అసమ సమాజంలో ఆన్‌లైన్‌ విద్య

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇవ్వాళ భారతదేశంలోని అన్ని అసమానతలతో బాటు డిజిటల్‌ డివైడ్‌, అంటే సాంకేతిక జ్ఞాన అంతరాలు కొట్టవచ్చినట్లుగా ఉన్నవి. దేశంలో ఒక సర్వే ప్రకారం ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉన్న వారి సంఖ్య 8% కంటే ఎక్కువ లేదు. మరి ఇంత హడావుడిగా ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశపెట్టడంలో అర్థమేముంది? మనది రెండు ప్రపంచాలున్న దేశం. ఒక ప్రపంచమే ఇవ్వాళ పాలకుల దృష్టిలో ఉంది. రెండవ ప్రపంచం వాళ్ళ స్పృహ నుండి, చైతన్యం నుండి జారిపోయింది.

కరోనా విపత్తును అవకాశంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంటు ఇతర సంస్థల ప్రమేయం లేకుండా, ఆర్డినెన్స్‌ మార్గం ద్వారా పాస్‌ చేసేస్తున్నది. ప్రజలంతా గృహనిర్బంధంలో ఉండడంతో కనీస ప్రతిఘటనకు కూడా అవకాశం లేకుండాపోయింది. సాధారణ పరిస్థితుల్లో ఇన్ని విధానపర నిర్ణయాలు ఇంత సులభంగా, ఇంత సునాయాసంగా పాస్‌ అయ్యేవి కావు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్‌ పేరిట ప్రైవేటీకరణని కార్పోరేటీకరణని అలాగే విదేశీ పెట్టుబడిని ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నది. ఈ నేపథ్యంలోనే విద్యారంగంలో ఊహించని మార్పులను ప్రవేశపెడుతున్నది. ప్రధానమంత్రి ఈ మొత్తం వ్యూహానికి తన పూర్తి మద్దతు ఇవ్వడమే కాక ఈ మార్పులకు నాయకత్వం వహిస్తున్నాడు.

విద్యారంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ -3 పేర ‘ఈ-విద్య’ను తక్షణమే ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఈ-విద్య అంటే డిజిటల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌గా నిర్వచించారు. పాఠశాల విద్యలో మొదటి తరగతి నుండి పన్నెండవ తరగతి దాకా టెక్ట్స్‌బుక్స్‌ (Energised School Text Books)తో బాటు ఒకే దేశం ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫాంను నెలకొల్పుతూ, ప్రతి తరగతికి ఒక టివి ఛానల్‌ ద్వారా బోధన జరుపుతారట. వీటితో బాటు రేడియో, కమ్యూనిటీ రేడియోను కూడా ఉపయోగిస్తారు. ఉన్నతవిద్యకు దేశంలోని ప్రతిష్ఠ గల వంద విశ్వవిద్యాలయాల ద్వారా 30వ మే నాడు ఆన్‌లైన్‌ బోధనను ప్రవేశపెట్టారు. మనో దర్పణ్‌ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాగే పిల్లల తల్లిదండ్రులకు మానసిక శారీరక ఆరోగ్యం గురించి కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. పాఠశాల పిల్లలకు పాఠ్యాంశాలు, అలాగే బోధనా నియమావళిలో ప్రపంచీకరణకు అలాగే 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను పాఠ్యాంశాలలో చేరుస్తారు. ఇందులో సామాజిక న్యాయం, మార్పులాంటి అంశాల ప్రసక్తి కూడా లేదు. వీటితో బాటు గణితంలో, అక్షరాభ్యాసంలో (Literacy and Numeracy) ఐదవ తరగతి చేరే వరకు ప్రావీణ్యం సాధించేందుకు నేషనల్‌ మిషన్‌ను 2020, డిసెంబర్‌ వరకు ప్రవేశపెడతారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఈ కొత్త కార్యక్రమాలన్నింటిని అవగాహన చేసుకోవడానికే చాలా ప్రయాస పడవలసి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ చర్యలన్నీ ఇంత ఆదరాబాదరాగా ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేది కాదు. ఆశ్చర్యంగా కొన్ని చర్యలను మే నెలలోనూ మరికొన్నింటిని ఈ సంవత్సరాంతంలోనూ అమలు చేస్తామని ప్రకటించారు. కరోనా ఇంకా ఎంత కాలముంటుందో తెలియదు. ఇది ఎంతకాలముంటే అంత కాలం ఎలాంటి విస్తృతమైన చర్చ సాధ్యం కాదు. ప్రతిఘటన అసలు వీలుపడదు. ఇప్పుడే కాదు, ఇక రాబోయే కాలంలో ఏ సదస్సు జరపాలన్నా కరోనా పేర ఏ అనుమతులూ లభించకపోవచ్చు. ఈ ప్రకటించిన విద్యావిధానంలో ప్రధానంగా విద్యను ఈ-లెర్నింగ్‌ ద్వారా అంటే సాంకేతిక సాధనాల ద్వారా జరపాలనేది ప్రధాన ఉద్దేశం. ఇది మన దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందా, ఆచరణ యోగ్యమా అనే అంశం మీద ప్రభుత్వం అసలు ఆలోచించినట్లు కనిపించదు.

డిజిటల్‌ విద్య ప్రవేశపెడితే అది ఎక్కువకు ఎక్కువ పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత కుల, ఉన్నత ఆదాయ శ్రేణులకు కొంతవరకు అందుబాటులోకి రావచ్చు. అంటే దేశంలోని 80% పేద వర్గాలకు దీని ప్రయోజనం ఏమీ ఉండదు. మన సాంకేతిక సామర్థ్యం, మన కంప్యూటర్లు పని చేసే పద్ధతి, ఇంటర్‌నెట్‌ సౌకర్యం, ఎలక్ట్రిసిటీ సప్లయి… ఒకటి కాదు వంద సమస్యలున్నాయి. మా ఇంట్లోనే గత రెండు వారాలుగా ఇంటర్నెట్‌తో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇక గ్రామాల్లో ఉండే వలస కూలీల పిల్లలకు ఏ డిజిటల్‌ మాధ్యమం ద్వారా, ఏ టీవీ ఛానెల్‌ ద్వారా బోధిస్తారో అర్థం కాదు. ప్రాథమిక విద్య అభ్యసించే గ్రామీణ లేదా ఆదివాసీ ప్రాంతాల పిల్లలు టీవీ చూసి విద్య అభ్యసించడం సాధ్యమా? మన విధాన నిర్ణేతలు ఈ దేశంలోని 20% మధ్యతరగతి పట్ల తప్ప- విశాల జీవరాసులు, దళిత బహుజనుల పట్ల ఏ మాత్రం స్పృహలో లేరన్నది ఈ విధాన ప్రకటనలో స్పష్టంగా చూడవచ్చు.

నూతనంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్జనకు ఉపయోగించాలి అనే అతి ఉత్సాహం వేరు, సామాజిక వాస్తవికతలు వేరు. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఎప్పుడూ సంపన్న వర్గాల అవసరాలకు స్పందిస్తూ వికాసమవుతుందని జె.డి. బర్నాల్‌ (JD Barnal) తన ‘భౌతిక శాస్త్రము: మానవ విస్తరణ’ (Physics: The Expansion of Man) పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఏ ఆవిష్కరణనైనా ముందు ఉన్నత వర్గాల అవసరాలు తీరుస్తున్న క్రమంలో క్రమక్రమంగా అది కింది వర్గాల దాకా చేరుకుంటుంది. ఇవ్వాళ భారతదేశంలోని అన్ని అసమానతలతో బాటు డిజిటల్‌ డివైడ్‌, అంటే సాంకేతిక జ్ఞాన అంతరాలు కొట్టవచ్చినట్లుగా ఉన్నవి. దేశంలో ఒక సర్వే ప్రకారం ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉన్న వారి సంఖ్య 8% కంటే ఎక్కువ లేదు. తెలంగాణలో ఒక అనధికార సర్వే ప్రకారం ఉన్నత విద్యలో ఉండే విద్యార్థులకు ఇంటర్‌నెట్‌ ఎక్కువకు ఎక్కువ 20% శాతంకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇవి వాస్తవాలైతే ఇంతా హడావుడిగా ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశపెట్టడంలో అర్థమేముంది?

ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యాపర చర్యల అనుభవం దూరవిద్యలో అపారంగా ఉంది. ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాలయం, అలాగే దేశంలోని ఇతర ఓపెన్‌ యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్ళను కనీసం అధ్యయనమైనా చేయవలసింది. ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం చేపడతామన్న ఇంటర్‌నెట్‌, టి.వి. చానెల్‌, రేడియో – అన్నీ దూరవిద్యలో ఉపయోగిస్తున్నారు. వీటితో బాటు అన్ని కోర్సులలో ప్రింటెడ్‌ మెటీరియల్‌ ఇంటికి పోస్టు ద్వారా పంపిస్తారు. దీనితో బాటు స్టడీ సెంటర్లలో అధ్యాపకుల చేత బోధన ఉంటుంది. ఇన్ని వసతులున్నా దూరవిద్యా విద్యార్థులు రెగ్యులర్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులతో పోటీలో నిలవడం చాలా కష్టం. దూరవిద్యలో అపార అనుభవమున్న ప్రొ.వి.ఎస్‌.ప్రసాద్‌ మొత్తం విద్యా రంగాన్ని ఈ-లెర్నింగ్‌ పరిధిలోని తేవడం ఆచరణ సాధ్యం కాదని భావిస్తున్నారు. ఇది దూర విద్య ప్రయోగ అనుభవం.

ప్రాథమిక విద్యను కూడా ఈ-లెర్నింగ్‌ పరిధిలోకి ఎలా తెస్తారో ఊహించడం కూడా కష్టం. కేరళలో మొన్నే ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదని పదవ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ విధాన ప్రకటన చేసిన సందర్భాన్ని గమనిస్తే, లక్షల మంది వలస కూలీల దయనీయమైన పరిస్థితినైనా గమనించలేదు. పట్టణాలలో ఉండడానికి సరియైన వసతి లేక ఉద్యోగ భద్రత లేక, గౌరవప్రదమైన పనిలేక తమ పని నుండి, పట్టణం నుండి తాము పనిచేసే పరిశ్రమ నుండి పరాయికరణ చెందిన మనుషులు వీరు. ఈ-లెర్నింగ్‌ గురించి మాట్లాడే ముందు ఈ కుటుంబాల పిల్లలు ఎక్కడున్నారు? ఈ పిల్లల తల్లిదండ్రులు చదువుకున్న వారు కారు. ఇంట్లో రేడియో, టీవీ ఉందనే అనుకుందాం. పసిపిల్లలు ఆ టీవీ ముందు కూచుని అధ్యయనం చేయడం సాధ్యమా – ఒకటవ తరగతి నుండి 12 వరకు 12 ఛానెల్స్‌ పెడితే వాటి ద్వారా ఉపాధ్యాయులు లేకుండా, చదువుకున్న తల్లిదండ్రులు లేకుండా విద్యార్జన ఎలా సాధ్యమౌతుంది?

ఈ-లెర్నింగ్‌ను ఇంటర్నెట్‌ ద్వారా 30వ మే నాడు వంద విశ్వవిద్యాలయాలలో పెట్టే ప్రకటన చేసారు. ప్రభుత్వాల ఆలోచనలోనే అందరి గురించి ఆలోచించడమన్న ప్రజాస్వామ్య సంస్కృతే కరువైంది. వంద విశ్వవిద్యాలయాలు అని అంటే మరి మిగతా ఆరు, ఏడు వందల విశ్వవిద్యాలయాల సంగతేమిటి? మరి ఆ విద్యార్థులకు విద్య అవసరం లేదా? ఈ వంద ప్రతిష్ఠ గల విశ్వవిద్యాలయాలలో హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఒకటి అని అనుకుంటే, ఆ విశ్వవిద్యాలయ అధ్యాపకులు చేసిన సర్వేలో ఆన్‌లైన్‌ సౌకర్యం చాలా మంది విద్యార్థులకు అందుబాటులో లేదని తేలింది.

నాకు తెలిసి ఆన్‌లైన్‌ ద్వారా నేను ప్రస్తుతం పని చేస్తున్న బెంగలూర్‌ నేషనల్‌ లా స్కూల్లో పబ్లిక్‌ పాలసీ విద్యార్థులకు బోధన జరుగుతున్నది. ఈ విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, సి.ఎ. గ్రాడ్యుయేషన్‌, జర్నలిజం పూర్తి చేసిన విద్యార్థులు. వీళ్ళ సామాజిక నేపథ్యమే వేరు. గత ఆరు సంవత్సరాలలో ఈ కోర్సులో గ్రామీణ ప్రాంతం నుండి ఒక్క విద్యార్థి కూడా సెలెక్ట్‌ కాలేదు. మనది రెండు ప్రపంచాలున్న దేశం. ఒక ప్రపంచమే ఇవ్వాళ పాలకుల దృష్టిలో ఉంది. రెండవ ప్రపంచం వాళ్ళ స్పృహ నుండి, చైతన్యం నుండి జారిపోయింది.

ఉపాధ్యాయుడిని, తరగతి గదిని మానవ సమాజం ఏ ప్రత్యామ్నాయం ద్వారా కూడా పూరించలేదు. ఉపాధ్యాయుడు అనే చిహ్నం ఒక సజీవ, సృజనాత్మక మానవ సంబంధం. ఆయన స్థానంలో ఒక రేడియోనో ఒక టీవీనో ఒక కంప్యూటర్‌నో ఊహించమంటే దూరదృష్టి లేకపోవడం. నిజమే కరోనా ఒక కొత్త పరిస్థితిని సృష్టించింది. ఈ విపత్తును అధిగమించడమెలా అనేది సవాలే. దీనికి జవాబు ఈ-లెర్నింగ్‌ ఎంత మాత్రం కాదు. ఇవ్వాళ మనం ఆలోచించవలసింది క్లాసు గదిని పునర్‌నిర్మించడం ఎలా? విద్యా సంస్థలలో భౌతిక వసతులను రూపకల్పన చేయడం ఎలా? హాస్టల్‌ వసతులను పెంచడం ఎలా?

స్కూలు విద్య వరకు కామన్‌ స్కూల్‌ విధానం తప్ప వేరే మార్గం లేదు. ఇంటి దగ్గరే స్కూల్‌ ఉంటే కరోనా లాంటి జబ్బుకు పిల్లలు ఎక్స్‌పోజ్‌ కారు. ఎక్కువ ప్రయాణం చేయవలసిన అవసరం ఉండదు. ప్రతి విపత్తులో కొత్త అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. విద్యను సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధిపత్యం కలిగి, ఏ మార్గం ద్వారానైనా సరే లాభాలు చేసుకుందాం అనే కార్పోరేటు చేతిలో పెట్టకూడదు. ఆత్మ నిర్భర్ భారత్‌కు పేద పిల్లలు, గ్రామీణ ప్రాంతాలు ప్రమాణమే కాక అందరికి సమాన అవకాశాలు అనే గీటురాయి లేకపోతే మానవీయ భారత్‌ చాలా దూరంలో ఉన్నట్లే.

ప్రొ. జి. హరగోపాల్‌

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates