అమెరికాలో ప్రజాగ్రహం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఒబామా అధికారంలో ఉన్న సమయంలోనూ అమెరికా జాత్యహంకార దాడులు ఆగలేదు. కాబట్టి ఈ వర్ణవివక్ష రూపుమాపాలంటే దోపిడీకి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి, సోషలిజాన్ని సాధించాలి. ఆ దిశగా కార్మికవర్గం నేతత్వంలో పోరాటాలు ఉధతం కావాలి. ప్రస్తుత ప్రజా వెల్లువ అందుకు నాంది అవుతుందని ఆశిద్దాం.

నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను అత్యంత కిరాతకంగా పొట్టన బెట్టుకున్న జాత్యహంకార పోలీస్‌ అధికారి దుశ్చర్యపై అమెరికన్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతవారం రోజులుగా నిరసనలు, ఆందోళనలు, కర్ఫ్యూలు, నిర్బంధాలతో అగ్రరాజ్యం అట్టుడుకుతున్నది. మినెపొలిస్‌లో మొదలైన ఈ నిరసనలు ఫ్లాయిడ్‌ సొంత పట్టణమైన హూస్టన్‌, అట్లాంటా, మిచిగాన్‌ లూయిస్‌ విల్లీ, న్యూయార్క్‌, వాషింగ్టన్‌… ఇతర నగరాలు, పట్టణాలకు పాకాయి. అధ్యక్ష భవనానికి 300మీటర్ల దూరంలోని పురాతన సెయింట్‌ చర్చిని తగులబెట్టడం, వైట్‌హౌస్‌ తాత్కాలికంగా మూసివేయడం, మిలటరీని రంగంలోకి దింపే యత్నాలూ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నవి. యాభై ఏండ్ల క్రితం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యోదంతం తరువాత అమెరికాలో ఇంత పెద్దయెత్తున ప్రజాగ్రహం వ్యక్తం కావడం ఇదే మొదటిసారి. నిరసనలకు భయపడి అధ్యక్షుడు ట్రంప్‌ భూగర్భంలో నిర్మించుకున్న రక్షణ గృహం (బంకర్‌)లోకి వెళ్లి దాక్కోవడం అమెరికాకు పట్టిన దుస్థితిని తెలియజేస్తున్నది.

46ఏండ్ల ఆఫ్రో అమెరికన్‌ ఫ్లాయిడ్‌ సిగరెట్ల కొనుగోలులో నకిలీనోటు ఇచ్చాడనే ఒక చిన్న ఆరోపణపై నల్గురు పోలీసు అధికారులు ఆయనను చుట్టుముట్టి, కింద పడేసి మెడపై మోకాలితో తొమ్మిది నిముషాలసేపు గట్టిగా అదిమి చంపిన తీరు అమెరికన్‌ పోలీసుల ముఖ్యంగా శ్వేత జాతి అధికారుల ఆటవిక సంస్కృతికి దర్పణం పడుతోంది. పోలీసులు, నేషనల్‌ గార్డ్స్‌ సాగిస్తున్న అణచివేత చర్యలకు ఇంతవరకు అయిదుగురు చనిపోయారు. దాదాపు 50వేల మందిని జైలులో కుక్కారు. కొన్ని చోట్ల నిరసనకారులపైకి నేరుగా వాహనాలను పోనివ్వడం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం వంటి చర్యలతో ట్రంప్‌ ప్రభుత్వ నిరంకుశ పోకడలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. శరీర రంగును బట్టి వివక్ష చూపే నీచ సంస్కృతి 400ఏండ్ల నుంచి అమెరికా ను క్యాన్సర్‌లా పట్టి పీడిస్తున్నది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఇది మరింత వికృతరూపం దాల్చింది. నల్ల జాతీయుల పట్ల అడుగడుగునా వివక్ష చూపుతోంది. అమెరికా జనాభాలో 13.4శాతంగా ఉన్న ఆఫ్రో అమెరికన్లకు దేశ సంపదలో 5శాతం కన్నా తక్కువే దక్కింది. ఆఫ్రో అమెరికన్‌ మహిళల్లో ప్రసూతి మరణాల రేటు శ్వేత జాతీయులతో పోల్చితే మూడు రెట్లు అధికం. కోవిడ్‌-19 వల్ల లక్ష మందికి పైగా అమెరికన్లు చనిపోతే, వారిలో అత్యధికులు నల్లజాతీయులే.

అమెరికాలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలకు తోడు నిరుద్యోగం 1929 నాటి మహా మాంద్యం స్థాయికి చేరుకుంది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ట్రంప్‌ నేరపూరిత నిర్లక్ష్యం, అంతులేని యుద్ధాలు, గత అక్టోబరులో మినెపొలిస్‌లో పోలీసు అధికారుల ర్యాలీలో ట్రంప్‌ చేసిన విద్వేషపూరిత ప్రసంగం వీటన్నిటితో అమెరికాలో గూడు కట్టుకున్న అసమ్మతి ఫ్లాయిడ్‌ హత్యతో ఒక్కసారి అగ్నిపర్వతంలా బద్దలైంది. కరోనా భయాలు, కర్ఫ్యూలు, ఆంక్షలను వేటినీ లెక్క చేయకుండా ప్రజలు మరీ ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడం ట్రంప్‌ ప్రభుత్వాన్నీ, పాలక వర్గాలనూ గంగవెర్రులెత్తిస్తోంది.

ఫ్లాయిడ్‌ హత్యకు కారకులైన పోలీస్‌ అధికారులను శిక్షించడానికి బదులు రక్షించేపనిలో ట్రంప్‌ ఉన్నారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్న నిరసనకారుల్లోకి పోలీస్‌ ఏజెంట్లను, అరాచక మూకలను చొప్పించి హింసను ప్రేరేపిస్తూ, దానిని సాకుగా చూపి మరింత నిర్బంధాన్ని ప్రయోగించే నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారు. పిండి మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మినెసోటా రాష్ట్రంలో కార్మికులకు, పెద్దయెత్తున లాభాలు పోగేసుకోవాలని చూస్తున్న ద్రవ్యపెట్టుబడిదారులకు మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి. యువతలో ప్రశ్నించేతత్వం పెరుగుతోంది. ట్రంప్‌ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించడంలో ఇదే కీలకాంశం. ఫ్లాయిడ్‌ చనిపోవడానికి ముందు అన్న మాటలు ‘నా ఊపిరి ఆడడం లేదు’ (ఐ కాన్ట్‌ బ్రీత్‌) నే అస్త్రంగా చేసుకుని అన్ని జాతులకు చెందిన యువత పెద్దయెత్తున ఉద్యమిస్తుంటే వారిని అరాచకవాదులు, ఉగ్రవాదులని నిందిస్తున్నారు.

విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేయడంలో సిద్ధహస్తులైన అమెరికన్‌ పాలకవర్గాలు ఈ సంక్షోభాన్ని నల్ల జాతీయులకు, శ్వేత జాతీయులకు మధ్య ఘర్షణగా చిత్రీకరించాలని చూస్తున్నాయి. నల్ల జాతీయులను మరింత మందిని పోలీస్‌ అధికారులుగా నియమిస్తే, చట్టసభలకు మరింత మంది ఆఫ్రో అమెరికన్లకు ప్రాతినిధ్యం కల్పిస్తే ఈ వివక్ష పోతుందన్నట్టుగా వీరు ప్రచారం చేస్తున్నారు. అస్తిత్వవాద ధోరణులను రెచ్చగొడుతున్నారు. రిపబ్లికన్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న డెమొక్రాటిక్‌ పార్టీ కూడా ట్రంప్‌ చర్యలను గట్టిగా ఖండించలేని స్థితి.

డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న జో బిడెన్‌ చేసిన ప్రకటనలో ఫ్లాయిడ్‌ హత్య క్రూరమైనది అని ఖండించారే తప్ప ట్రంప్‌ను విమర్శిస్తూ ఒక్క మాట కూడా అనలేదు. శ్వేత జాతి ఓటర్లు ఎక్కడ దూరమవుతారోనన్న దాంతో ఆయన ఆచితూచి ప్రకటన చేశారు. అమెరికన్‌ ఫైనాన్షియల్‌ కులీనుల ప్రయోజనాలను కాపాడడంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు దొందూ దొందే. ఒబామా అధికారంలో ఉన్న సమయంలోనూ అమెరికా జాత్యహంకార దాడులు ఆగలేదు. కాబట్టి ఈ వర్ణవివక్ష రూపుమాపాలంటే దోపిడీకి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి, సోషలిజాన్ని సాధించాలి. ఆ దిశగా కార్మికవర్గం నేతృత్వంలో పోరాటాలు ఉధృతం కావాలి. ప్రస్తుత ప్రజా వెల్లువ అందుకు నాంది అవుతుందని ఆశిద్దాం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates