ఉద్యోగాలు కోల్పోవడమే అత్యంత తీవ్ర సమస్య

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వ్యక్తులపై తక్షణ ప్రభావం
నగదు బదిలీలు చేపట్టాలి : ఐఎస్‌ఎల్‌ఈ

న్యూఢిల్లీ : మహమ్మారి కోవిడ్‌-19 కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోవడమే అత్యంత తీవ్రమైన సమస్య అని ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌ (ఐఎస్‌ఎల్‌ఈ) సర్వే తెలిపింది. ఇది వ్యక్తులపై తక్షణ ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వృద్ధి, ఆదాయ అసమానతలు సమాజంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఈ మేరకు గతనెలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే నివేదికను ఇటీవలే వెలువరించింది. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం… కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని కోట్లాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. పలు సర్వేలు నివేదిస్తున్నట్టు.. పట్టణ ప్రాంతాల్లో 80 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం మంది ఉద్యోగాలు పోయాయని తెలుస్తున్నది. ఉద్యోగాలు కోల్పోవడమనేది అత్యంత తీవ్రమైన సమస్య. ఇది వ్యక్తులు, వారి కుటుంబాలపై తక్షణమే ప్రభావం చూపుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వీరిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్యోగులు, కార్మికులకు నగదు బదిలీల ద్వారా డబ్బులు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ‘ఉపాధి హామీ’ని విస్తరించి అందరికీ పని కల్పించాలి. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు తక్కువ వ్యవధి రుణాలు అందజేయాలి. ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ.. ఒక పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు వలస కూలీలకు సంక్షేమ పథకాలు కల్పిస్తూ, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని.. నివేదికపై ఈనెల 8,9 న జరిగిన ఒక సదస్సులో నిపుణులు సూచించారు.

ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌వో), ఐఎస్‌ఎల్‌ఈకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎల్‌వో డీసెంట్‌ వర్క్‌ టీం ఫర్‌ సౌత్‌ ఏషియా డైరెక్టర్‌ డగ్మర్‌ వాల్టర్‌ స్పందిస్తూ.. ప్రజలందరికీ పని కల్పిస్తూ, వారి ఆదాయాలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates