మేము చెప్పినా అమలు చేయరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దివ్యాంగులకు నిధి ఎందుకు ఏర్పాటుచేయలేదు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన నేపథ్యంలో దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవా? లేక వారి సంక్షేమాన్ని విస్మరిస్తోందా..?అని హైకోర్టు ప్రశ్నించింది. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వపరంగా లబ్ధి పొందలేని సుమారు 7 లక్షల మంది దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పినా ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరుతూ న్యాయవాది కె.శివగణేష్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ మరోసారి విచాణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి డి.దివ్య విచారణకు హాజరయ్యారు. దివ్యాంగులను ఆదుకునేందుకు రూ.3.5కోట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చొప్పున పెన్షన్‌ చెల్లిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1800 కోట్లు  కేటాయించిందని అన్నారు. పెన్షన్‌కు అదనంగా లాక్‌డౌన్‌లో కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు, మనిషికి 12 కిలోల చొప్పున బియ్యం అందించినట్లు తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం… 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10.46 లక్షలమంది దివ్యాంగులు ఉన్నారని, వీరి సంఖ్య ఈ మధ్యకాలంలో కొంత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వీరిలో తెల్ల రేషన్‌కార్డులున్న 4.93లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే మరి మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates