ప్రయివేట్ పొమ్మంది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రభుత్వం తెలియదంటోంది..
డిమాండ్‌ ఉన్న కాలంలో వారితో అవసరానికి మించి పని తీసుకున్నారు. వారందించిన సేవలతో తమ ఆస్పత్రుల సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారికిచ్చిన జీతాలతో పోలిస్తే వారందించిన సేవలు చాలా ఎక్కువ. ఏనాడు పని గంటలు కచ్చితంగా అమలైన పాపాన పోలేదు. కార్మిక చట్టాలకు దిక్కే లేదు. వెట్టిని తలపించేలా పని తీసుకున్నా కుక్కిన పేను మాదిరిగా పని చేసే ఆ బడుగులపై కరోనా సాకుతో కార్పోరేటు కాటేసింది. ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. ఏమి తెలియనట్టు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది.

– రోడ్డునపడ్డ యుద్ధవీరుల కుటుంబాలు
– తీవ్ర ఇబ్బందుల్లో వైద్య, నర్సింగ్‌ సిబ్బంది
– కరోనా కన్నా ప్రమాదకరంగా మారిన బడా దవాఖానాలు

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్‌ డౌన్‌ సందర్భంగా ప్రయివేటు రంగంలో అందరికి పూర్తి జీతం ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దాని అమలు పర్యవేక్షణను మరిచింది. కార్పొరేటు ఆస్పత్రులు యధేచ్ఛగా ఉద్యోగులను తొలగించాయి. ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతూ వేతనాలు చెల్లించేందుకు కాలయాపన చేస్తుండడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మెడికల్‌ హబ్‌గా పేరుగాంచిన రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా ముందుకాలంలో యథేచ్ఛగా దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. ఏనాడు ప్రపంచ ఆరోగ్యసంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సరిపడినంత మంది సిబ్బంది నియమించుకున్న దాఖలాలు గానీ, కనీసవేతనాలు గాని చెల్లించలేదు.

రాష్ట్రంలో దాదాపు వంద వరకు కార్పొరేట్‌ ఆస్పత్రులు శాఖోపశాఖలుగా విస్తరించాయి. దాదాపు20 వేల మంది వరకు సిబ్బంది ఉండగా, వీరిలో 50 శాతం మంది నర్సులుండగా, రెండు వేల మంది డాక్టర్లు, ఐదు వేలకు పైగా హాస్‌ కీపింగ్‌, నాల్గవ తరగతి ఉద్యోగులున్నారు. ప్రయివేటు, కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో కనీసవేతనాలు, ఇతర సౌకర్యాల కోసం వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందితో పాటు నాలుగో తరగతి సిబ్బంది, హౌస్‌ కీపింగ్‌ వరకు ఆయా రూపాల్లో ప్రజా, న్యాయపోరాటాలు చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల పుణ్యమానీ కొన్ని ఆస్పత్రుల్లో కొంత మేరకు డిమాండ్లు పరిష్కారం అవుతున్నా…..

పూర్తి స్థాయిలో వారి కోర్కెలు నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో దూసుకొచ్చిన కరోనా కార్పొరేట్‌ రంగానికి సాకుగా మారింది. ఈ భయంతో అత్యవసరం కాని శస్త్రచికిత్సలతో పాటు ఇతర సాధారణ జబ్బులున్న వారు కూడా ఆస్పత్రులకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో గత రెండు నెలలుగా కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రులకు సాధారణ రోజుల్లో వచ్చే రాబడి కంటే తగ్గింది.

అయితే అంతకు ముందు కాలంలో ఇబ్బడి ముబ్బడిగా దండుకున్న సమయంలో అధిక పని చేసిన ఉద్యోగులకు అదనంగా ఇచ్చింది కూడా ఏమి లేదు. ఆదాయం తగ్గేసరికి కార్మిక చట్టాలను పక్కన పెట్టి, ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా ఉద్యోగులను రోడ్డు మీదకు నెట్టేశారు. పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇప్పటికే పది శాతం సిబ్బందిని తొలగించాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఇది 25 శాతం ఉన్నట్టు వినికిడి.

వీరిలో నర్సింగ్‌, పారామెడికల్‌ విభాగాలకు చెందిన వారే అధికం. ఎల్బీనగర్‌, కూకట్‌ పల్లి, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో విస్తరించిన కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువగా ఉద్యోగులపై వేటు పడింది. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో సర్కారు దవాఖానాలకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుండడం తో వారికి సేవలందించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒకవైపు పరిమిత కాలవ్యవధి కోసమే పోస్టులను ప్రకటించినప్పటికీ అప్పటికే ఉన్న నిరుద్యోగులతో పాటు కార్పొరేట్‌ తయారు చేసిన తాత్కాలిక నిరుద్యోగులు కలిసి దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వెంటనే పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండ డంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోస్టుల సంఖ్యను పెంచాలనీ, వెంటనే భర్తీ ప్రక్రియ ను చేపట్టాలనీ, మరికొంత మందిని తొలగించకుండా కార్పొరేట్‌ రంగాన్ని కట్టడి చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగుల ఇబ్బందులు చెప్పుకునేందుకు హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates