మాస్క్ లేకున్నా సీటు.. శానిటైజ్ చేయకున్నా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్టీసీలో ‘కరోనా’ నిబంధనలు శూన్యం
– రోజుకొక్కసారే శుభ్రం.. బస్టాండ్లలోనూ అంతే..
– అద్దె బస్సుల్లో అస్సలే పట్టింపులేదు
– జనాల్లో భయం భయం

లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్‌ ఆర్టీసీలో నిబంధనల అమలును మాత్రం ప్రభుత్వం గాలికొదిలేసింది. బస్సులు ప్రారంభమైన మొదట్లో భయంతో ఎవరూ ఎక్కకపోవడంతో ఖాళీగా నడిచిన బస్సులు ఇప్పుడు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ లాంటి నియమాల ఊసే లేదు. ఇటీవల ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి తనిఖీలు నిర్వహించగా, కోదాడ డిపో బస్సులో శానిటైజర్‌ లేదని ఓ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు చాలా బస్సుల్లో పాటించడం లేదు. అసలు బస్సునే శానిటైజ్‌ చేయడంలేదన్న విమర్శలున్నాయి..!

మఫిషల్‌ : కోవిడ్‌-19 వైరస్‌ విస్తరించకుండా బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌ ఆర్టీసీ కొన్ని నిబంధనలతో కంటైన్‌్‌మెంట్‌ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి అనుమతులిచ్చారు. కానీ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బస్సుల్లో ఎక్కడా నోటీసులు, స్టిక్కర్లు అంటించలేదు. కేవలం డిపోల్లో మాత్రమే సిబ్బంది కోసం పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ నిబంధనలపై అవగాహనే కల్పించడం లేదు. ఒకరినొకరు మీటరు దూరం ఉండేలా భౌతికదూరం పాటిస్తూ సీట్లో ఒక్కరే కూర్చోవాలని నిబంధన ఉన్నా కొన్ని రూట్లల్లో సీటుకు ముగ్గురు చొప్పున కూర్చుంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ బస్‌ స్టాండ్‌ ఉన్న కొద్దిపాటి షెడ్డులోనే ప్రయాణికులు ఉండటంతో భౌతిక దూరం కష్టంగా ఉంది. కొన్ని బస్సులైతే కిక్కిరిసిపోతున్నా అలాంటి ఆదేశాలేవీ లేవని అధికారులు చెప్పడం గమనార్హం.

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌, నీల్వాయి రూట్లలో ఒక్కో బస్సులో సుమారు 80 మంది వరకు ఒకేసారి ప్రయాణిస్తున్నారు. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిగి డిపో బస్సుల్లో కూడా సీటుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున కూర్చుంటున్నారు. ఇలా భౌతికదూరం పాటించకుండా అంతమంది ఒకే దగ్గర ఉండటంతో ఏ వైపు నుంచి కరోనా వ్యాపిస్తుందో తెలియక భయబ్రాంతులకు గురవుతు న్నారు. కరీంనగర్‌లోని కొన్ని డిపోల్లో ఇదే పరిస్థితి ఉంది. మాస్కులు ధరించాలనే నిబంధనను చూసి చూడనట్టు వ్యవహరిస్తుండం తో ప్రయాణికులు కొందరు మాస్క్‌లు లేకుండానే బస్సు ఎక్కుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, శంకరపల్లి డిపోల్లో గ్రామీణ ప్రజలు మాస్కులు లేకుండా బస్సేక్కుతున్నా అనుమతి స్తున్నారు. బస్టాండ్‌లో కూర్చున్న వారికి సైతం మాస్క్‌లు లేవు. షాద్‌నగర్‌, మహేశ్వరం, డిపోలకు వస్తున్న జిల్లా బస్సుల్లో మాత్రమే మాస్కులు ఉంటేనే ఎక్కనిస్తున్నారు.

ఉదయం.. రాత్రే..
ప్రతి ట్రిప్పును శానిటైజ్‌ చేయాలన్న నిబంధన ఉన్నా ఉదయం, సాయంత్రం మాత్రమే శానిటైజ్‌ చేస్తున్నారు. పైగా ఇలా చేయడం సాధ్యం కాదని అధికారులు పరోక్షంగా పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల సీట్లకు మాత్రమే స్ప్రే చేస్తున్నారు. కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలి, బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేశాకే టికెట్‌ ఇవ్వాలని ఉన్నా ఇవేమీ పాటించడం లేదు. బస్సుల్లో ప్రయాణికులకు ఇవ్వడానికి రోజుకు ఒక బాటిల్‌ (50, 100 ఎంఎల్‌) ఇస్తున్నారనీ, ఇది సరిపోకపోవడంతో దాన్నే జాగ్రత్తగా వాడుతున్నామనీ ఖమ్మం జిల్లా కండక్టర్లు చెబుతున్నారు. బస్సు బస్టాండ్‌ల్లో బయలుదేరుతున్న సమయంలోనే ప్రయాణికులకు శానిటైజర్లు ఇస్తున్నారనీ, ఆ తర్వాత గ్రామాల్లో ఎక్కే వారికి ఇవ్వడం లేదని గజ్వేల్‌, ఖమ్మం ప్రయాణికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక, అద్దె బస్సుల్లో శానిటైజర్‌తో శుభ్రం చేయడం లేదు. శానిటైజర్‌ కూడా ఇవ్వడం లేదని నార్కెట్‌పల్లి ప్రయాణికులు అంటున్నారు. శానిటైజర్‌ చేసుకోవాల్సిన బాధ్యత ప్రయివేటు యాజమాన్యాలకే అప్పగించడంతో వారు పట్టించుకోవడం లేదు.

భౌతిక దూరం పాటించడం లేదు
బస్సులు సీటుకు ఒక్కరే కూర్చోవాలని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. చిన్న సీటులో ఇద్దరు, పెద్ద సీటులో ముగ్గుర్ని కూర్చోబెడుతున్నారు. ఎవరికి ఏ రోగం ఉందో తెలీక బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సి వస్తోంది. ఇక మాస్కులు పెట్టుకోవాలని కండక్టర్టు చెబుతున్నా ప్రయాణికులు పెట్టుకోవడం లేదు. శానిటైజర్‌ పోయడం లేదు.
– హనుమంతరావు – ప్రయాణికుడు

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates