కరోనా ఘోష వినిపించుకోరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎం.వి.ఎస్‌. శర్మ
కరోనా కేసులు దేశంలో 4 లక్షలు దాటాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాలలో భారతదేశం నాలుగోస్థానంలో ఉంది. రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలోను, రోజూ సంభవిస్తున్న మరణాల సంఖ్యలోను మనం మూడో స్థానంలో ఉన్నాం. కరోనాను అదుపు చేయలేని వైఫల్యం ప్రదర్శిస్తున్న దేశాధినేతలలో మొత్తానికి ట్రంప్‌, బోల్సనారో ల సరసన మోడీ కూడా చేరారు.
కోవిడ్‌-19 ని అదుపు చేసే విషయంలో కొన్ని ”పొరపాట్లు”, కొన్ని ”లోపాలు” జరిగిన మాట వాస్తవమని అంగీకరిస్తూనే, ”ఇందులో ప్రతిపక్షాలదేమీ బాధ్యత లేదా?” అని ఎదురు దాడికి యథావిధిగా, తన అలవాటు కొద్దీ దిగారు హోం మంత్రి అమిత్‌ షా. విపత్తు నిర్వహణ చట్టం కింద సమస్త నిర్ణయాధికారాలనూ కేంద్రం తన గుప్పెట్లోనే ఉంచుకున్నదన్న వాస్తవాన్ని ఆయన మరిచిపోయినట్టున్నారు. ‘పి.ఎం.కేర్స్‌’ పేర ఒక ప్రైవేటు నిధిని ప్రారంభించి సి.ఎస్‌.ఆర్‌ నిధులన్నీ ఆ ఖాతాకే జమ అయ్యేట్టు చేసుకున్నారు. రాష్ట్రాలకు అదనంగా ఎటువంటి నిధులనూ ఇవ్వలేదు. కనీసం అప్పులు చేయడానికి అవసరమైన వెసులుబాటును కూడా కల్పించలేదు.

లాక్‌డౌన్‌ వ్యవధిని వృధా చేసిన కేంద్రం

మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటికి దేశం మొత్తం మీద 600 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం మొదలయ్యేనాటికి-అంటే జూన్‌ నెల వచ్చేసరికి కేసులు లక్షల్లో ఉన్నాయి. సాధారణంగా లాక్‌డౌన్‌ విధించేది కరోనాను నివారించడానికి కాదు. దాని వ్యాప్తి వేగంగా జరగకుండా తగ్గించి మనకు కొంత వ్యవధి లభించడానికి మాత్రమే లాక్‌డౌన్‌ తోడ్పడుతుంది. ఈ వ్యవధిని మన వైద్య వ్యవస్థను పూర్తిగా సిద్ధం చేసుకోడానికి ఉపయోగించాలి. ఆస్పత్రులలో తగు సంఖ్యలో పడకలను, సిబ్బందిని, మందులను, వెంటిలేటర్లు తదితర పరికరాలను సిద్ధం చేసుకోవాలి. పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి కావల్సిన కిట్లను తెప్పించుకోవాలి. వైద్య సేవలందించే సిబ్బంది రక్షణకు అవసరమైన పిపిఇ లను తెచ్చుకోవాలి. ఏ కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకిందో గుర్తించడం, క్వారంటైన్‌ సదుపాయాలు కల్పించడం, తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించడం, ఐసియు బెడ్ల సంఖ్య పెంచుకోవడం, ఆక్సిజన్‌ ఏర్పాట్లు, వెంటిలేటర్లు తెప్పించడం-ఇటువంటి అత్యవసర అంశాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి. కేంద్రం ఈ బాధ్యతలను నెరవేర్చడం మీద దృష్టి పెట్టనేలేదు.

జనవరి నాటికే కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ అందించిన సమాచారం కేంద్రం వద్ద ఉంది. కాని ఫిబ్రవరి నెల అంతా ట్రంప్‌ పర్యటనకు సన్నాహాలు చేయడంలోనే మునిగిపోయింది కేంద్రం. ఇంకోవైపు పౌరసత్వ చట్టం సవరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులపై నిర్బంధ ప్రయోగంలో మునిగిపోయింది. ఆ తర్వాత తబ్లిగి జమాత్‌ కార్యకర్తల వల్లే కరోనా వ్యాపించిందన్న ప్రచారాన్ని అందుకుంది. అంతే తప్ప ఈ కరోనా దాడిని ఎదుర్కొని నిలిచేలా మన వైద్య రంగంలో అవసరమైన

ఏర్పాట్లను ఏమాత్రమూ పట్టించుకోలేదు.

నిజానికి ఈ లాక్‌డౌన్‌ ఒక ఘోర వైఫల్యం. ఎటువంటి ముందస్తు ప్రణాళిక గాని, అన్ని స్థాయిలలో వ్యవస్థలను సన్నద్ధం చేయడం గాని ఏమీ లేదు. కోట్లాది వలస కార్మికులు అనుభవించిన, ఇంకా అనుభవిస్తున్న దుస్థితి ఈ వైఫల్యానికి ఓ మచ్చుతునక.

ఏ మూలకూ చాలని వైద్య సదుపాయాలు ‘ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ బింకంగా ప్రకటనలు ఇస్తూ వచ్చారు మన నేతలు. తీరా ఇప్పుడు కోవిడ్‌-19 విజృంభిస్తున్నప్పుడు ఎక్కడికక్కడ చేతులెత్తేస్తున్నారు.
ఒక అధ్యయన సంస్థ (ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ కి చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ స్టడీ) నివేదిక ప్రకారం మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలోనూ మొత్తంగా 19 లక్షల బెడ్లు మాత్రం ఉన్నాయి. వీటిలో ఐసియు బెడ్లు 95,000 మాత్రమే. వెంటిలేటర్లు కేవలం 48,000 ఉన్నాయి. మన దేశ జనాభాతో పోల్చితే ఈ ఐసియు బెడ్లు గాని, వెంటిలేటర్లు గాని చాలా చాలా తక్కువ గా ఉన్నాయి. పైగా వీటిలో 65 శాతం ఐసియు బెడ్లు, వెంటిలేటర్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఇవి అందుబాటులో లేనట్టే. ఒక్క కేరళ లో మాత్రమే పరిస్థితి భిన్నం. అక్కడ వైద్య వ్యవస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉంది.

లాక్‌డౌన్‌ కాలంలో కేంద్రం యొక్క వైఫల్యం కారణంగా ఇప్పుడు రాష్ట్రాలు- ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, వంటివి- తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నాయి. ఐసియు బెడ్లు, వెంటిలేటర్లు ఏ మూలకూ చాలడం లేదు. పిపిఇ ల కొరత వెన్నాడుతోంది. అవసరమైన మేరకు టెస్టులు చేయలేకపోతున్నారు. ఢిల్లీ లోని వైద్య సదుపాయాలు ఢిల్లీ వాసులకే అంటూ ఒక సంకుచితమైన వైఖరితో కేజ్రీవాల్‌, వైఫల్యానికి కేంద్రందే పూర్తి బాధ్యత అంటూ మమత తమ బాధ్యత నిర్వహణలోని వైఫల్యాల నుండి తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మోడల్‌ రాష్ట్రం గా చెప్పుకొనే గుజరాత్‌ లో వెంటిలేటర్ల కొనుగోలులో కుంభకోణం దారుణమైనది. నాణ్యత లేని వెంటిలేటర్ల కొనుగోలు వలన దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ లో జరిగిన గోల్‌మాల్‌ లో రాష్ట్ర బిజెపి నేత అడ్డంగా దొరికిపోయాడు. యు.పి, ఎం.పి, బీహార్‌ తదితర రాష్ట్రాలలో టెస్టులను చాలా తక్కువగా చేస్తున్నారు. తద్వారా తమ రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమే గాక బాధ్యతా రాహిత్యం కూడా. అమెరికాలో ట్రంప్‌ అనుసరిస్తున్న వైఖరి ఇదే.

సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నామా?
జూన్‌ 15వ తేదీన కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మన దేశంలో కరోనా వ్యాప్తిని జయప్రదంగా నియంత్రించామని ప్రకటించేశారు. కాని ఆ తర్వాత రోజూ వచ్చే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. దాంతోబాటే రోజువారీ మరణాల సంఖ్యా పెరిగింది. మొదటి నుంచీ కేంద్రం కరోనా ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికే మొగ్గు చూపుతోంది.

ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (ఐపిహెచ్‌ఎ) ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఎపిఎస్‌ఎం) ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడెమాలజిస్ట్స్‌ (ఐఎఇ) – ఈ మూడూ ప్రధానమైన ప్రజారోగ్య సంస్థలు. మోడీ ప్రభుత్వం కోవిడ్‌-19 ని నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా తప్పుబడుతూ ఈ మూడూ మే 25న ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ”జాతీయ స్థాయిలో వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఎప్పుడు పడితే అప్పుడు మార్చివేయడం, పొంతన లేని విధానాలను అమలు చేయడం” జరుగుతోందని విమర్శించాయి. దేశంలో వివిధ ప్రాంతాలలో ఇప్పటికే సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నామని ఆ సంస్థలు స్పష్టం చేశాయి.

ఒక నెలరోజుల క్రితం ఢిల్లీలో ప్రతీ వంద పరీక్షలలో 6.6 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ప్రస్తుతం 30 కేసులు పాజిటివ్‌ వస్తున్నాయి. మహారాష్ట్ర లో నెల రోజుల క్రితం 14.7 శాతం పాజిటివ్‌ కేసులు వస్తే ఇప్పుడు 21 శాతం వస్తున్నాయి. ముంబాయి నగరంలో ఇది మరీ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు ప్రతీ రోజూ దేశం మొత్తంమీద ఎన్ని కరోనా టెస్టులు జరపాలి? రోజూ వస్తున్న పాజిటివ్‌ కేసులు 14 వేలు దాటాయి. కనుక రోజూ కనీసం 75,000 నుండి 1,25,000 వరకూ టెస్టులు చేయాల్సి వుంటుంది. ఇప్పుడు మనం ఒక రోజులో చేయవలసినన్ని టెస్టులను ఒక వారంలో చేస్తున్నాం. మన సాటి దేశాలతో పోల్చి చూస్తే ఎంత తక్కువగా మనం పరీక్షలు జరుపుతున్నామో అర్థం అవుతుంది. ప్రతీ వెయ్యి జనాభాకు మన దేశంలో 4.4 మందికి టెస్టులు జరుపుతున్నాం. అదే టర్కీలో 33 మందికి, మలేసియాలో 20.5 మందికి జరుపుతున్నారు. ఇక చైనా, క్యూబా, ఇ.యు దేశాలతో పోల్చడానికి మనం వారి దరిదాపుల్లో లేనేలేము.

కేంద్రం నిరాకరణ వెనక కారణం
దేశంలో సామూహిక వ్యాప్తి జరగడంలేదని పదేపదే కేంద్రం ప్రకటిస్తోంది వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తోంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఇలా చేస్తోంది. అందుకే అమిత్‌ షా ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారు.
టెస్టు కిట్లను తెప్పించి రాష్ట్రాలకు అందించడం, దానికి అవసరమైన నిధులను ఇవ్వడం కేంద్రం బాధ్యత. వాటితోబాటు పిపిఇ లను తగిన సంఖ్యలో అందించాలి. వీటిని ఉత్పత్తిచేసే వారితో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ముడి సరుకులు, పరికరాలు సమకూర్చుకోడానికి వారికి తోడ్పాటు అందించాలి. సప్లై చెయిన్‌ ను ఏర్పాటు చేయాలి. కాని కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆరోగ్యానికి కేటాయించింది కేవలం రూ.15,000 కోట్లు మాత్రమే. మొత్తం ప్యాకేజీలో ఇది 0.01 శాతం కన్నా తక్కువ. అంటే మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ప్రజారోగ్యం ఎక్కడుందో స్పష్టం అవుతోంది కదా. ఇంత తక్కువ మొత్తంతో ఇంత పెద్ద దేశపు ప్రజారోగ్య వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయగలుగుతారు?
ఇక పిఎం కేర్స్‌ నుండి రూ.3000 కోట్లను 50,000 వెంటిలేటర్లు కొనుగోలు చేయడానికి కేటాయించారు. ఈ నిధి ప్రైవేటు నిధి గనుక సరఫరా చేసే కాంట్రాక్టు ఎవరికిచ్చారో, వారికున్న నాణ్యతా ప్రమాణాలేమిటో, ఎంత ధరతో కొంటున్నారో ఈ వివరాలేవీ మనం తెలుసుకునే అవకాశంలేదు. మరో గుజరాత్‌ తరహా కుంభకోణం జరిగినా చేయగలిగిందేమీ లేదు.

చైనాలో జయప్రదంగా కరోనా వ్యాప్తిని నిరోధించగలగడానికి ప్రధాన కారణం అక్కడ ప్రజానీకం యావన్మందినీ ప్రభుత్వం ఈ పోరాటంలో భాగస్వాముల్ని చేసింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు చెప్పింది. ఇప్పుడు అమెరికాలో, బ్రెజిల్‌లో, రష్యాలో, ఇండియాలో అదుపు తప్పిపోతున్న పరిస్థితిని గురించి తన ఆందోళనను వెల్లడి చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైర్మన్‌ గెబ్రియేసస్‌ ”ఇది నాయకుడు లేని పోరాటంలా ఉంది” అన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు ప్రజల్ని వారి తిప్పలు వారే పడాలని వదిలేస్తున్నాయని, కోవిడ్‌-19పై పోరాటంలో అవి విఫలమౌతున్నాయని అర్థం. మన దేశంలో జయప్రదంగా ప్రజలను భాగస్వాములుగా చేసి పంచాయితీల స్థాయి వరకూ ఉన్న అన్ని వ్యవస్థలనూ పూర్తిగా వినియోగించుకున్న కేరళ నమూనాను చూసైనా నేర్చుకోవచ్చు. కాని ఎంతసేపూ కార్పొరేట్ల సేవ లోనే తరించే ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల గోడు ఎక్కడ చెవులకెక్కుతుంది? చప్పట్ల హోరులోనో, శంఖాల మోతలోనో, గంటల ఘోషలోనో చెవులు మూసుకుపోయిన ప్రభుత్వానికి చెప్పి తెలియజేసే దశ ఎప్పుడో దాటిపోయింది. ఇక తట్టి, కదిపి, కుదిపే ఉద్యమాల మార్గమే ప్రజలకు శరణ్యం.

RELATED ARTICLES

Latest Updates