నేను ఊపిరి పీల్చుకుంటా..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘నేను ఊపిరి తీసుకోలేకపోతున్నా’ (ఐ కాంట్‌ బ్రీత్‌) అని ప్రాధేయపడుతూ పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు వదిలాడు. ఫ్లాయిడ్ ఆర్తనాదాలు ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపాయి. ప్రపంచాన్ని గడగడ లాడించే అమెరికా అధ్యక్షుడు బంకర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. పోలీసు వ్యవస్థను రద్దు చేయాలనే నిర్ణయానికి కారణమైనాయి. ఇలాంటి వివక్షలు ప్రపంచ వ్యాపితంగా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వర్గాలకు, జాతులకు ఊపిరాడకుండా చేస్తూనే ఉన్నారు. రోహిత్ వేములకు, ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేశ్‌కు ఊపిరాడకుండా చేసారు. జెఎన్‌యూ కన్నయ్య కుమార్‌కి ఊపిరాడని స్థితి కల్పించారు. నన్ను స్వేచ్ఛగా ఉపిరిపీల్చుకోనివ్వండి అని ఎవరైనా అంటే వారు ప్రాణాలు కోల్పోవడమో, జైలుకు వెళ్లడమో జరుగుతుంది.

అంగవైకల్యం ఉన్న జి.ఎన్‌. సాయిబాబా అయినా, వృద్ధాప్యం మీద పడ్డ వరవరావు అయినా ‘మాకు ఊపిరాడనివ్వండి’ అని అనడానికి వీలులేదు. అలా అంటున్నారంటే వాళ్లు దేశద్రోహులై ఉంటారు. ఎదుటి వారికి ఊపిరాడకుండా చేసినవారిని కదా శిక్షించాల్సింది? అది కదా నేరం. ఏదేశ చట్టాలైనా చెప్పేది ఇదే కదా! దానికి భిన్నంగా ఎందుకు జరుగుతుంది? ఫ్లాయిడ్ మరణం జాతి వివక్షత పై ప్రపంచ వ్యాపితంగా చర్చకు తెరలేపింది.

మన దేశంలో జాతి వివక్షకు బదులు కుల, మత వివక్షలు ఉన్నాయి. ఈ వివక్షను సిద్ధాంతీకరించే ప్రయత్నం జరుగుతున్నది. అందుకు మెజార్టీ ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగానే మూక దాడులు చేస్తూ సోషల్ మీడియాలో వాటిని సమర్థించుకుంటూ పోస్టులు చేస్తున్నారు. ఇది దుర్మార్గం అన్యాయం అని ఎవరైనా అంటే వారు దేశ ద్రోహులు అవుతారు, జైలుకు వెళతారు. ఈ వివక్షతలకు వ్యతిరేకంగా ఊపిరిపీల్చుకోవడం కోసం ఉద్యమించాలి. వివక్షతకు గురయ్యేవారందరు ఊపిరిపీల్చుకోవడానికి ఉద్యమించాలి. ఇకపై ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ నినాదం కాదు, ఐ వాంట్‌ టు బ్రీత్‌, ఐ వాంట్‌ ఫ్రీడమ్‌ నినాదం ఇవ్వాలి. నేను స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటా అని నినదించాలి.

పి. వి. శ్రీనివాస రావు (జర్నలిస్టు)

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates