వృద్ధుల కడుపు మీద కొట్టడమే బంగారు పాలన!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిస్సహాయ వృద్ధుల పొట్ట మీద కొట్టడానికి పాలకులు ఇన్ని అవినీతికర పిల్లిమొగ్గలు వేస్తారు. ”ప్రజా ప్రయోజనాలు” అనే మాయాజాలపు మాటతో (అంటే మనందరి ప్రయోజనాలు అన్నమాట) ఆ మూడు లక్షల మంది వృద్ధులు ఏమైపోయినా ఫరవాలేదు అని న్యాయస్థానాలు అంటాయి. మన పేరు మీద మన తల్లిదండ్రుల మీద సాగుతున్న ఈ దుర్మార్గ దాడి పట్ల మనం మౌన ప్రేక్షకులుగా ఉంటాం. ఇదీ బంగారు తెలంగాణ!!

”వీపు మీద కొట్టినా సరే గాని కడుపు మీద కొట్టగూడదు” అనేది తరతరాల వివేకం సంతరించుకున్న తెలుగు సామెత. ఎవరినైనా భౌతికంగా హింసించినా, వేధించినా ఫరవాలేదు గాని ఆకలితో మాత్రం మాడ్చగూడదు, అన్నం దొరికే అవకాశాన్ని నిరాకరించగూడదు అనే మానవతా స్పర్శతో కూడిన, ఎవరైనా పాటించవలసిన ఆదేశం అది. మహా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సామెత రుచిస్తున్నట్టు లేదు. ఈ ఆరేండ్లలో వీపు మీద కొట్టడంలో గత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా మించిపోయి రికార్డు స్థాపించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిక కడుపు మీద కొట్టే మహత్కార్యం ప్రారంభించినట్టుంది. వయసులో ఉన్నవారి, ఇతర సహాయాలు అందేవారి కడుపు మీద కొట్టినా అర్థం చేసుకోవచ్చు గాని నిస్సహాయులైన వృద్ధుల కడుపు మీద కొట్టడానికి పాలకులు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారంటే బంగారు తెలంగాణ ఎంత మానవీయంగా మారిందా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

కొవిడ్‌-19 మహావిపత్తు వల్ల, లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నాయనడంలో, ఆ సమస్య పరిష్కరించడానికి కొత్త మార్గాలు అన్వేషించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే ప్రారంభమైన, భవిష్యత్తులో ఇంకా తీవ్రతరం కానున్న ఆర్థిక సంక్షోభ సమయంలో ఖర్చు తగ్గించుకోవడానికి, ఉన్న వనరులను పొదుపుగా వినియోగించడానికి, వీలైతే ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రయత్నించవలసిందే. కానీ ఆ మూడు పనులూ ఏ రంగాలలో జరగాలనేదానికి మానవతా దృష్టి, ఆయా రంగాల ప్రాధాన్యత పట్ల వాస్తవికమైన అంచనాలు ఉండాలి. ఏ ఖర్చులను తగ్గించే కోతలు విధించాలి, ఏ రంగాలలో పొదుపు చేయవచ్చు, ప్రజల మీద భారం పడకుండా ఏ రంగాలలో అదనపు ఆదాయ సమీకరణ జరపవచ్చు అనే ఆలోచన ఉండాలి.

తెలంగాణలో ఈ లాక్‌డౌన్‌ ఆర్థిక సంక్షోభ సమయంలో పొదుపు చర్యలు, ఖర్చు తగ్గించే చర్యలు ప్రారంభమయ్యాయి. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కన్న ధనవంతమైన రాష్ట్రమని తనకు తాను కితాబులు ఇచ్చుకుని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం అందరి కంటె ముందే ఆ పొదుపు చర్యలు ప్రారంభించడం విచిత్రం. ఆ పొదుపు చర్యలలో భాగంగా ప్రభుత్వోద్యోగుల జీతాల కోతకు ఆదేశాలు జారీ కావడం ఇంకా విచిత్రం. జీవితమంతా ప్రభుత్వ సేవలో గడిపి, పదవీ విరమణ పొంది, వృద్ధాప్యంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అందే పెన్షన్ల మీద కూడ కోత విధించడం మరింత విచిత్రం. అంతమాత్రమే కాదు, వృద్ధుల మీద ఆ దాడికి దొంగదారులు వెతకడం మరింత విచారకరం, దుర్మార్గం కూడ.

ఇలా ఉద్యోగుల వేతనాల కోత, వృద్ధుల పెన్షన్ల కోత చర్య దానికదిగానే దయారహితమైనదీ, అమానవీయమైనదీ అనుకుంటే ఆ చర్య పూర్వాపరాలు, ఆ చర్యను సమర్థించుకుంటున్న తీరు పాలకుల దుర్మార్గానికి అద్దం పడుతున్నాయి. ఆ చర్య అమలవుతున్న ప్రక్రియ ఎక్కడ మొదలై, ఎన్నెన్ని మలుపులు తిరుగుతున్నదో, ఎన్ని అమానవీయ వాదలను చేస్తున్నదో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు నిస్సహాయ వృద్ధుల కడుపు కొట్టడానికి ప్రభుత్వం ఎట్లా మాటలు మారుస్తూ వచ్చిందో చూస్తే విచారం కలుగుతుంది.

మొట్టమొదట, కేంద్ర ప్రభుత్వ లాక్‌డౌన్‌ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు, కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించిన రోజు, మార్చి 22న తెలంగాణ ప్రభుత్వం జీఓ 45 అనే ఉత్తర్వులను జారీ చేసి, మార్చి 31 వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ లాక్‌డౌన్‌ కాలంలో పాటించవలసిన నిబంధనలను ఈ జీవోలో పొందు పరిచారు. ఇరవై మూడు నిబంధనల ఈ ఉత్తర్వులో పద్నాలుగో నిబంధన ఆసక్తికరమైనది. ”ప్రభుత్వంలోనూ, అన్ని ప్రయివేటు సంస్థలలోనూ పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదిక మీద పని చేస్తున్నవారితో సహా అందరికీ లాక్‌డౌన్‌ కాలంలో జీతాలు, వేతనాలు పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ఈ నిబంధనకు ఎటువంటి ఉల్లంఘన జరిగినా తీవ్రంగా పరిగణించి, ది ఎపిడెమిక్‌ డిసీజెస్‌ ఆక్ట్‌ 1897 ప్రకారం శిక్ష విధించడం జరుగుతుంది” అని ఆ నిబంధన ప్రకటించింది.

అబ్బ, ఈ ప్రభుత్వానిది ఎంత దయార్ద్ర హృదయం! కేవలం వారమంటే వారం రోజుల లాక్‌డౌన్‌ విధిస్తూ, కార్మికులకూ, ఉద్యోగులకూ ప్రభుత్వ సంస్థలుగాని, ప్రయివేటు సంస్థలుగాని ఆ వారం జీతాలు, వేతనాలు ఎగ్గొడతాయేమోననే దూరదృష్టితో, అలా జరగకుండా చూడడానికి జీవో జారీ చేసింది! ఎవరైనా అలా ఎగ్గొడితే వారిపట్ల చర్యలు తీసుకుంటానన్నది! చాల సంతోషం.

కాని కథ అక్కడితో అయిపోలేదు. వారం తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 14వరకు మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించింది. తెలంగాణ పాలకుల దయార్ద్ర హృదయానికి ఈ వారం రోజుల్లోనే ఏమి జరిగిందో తెలియదు గాని, వేతనాలు పూర్తిగా చెల్లించాలనే నిబంధన, చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామనే, శిక్షిస్తామనే హెచ్చరికా గాలికి ఎగిరిపోయాయి. మార్చి 30న జీఓ.27 అనే మరొక కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వోద్యోగుల వేతనాలలో 10శాతం నుంచి 75శాతం కోత విధిస్తున్నామనీ, ఆ కోతకు గురైన వేతనాలను తర్వాత చెల్లిస్తామనీ అన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లు కూడా ఇదే రకమైన 50శాతం కోతకు గురవుతాయని అన్నారు.

ఎవరికైనా వేతనాల కోత ఇబ్బందికరమైనదే గాని, పదవీ విరమణ పొందిన వృద్ధుల పెన్షన్‌ విషయంలో, చనిపోయిన ప్రభుత్వోద్యోగుల సహచరులకు అందే పెన్షన్‌ విషయంలో కోత విధించడమనేది అమానవీయమైనది. వారు అరవైయేండ్లు దాటినవారు. తమ పనులు తాము చేసుకోలేని వారు. ఎవరి మీదనో ఆధారపడినవారు. చేతిలో డబ్బు లేకపోతే ఏ సహాయమూ పొందలేని వారు. వారికి అందే నాలుగు రాళ్లతోనే కష్టంగా బతుకునీడుస్తున్నవాళ్లు ఆ ఆదాయం సగానికి సగం తగ్గిపోతే వారి పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందో ఊహాతీతం. కాని ప్రభుత్వానికి అదేమీ పట్టలేదు. జాలి కలగలేదు. అంతకుముందు వారం రోజుల లాక్‌డౌన్‌కే జీతం పూర్తిగా చెల్లించాలని చెప్పేంత ఔదార్యం చూపినవారు, ఇప్పుడు మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించగానే వేతనాల కోత విధించడం, అందునా పెన్షన్ల కోత విధించడం విచిత్రం. ఆ మూడు వారాల లాక్‌డౌన్‌ మరో మూడు సార్లు పొడిగింపు జరిగి మొత్తంగా 68 రోజులు సాగింది. ఇన్ని రోజులూ వేతనాల కోత అమలయింది.

ఈ మధ్యలో మరికొన్ని పరిణామాలు కూడా జరిగాయి. తెలంగాణ రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగుల కేంద్ర సంఘం తరఫున అధ్యక్షులు వి రాజమల్లయ్య తెలంగాణ హైకోర్టులో జీవో 27ను సవాల్‌ చేస్తూ ఏప్రిల్‌ 14న ఒక వ్యాజ్యం దాఖలు చేశారు. మరి కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ సంఘం 1,56,097 మంది రిటైర్డ్‌ ఉద్యోగులకూ, 1,02,694 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ వ్యాజ్యంలో పొందుపరిచిన గణాంకాల ప్రకారం రిటైర్డ్‌ ఉద్యోగులలో 60 నుంచి 70ఏండ్ల వయసు గల వృద్ధులు 72,000 మంది, 71-80 వయసు గల వృద్దులు 59,000 మంది, 80 ఏండ్ల పైబడినవారు 25,097 మంది. ఇక పెన్షన్‌ తీసుకుంటున్న రిటైర్డ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులలో 60-70 వయసు వారు 69,000 మంది, 71-80 వయసు వారు 29,000మంది, 80 పైబడినవారు 4,694 మంది. ఇటువంటి వద్ధుల నోటి దగ్గరి ముద్దను లాగడానికి, వారి కడుపు మీద కొట్టడానికి ప్రయత్నించాలనే ఆలోచన ఎవరికి వచ్చినప్పటికీ అది మన మానవతకే మచ్చ.

ఈ జీవో 27 చట్టవ్యతిరేకమైనదని, నిరంకుశ మైనదని, వివక్షాపూరితమైనదని, అసమంజసమైనదని, అన్యాయమైనదని, రాజ్యాంగ వ్యతిరేకమైనదని, రాజ్యాంగ అధికరణాలు 14, 19, 21, 300-ఎ ల ఉల్లంఘన అని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైనదని, ది ఎపిడెమిక్‌ డిసీజెస్‌ ఆక్ట్‌ 1897కు, ది డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ ఆక్ట్‌ 2005కు, చివరికి సుప్రీం కోర్టు, స్వయంగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకమైనదని సుప్రసిద్ధ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు.

ఈ వ్యాజ్యం మీద విచారణ సాగుతుండగా కంటి తుడుపు చర్యగా పెన్షన్ల కోతను 50శాతం నుంచి 25శాతానికి తగ్గిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమస్యలో బాధితుల న్యాయబద్ధత, ప్రభుత్వపు అన్యాయం స్పష్టంగా కనబడుతున్నాయి గనుక హైకోర్టు దర్మాసనం కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయక తప్పలేదు. ”పెన్షనర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న వారిని మరిన్ని బాధలు పడేలా చేయలేం. సొంత బిడ్డలే కాదనుకుంటున్న నేటి రోజుల్లో పెన్షనర్లకు నిధులు సమకూరే మరో మార్గం లేదు. వారిని గాలికి వదిలేయలేం” అని వ్యాఖ్యానించి, ఆ జీవోను వెనక్కి తీసుకోవలసిందేనని, ప్రభుత్వ వైఖరిని 48గంటల్లో చెప్పాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

ఈ స్థితిలో ప్రభుత్వం భేషజాలకు పోకుండా వృద్ధులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని, వారికి పూర్తి పెన్షన్లు ఇవ్వడానికి తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ అలా ప్రభుత్వానికి మానవతా దృష్టి ఉంటుందని భ్రమపడేవారు అమాయకులని తెలంగాణ ప్రభుత్వం తేల్చివేసింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తులు అలా 48గంటల్లో వైఖరి చెప్పాలని ఆదేశించగా, నిజంగానే ప్రభుత్వం 48గంటలు కూడా ఆగకుండానే, మంగళవారం తెల్లవారక ముందే, ఆ రాత్రే హడావిడిగా తెలంగాణ ఆర్డినెన్స్‌ నెం. 2 ఆఫ్‌ 2020 పేరుతో ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది.
సాధారణంగా అత్యవసరమైన సందర్భాలలో, చట్టసభలో చట్టం చేయడానికి తగినంత సమయం లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేస్తారు. మామూలుగానే ఆర్డినెన్సు జారీ చేయడం అక్రమం. ఇక ఒక జీవో అమానవీయమైనదని లోకం కోడై కూస్తున్నప్పుడు, హైకోర్టు కూడా తప్పు పడుతున్నప్పుడు, బహుశా ఆ జీవోను హైకోర్టు కొట్టివేస్తుందేమోనని అనుమానాలు ఉన్నప్పుడు, ఆర్డినెన్సు తేవడమంటే అది కేవలం తమ అక్రమాన్ని స్థిరపరచుకునే సిగ్గుమాలిన, అనైతికమైన చర్య మాత్రమే. ”తెలంగాణ శాసనసభ సమావేశాలులేని సమయంలో, అత్యవసరమైన అసాధారణ పరిస్థితులలో” ఈ ఆర్డినెన్సు తేవలసి వస్తున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ”ఏ వ్యక్తికైనా, ఉద్యోగికైనా, పెన్షనర్‌ కైనా, ఏ సంస్థకైనా ప్రభుత్వం బాకీ పడిన, చెల్లించవలసిన ఎటువంటి చెల్లింపు అయినా, అది వేతనమైనా, పెన్షన్‌ అయినా, ప్రతిఫలం అయినా వాయిదా వేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది” అని ఈ ఆర్డినెన్సు ప్రకటించింది. జూన్‌ 16న వెలువడిన ఈ ఆర్డినెన్సు మూడు నెలల వెనుక నుంచి, మార్చి 24 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. అంతకుముందు ఉదాత్తమైన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు కూడా ఈ ఆర్డినెన్సు రాగానే, ”ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉంటే కొద్ది మంది ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది” అని వ్యాఖ్యానించింది.

నిస్సహాయ వృద్ధుల పొట్ట మీద కొట్టడానికి పాలకులు ఇన్ని అవినీతికర పిల్లిమొగ్గలు వేస్తారు. ”ప్రజా ప్రయోజనాలు” అనే మాయాజాలపు మాటతో (అంటే మనందరి ప్రయోజనాలు అన్నమాట) ఆ మూడు లక్షల మంది వృద్ధులు ఏమైపోయినా ఫరవాలేదు అని న్యాయస్థానాలు అంటాయి. మన పేరు మీద మన తల్లిదండ్రుల మీద సాగుతున్న ఈ దుర్మార్గ దాడి పట్ల మనం మౌన ప్రేక్షకులుగా ఉంటాం. ఇదీ బంగారు తెలంగాణ!!

– ఎన్‌. వేణుగోపాల్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates