ఆర్థిక సంక్షోభాన్ని పసిగట్టలేక..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మోడీ సర్కార్‌ మొదటి ఐదేండ్ల పాలనలో ఎంచుకున్న ఆర్థిక విధానాలు తప్పని తేలిపోయాయి. వీటి ఫలితమే పారిశ్రామిక ఉత్పత్తి, తయారీరంగంలో ఉత్పత్తి పడిపోవటం, ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతినటం. లాక్‌డౌన్‌కు ముందే ఇది ఏర్పడింది. దీనిని నుంచి బయటపడటానికి 2019 కేంద్ర బడ్జెట్‌ రూపంలో అవకాశమూ వచ్చింది. అటు తర్వాత ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీ రూపంలో మరో అవకాశమూ వచ్చింది. అయితే ఈ అవకాశాల్ని మోడీ సర్కార్‌ సద్వినియోగపర్చుకోలేదని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
– లాక్‌డౌన్‌కు ముందే దెబ్బతిన్న పారిశ్రామిక ఉత్పత్తి, తయారీరంగం
– పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి
– ఇదంతా… లాక్‌డౌన్‌, కరోనా ఖాతాలో వేసేవిధంగా మోడీ సర్కార్‌ గణాంకాలు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ అమలు, కరోనా కారణంగా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి, తయారీరంగం తీవ్రంగా దెబ్బతిన్నాయని చూపడానికి కేంద్రం రకరకాల వ్యూహాలు అమలుజేస్తున్నది. ఆ కోణంలో ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడేట్టు మోడీ సర్కార్‌ విడుదలచేసిన గణాంకాలున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌, కరోనా వ్యాప్తికి ముందే దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి, తయారీరంగం నేలచూపులు చూస్తున్నాయని, ఆర్థికమాంద్యం అప్పటికే బలపడిం దని నిపుణులు చెబుతున్నారు. మాంద్యం పరిస్థితుల్ని చక్కదిద్దలేక…ఆ నెపాన్ని లాక్‌డౌన్‌, కోవిడ్‌-19పై వేసేందుకు రంగం సిద్ధమైందని, ఇటీవల జాతీయ గణాంక కార్యాలయం విడుదలచేసిన గణాంకాలే దీనికి నిదర్శనమని వారు అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే ఏప్రిల్‌ 2020లో పారిశ్రామిక ఉత్పత్తి 50శాతం, తయారీరంగం 64శాతం పడిపోయిందని గణాంకాల్ని కేంద్రం(జాతీయ గణాంక కార్యాలయం) విడుదల చేసింది. మైనింగ్‌లో 27శాతం, విద్యుత్‌ ఉత్పత్తిరంగంలో 22శాతం తగ్గుదల ఉందని తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో దేశమంతటా కఠినమైన లాక్‌డౌన్‌ అమలైంది. పరిశ్రమలు, తయారీరంగం పూర్తిగా మూతపడ్డాయి. అంటే…ముందు ముందు పై అంశాల్లో గణాంకాలు మరింత దిగజారటం ఖాయం. ఈ ఫలితాలకు కారణం లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి… అని చెప్పడానికి ప్రజల్ని మానసికంగా తయారు చేయాలన్నదే జాతీయ గణాంకాల ఉద్దేశమని నిపుణులు విశ్లేషించారు.

లెక్క ఎలా తేలుతుంది?
ఏప్రిల్‌తో మొదలై మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాది మార్చి 31రోజుల్లో లాక్‌డౌన్‌ 7రోజులు అమలైంది. ఈనేపథ్యంలో దేశంలో పారిశ్రామిక, తయారీరంగాల్లో ఉత్పత్తి వాస్తవ లెక్కలు తెలియాలంటే 2020 మార్చి నెలను తొలగించి, దీని వెనుకున్న 11నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే ఏప్రిల్‌ 2019- ఫిబ్రవరి 2020 మధ్యకాలం అన్నమాట! ఈ 11నెలల కాలాన్ని లెక్కలోకి తీసుకొని గణాంకాల్ని పరిశీలిస్తే, క్రితం ఏడాదితో పోల్చుకుంటే పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి కేవలం 0.9శాతం, తయారీరంగంలో వృద్ధి 0.7శాతం నమోదయ్యాయి. అంటే దేశంలో ఆర్థిక మాంద్యం లాక్‌డౌన్‌కు ముందే తీవ్రరూపం దాల్చిం దని అర్థమవుతున్నది. ప్రజల కొనుగోలు శక్తి దారు ణంగా పడిపోయింది. ఈసమస్యను పరిష్కరించడా నికి 2019 ఫిబ్రవరిలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ ద్వారా మోడీసర్కార్‌కు మంచి అవకాశం లభించింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారు.

రెండో అవకాశమూ చేజారింది!
ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్‌…ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చాయి. దీనిని నుంచి బయటపడా లంటే ఆర్థిక ఉద్దీపన చర్యలొక్కటే మార్గం. ఉద్దీపన ప్యాకేజీ రూపంలో లభించిన అవకాశాన్ని కూడా మోడీ సర్కార్‌ సద్వినియోగం చేసుకోలేకపోయిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ…ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలకు మోడీ సర్కార్‌ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి చాలా తేడా ఉంది. వివిధ రంగాల్లో పనిచేసేవారి వేతనాల్లో కోతలు పడకుండా ఆయా దేశాలు జాగ్రత్తపడ్డాయి. తద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ దెబ్బతినకుండా చూసుకున్నాయి. కానీ ఇండియాలో కార్పొరేట్‌ వర్గాలకు, ప్రయివేటు యాజమాన్యాలకు లబ్దిచేకూర్చే విధంగా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు.

ఉపాధి…సంగతి మరిచారు
ఆహార ద్రవ్యోల్బణం పెరగటం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీఏ ఓటమికి, మోడీ సర్కార్‌ ఏర్పడటానికి దారితీశాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాక ఆహార ద్రవ్వోల్బణం క్రమంగా పెరుగుతున్నది, మరోవైపు కోట్లాది మంది ఉపాధి సైతం దెబ్బతింటున్నది. అందువల్లే ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నదని నిపుణులు భావిస్తున్నారు. నిత్యావసర ధరలు స్థిరంగా ఉన్నా, ఉపాధి లేకపోతే మార్కెట్‌లో కొనుగోళ్లు ఉండవన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఉల్లిగడ్డ ధరలు తగ్గినా, వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడటం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates