కరోనా మరణ మృదంగం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దేశంలో ఒక్క రోజే 396 మంది మృతి
దేశంలో దాదాపు 11 వేల కేసులు నమోదు
రోజువారీ కేసుల్లో ఒకేసారి వెయ్యి పెరుగుదల!
లక్ష దాటిన మహారాష్ట్ర కేసులు.. మంత్రికి పాజిటివ్‌
దేశంలో మొత్తం కేసులు 3,04,019

న్యూఢిల్లీ, చెన్నై: దేశంలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 396 మంది మృతి చెందారు. అంతకుముందు రోజుతో పోలిస్తే 39 మంది, బుధవారం లెక్కల ప్రకారం చూస్తే 117 మంది ఎక్కువగా చనిపోయారు. దీనికితగ్గట్లే రోజువారీ కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 10,956 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గురువారం ప్రకటించిన కేసులకు ఇది 960 అధికం కావడం గమనార్హం. వరుసగా వారంపాటు 9 వేలపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 11 వేలకు సమీపించాయి. మరోవైపు కోలుకున్నవారి శాతం 49.47కు చేరింది. కాగా, శుక్రవారం రాత్రికి అందిన సమాచారం ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,04,019 అయింది.

సదుపాయాలు మెరుగుపర్చండి: కేంద్రం
కరోనా కేంద్రాలను గుర్తించి ప్రత్యేక దృష్టిసారించాలని, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శుక్రవారం కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కట్టడి, టెస్టింగ్‌- ట్రేసింగ్‌, మౌలిక వైద్య సదుపాయాలు, ప్రజా భాగస్వామ్యంపై సూచనలు చేశారు. కాగా, గుంపులుగా తిరగడం వంటి అనవసర కార్యకలాపాల నివారణే రాత్రి కర్ఫ్యూ ఉద్దేశమని.. అందుకే 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జన సంచారం నిషేధమని కేంద్రం ప్రకటించింది.

ఢిల్లీలో తొలిసారిగా 2 వేల పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి సూచనలు చేసేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడులో కరోనా కేసులు 40వేలు దాటాయి. శుక్రవారం 1,982 కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది మృతి చెందారు. కేసుల పెరుగుదలతో కేరళలోని ప్రఖ్యాత గురువాయూర్‌ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. కర్ణాటకలో 271 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పోలీసులు, వైద్య సిబ్బందికి వైరస్‌ ప్రబలుతోంది.

ఆగ్రాలో కోలుకున్న 97ఏళ్ల వృద్ధుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కరోనా నుంచి 97 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నారు. ఏప్రిల్‌ 29న ఆస్పత్రిలో చేరిన అతడు 40 రోజుల పాటు పోరాడారు. దేశంలో కరోనా సోకి కోలుకున్న పెద్ద వయసువారిలో ఈయన ఒకరు.

ఉర్దూ కవి ఆనంద్‌మోహన్‌ కన్నుమూత
ప్రముఖ ఉర్దూ కవి ఆనంద్‌మోహన్‌ జుస్తి గుల్జార్‌ దెహ్లెవి (94) శుక్రవారం ఢిల్లీలో మృతిచెందారు. ఈ నెల 1న కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆయన కోలుకుని ఇంటికి వెళ్లారు. వృద్ధ్యాపంలో వైరస్‌ సోకడంతో బలహీనమయ్యారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సమరయోధుడైన ఆనంద్‌ మోహన్‌ ‘ఇంక్విలాబ్‌’ కవితలతో ప్రాచుర్యం పొందారు. ఉర్దూ సైన్స్‌ మేగజీన్‌ ‘సైన్స్‌ కి దునియా’కు ఎడిటర్‌గా పనిచేశారు.

టీటీడీలో తొలి కరోనా కేసు
టీటీడీలో తొలి కరోనా కేసు నమోదైంది. శానిటేషన్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉంటూ తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో వైద్యపరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి రెండురోజుల తర్వాతే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.

మహారాష్ట్రలో లక్ష దాటింది
మహారాష్ట్రలో కేసులు లక్షను తాకాయి. విస్తీర్ణంలో రెండో అతి పెద్దదైన కెనడా, వైరస్‌ జన్మస్థానం చైనా సహా ప్రపంచంలోని 10 దేశాల కంటే మహారాష్ట్రలో బాధితులు ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్రంలో కొత్తగా 3,493 మంది వైరస్‌ బారినపడ్డారు. రాష్ట్రంలో 12 రోజులుగా 2 వేలపైగా కేసులు నమోదవుతుండగా, మృతుల సంఖ్య వందకు తగ్గడం లేదు 2,500 మందిపైగా పోలీసులకు వైరస్‌ సోకగా.. వీరిలో ముంబై వారే 2 వేల మంది ఉన్నారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావి లో 2 వేల కేసులు రికార్డయ్యాయి. తాజాగా మరో మంత్రికి కరో నా నిర్ధారణ అయింది. ఆయన కార్యదర్శులు, డ్రైవర్‌, వంట మనిషి సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

 

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates