వడ్డెర కుటుంబాల గ్రామ బహిష్కరణ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిజామాబాద్‌ జిల్లాలోని మగ్గిడి గ్రామాభివృద్ధి కమిటీ హుకుం
కరోనా సమయంలో ఉపాధి లేకుండా కుట్ర
ఫిర్యాదు చేస్తే.. మాట్లాడి పంపిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ గ్రామాభివృద్ధి (వీడీసీ) కమిటీ ఆగడాలు శృతిమించుతున్నాయి. రాళ్లు కొట్టుకున్నందుకు డబ్బులు చెల్లించనందున.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామపంచాయతీకి చెందిన 100 వడ్డెర కుటుంబాలను మగ్గిడి గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రాజీ పేరుతో మాట్లాడి పంపుతున్నారు. అయితే, పోలీసులు చెప్పినా వీడీసీ లెక్కచేయడం లేదు. అసలే, కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వడ్డెరులపై.. వీడీసీ నిర్ణయంతో వాళ్ల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి.

గ్రామంలో వ్యవసాయ, ఇతర పనులకు పిలవొద్దని కమిటీ సభ్యులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సారెస్పీ ముంపు భూముల్లో రాళ్లను కొట్టి, అమ్ముకుంటున్నందున డబ్బులు చెల్లించాలంటూ మగ్గిడి గ్రామాభివృద్ధి కమిటీ ఏడాది కాలంగా వడ్డెరులను వేధిస్తోంది. లేకపోతే బహిష్కరణ చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. ఈ విషయమై గత యేడాది పోలీసులకు ఫిర్యాదులు చేయగా.. ఇరు పక్షాలను కూర్చోబెట్టి సర్దిచెప్పారు. అయినా, వీడీసీ బుద్ధిమారలేదు. ఇటీవల వడ్డెరులు తమ ఇండ్ల అవసరాల కోసం నల్లమట్టిని తెచ్చుకోగా, డబ్బులు కట్టాలంటూ వీడీసీ హుకుం జారీ చేసింది. ఇతరులు ఎవరూ ఇవ్వకుండా తామొక్కరమే ఎందుకు డబ్బులు ఇవ్వాలని వడ్డెరులు ప్రశ్నించారు. దాంతోపాటు, ముంపు భూముల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకకు సంబంధించి వసూలు చేస్తున్న డబ్బులను ఏం చేస్తున్నారని నిలదీశారు. దీన్ని సహించని గ్రామాభివృద్ధి కమిటీ.. వంద వడ్డెర కుటుంబాలను ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి గ్రామ బహిష్కరణ చేసింది. వారితో ఎవరూ మాట్లాడొద్దని, పనికి పిలవొద్దని ఆదేశించింది.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా..
మగ్గిడి వీడీసీపై చర్యలు తీసుకోవాలం టూ ఎంబీసీ రాష్ట్ర నాయకులు దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కమిటీలోని పెత్తందార్లపై చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌ డివిజన్‌లో అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. ఈ గ్రామాభివృద్ధి కమిటీలకు అధికార పార్టీ నుంచి ప్రోద్బలం లభిస్తోందని విమర్శించారు. ధర్నాలో బాధితులు బాలయ్య, మోహన్‌, నర్సయ్య, అంజయ్య, నాగమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates