సేవావృత్తులు గాలికి..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-ఐదేండ్లుగా పాలకవర్గాల్లేని ఫెడరేషన్లు
– ఉమ్మడి రాష్ట్రంలోని నిధులు సైతం పక్కదారి
-2017 నుంచి పెండింగ్‌లో 5 లక్షల రుణ దరఖాస్తులు
– పట్టించుకోని సర్కార్‌
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సేవా వృత్తులను గాలికొదిలేసింది. ఆరేండ్లుగా వృత్తి ఫెడరేషన్లకు నిధులు కేటాయించలేదు, పాలక వర్గాలనూ నియమించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపి కేవలం ఒకటి రెండు సేవా వృత్తులకు ఫెడరేషన్లతో సంబంధం లేకుండా పథకాలను ప్రకటించింది. పెరుగుతున్న సాంకేతికతను అందుకోలేక ఏండ్లుగా అణచబడుతున్న అట్టడుగు సేవా వృత్తులు ఉపాధి కోల్పోతున్నాయి. పోటీ ప్రపంచంలో తట్టుకుని వృత్తులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నా, ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో 50కి పైగా వివిధ సేవా వృత్తులు ఉన్నాయి. ప్రభుత్వ ఆదరణ లేక, అధునిక సాంకేతికతతో పోటీ పడలేక బక్కచిక్కి పోతున్నాయి. అణగారిన, అట్టడుగు వర్గాలైన రజక, నాయిబ్రహ్మణ, గీతా కార్మికులు, వడ్డెర, విశ్వబ్రహ్మణ, శాలివాహన(కుమ్మరి), సగర(ఉప్పరి), పూసల, మేదరి, మేర(దర్జీ), వాల్మీకి బోయ, బట్రాజు మొదలగు 12 సేవా వృత్తులకు ప్రత్యేక పెడ˜రేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. మిగతా సేవా వృత్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర కార్పొరేషన్ల పరిధిలో చేర్చారు. ఇందులో కూడా బాగా వెనక బడిన తరగతుల కోసం ప్రభుత్వం ఎంబీసీ, సంచార జాతుల కోసం మరో ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న 14 ఫెడరేషన్లలో ఒక్క ఎంబీసీ కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మెన్‌ను నియమించగా, మరే ఫెడరేషన్‌కు పాలక వర్గాలను నియమించలేదు. అయితే ఎంబీసీ ఫెడరేషన్‌కు పాలక వర్గం ఉన్నా ఏం చేయాలో తెలియని అయోమయపరిస్థితి నెలకొంది. ఎంబీసీలో ఏఏ కుల సేవా వృత్తులను చేర్చాలో తేల్చాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వం అధికారం అప్పగించింది. ఇప్పటి వరకు బీసీ కమిషన్‌ వేటిని ఎందులో చేర్చాలో నిర్ణయం తీసుకోక పోవండంతో ఈ ఫెడరేషన్‌ నామమాత్రంగా తయారైంది. సంచార జాతుల కోసం ఏర్పాటు చేసిన ఫెడరేషన్‌కు సంబంధించి జీవో విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీని గురించి అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2017-18, 2018-19 రెండేండ్లకుగాను రజక, నాయిబ్రహ్మణ ఫెడరేషన్లకు చేరో రూ. 500 కోట్లు ప్రకటించింది. ఇందులో రజకులకు రూ.80 కోట్లు, నాయిబ్రహ్మణులకు రూ. 87 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా 10 ఫెడరేషన్లకు ఇప్పటి వరకు నయా పైసా కేటాయించలేదు. కరోనా నేపథ్యంలో సేవా వృత్తులు అతలాకుతలమవుతున్నాయి. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లోనైనా తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పెండింగ్‌లో 5లక్షల రుణ దరఖాస్తులు
రాష్ట్రంలో వివిధ ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్‌ వద్ద గత రెండేండ్లుగా 5లక్షల 20 వేల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సేవా వృత్తులను అధునీకరించేందుకు ప్రభుత్వం కేటగిరీల వారీగా రుణాలను ఇవ్వాలని 2018 జులై 26న 190 జీవో ద్వారా నోటీఫికేషన్‌ జారీ చేసింది. లక్ష నుంచి రూ. 12 లక్షల వరకు రుణాలను సబ్సీడితో అందించనున్నట్టు అందులో పేర్కొంది. దీంతో వివిధ ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్‌ ద్వారా దాదాపు 5లక్షల 70 వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2018 శాసనసభ ఎన్నికల ముందు సేవా కులవృత్తుల నుంచి వ్యవతిరేకత రాకుండా ఉండేందుకు నోటిఫికేషన్‌కు విరుద్దంగా రుణాల పరిమితిని 50 వేలకు కుదించి కేవలం 50 వేలమందికి మాత్రమే అందించారు. దాంతో మిగతా 5 లక్షల 20 వేల మంది రేండేండ్లుగా రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా 2015లోనే ప్రభుత్వం సేవా కుల వృత్తులను ఆదుకునేందుకు రుణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫెడరేషన్ల ద్వారా లక్షా 62 వేలు, కార్పొరేషన్‌ ద్వారా లక్షా 31 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి 2018లో జారీ చేసిన రుణ నోటిఫికేషన్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం
విభజన సమయంలో కార్పొరేషన్‌కు ఉమ్మడి రాష్ట్రం నుంచి రూ. 600 కోట్ల నిధులు రాష్ట్ర వాటాగా వచ్చాయి. ఈ నిధులను సర్కార్‌ పీడీ అకౌంట్లల్లో నిల్వ ఉంచింది. ఆ తర్వాత 2015 నుంచి 2018 వరకు పలు దఫాలుగా రూ. 250 కోట్లను సొంత అవసరాలకు వాడుకోగా మిగతా నిధులు రూ. 350 రోట్లు ఇప్పటికి బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. సొంతానికి వాడుకున్న నిధులతో పాటు బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని విడిపించి ఫెడరేషన్లకు కేటాయించాలని వివిధ సేవా వృత్తుల సంఘాలు పలు మార్లు విన్నవించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సేవా వృత్తులను ఆదుకోవాలి
కరోనా మహమ్మారి మూలంగా పనులు కోల్పోయిన సేవావృత్తి దారులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి. సేవా వృత్తి ఫెరేషన్లకు వెంటనే పాలక వర్గాలను నియమించాలి. అణగారిన, అట్టడుగు వర్గాల వృత్తులు, సంచార జాతులను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలి. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 లక్షల మంది లబ్దిదారుల రుణాలను వెంటనే గ్రౌండింగ్‌ చేయాలి.
– పైళ్ల ఆశయ్య, ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్‌

ఉపాధి కోల్పోతున్న కుల వృత్తులు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక కుల వృత్తులు ఉపాధి కోల్పోతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కులవృత్తులు ద్వంసమయ్యాయి. ఎంబీసీ, సంచార జాతులతో పాటు మిగతా 12 ఫెడరేషన్లకు వెంటనే పాలక వర్గాలను నియమించి నిధులు కేటాయించాలి. వివిధ ఫెరేషన్లు, బీసీ కార్పొరేషన్‌ వద్ద పెండింగ్‌లో రుణాలను మంజూరు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన సందర్భంలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ. 600 కోట్లను పీడీ అకౌంట్‌ నుంచి వెంటనే కార్పొరేషన్‌కు బదిలి చేయాలి.
– ఆర్‌.కృష్ణయ్య , బీసీ సంక్షేమ సంఘం

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates