంది.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం ఎలా? ఈ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడం ఎలా? మన విద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే సామాన్య కుటుంబాలవారు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు మేధావులను, ప్రగతికాముకులనూ వేధిస్తున్నాయి. ఇతర దేశాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించడం, వాటి నుండి నేర్చుకోవడం అవసరం. వియత్నాంలో (ఇంతవరకూ కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు) తరగతి లోని విద్యార్థుల సగం మందికి మూడు రోజులు, మిగతా సగం మందికి మరో మూడు రోజులూ అలా రోజు విడిచి రోజు భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠాలు బోధించాలని నిర్ణయించారు. అక్కడ తరగతి గది బోధనే సాగుతున్నది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఆన్‌లైన్‌లో బోధనకు మొగ్గు చూపుతున్నారు.

మన దేశంలో అక్షరాస్యతతో సహా మానవాభివృద్ధి సూచికల్లో అగ్ర భాగాన వున్న కేరళలో దూర విద్యను టి.వి, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా అందిస్తున్నారు. అయితే, అక్కడి వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే మొత్తం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, వారి నివాస ప్రాంతంలో టి.వి, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వంటి అంశాలపై వివరమైన సర్వే జరిపి అందరికీ విద్యను అందుబాటు లోకి తేవడానికి చర్యలు చేపట్టింది. గిరిజన ప్రాంతాలు, పేదలు నివసించే ఆవాసాల్లో 50 వేల సామూహిక స్టడీ సెంటర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇప్పటికే పిల్లల ఇళ్లకు పాఠ్య పుస్తకాలు అందజేసింది. మధ్యాహ్న భోజనం కూడా ఇంటింటికీ సరఫరా చేస్తోంది. ఆర్థిక స్తోమత కలవారికి ఒక లక్ష ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు రుణాలు ఏర్పాటు చేసింది. అయితే, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక తరగతి గది బోధనా పద్ధతులకు మళ్లాలని కేరళ ప్రభుత్వం చెబుతోంది.

మన రాష్ట్రంలో డిజిటల్‌ మౌలిక వసతులు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వంటివి పూర్తిగా పరిశీలించాకే ఆన్‌లైన్‌ విద్యపై నిర్ణయం చేయాలి. ప్రస్తుతం జిల్లాకో స్టూడియో, నాలుగు నుండి ఐదు వందల వరకూ డిజిటల్‌ తరగతి గదులూ వున్నట్టు చెబుతున్నారు. వాటిలో ఎన్ని పని చేస్తున్నాయో, ఎన్నిటికి నెట్‌ కనెక్టివిటీ వుందో తెలియదు. మన విద్యార్థుల్లో ఎంతమందికి టి.వి, స్మార్ట్‌ ఫోన్‌, వాటికి నెట్‌ కనెక్షన్‌ వంటివి అందుబాటులో వున్నాయన్నదీ అనుమానాస్పదమే! ఇలాంటి వాస్తవ పరిస్థితుల్ని పరిగణన లోకి తీసుకొని, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో చర్చించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలి. సందట్లో సడేమియా అన్నట్టు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజిలు అడ్మిషన్‌ యత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. వాటి వలలో విద్యార్థులు, తల్లిదండ్రులూ పడకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్రమత్తం చేయాలి. విద్యా విషయకంగా ప్రభుత్వ స్కూళ్లు, వాటిలో చదివే విద్యార్థులు వెనకబడని విధంగా విధానాలను రూపొందించడం సర్కారు బాధ్యత.

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates