మన దగ్గరే ఎందుకిలా..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వేతనాల్లో కోతలపై సర్వత్రా విమర్శలు
– తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోనే కటింగ్‌
– ఏపీలో ఏప్రిల్‌, మే నెలలకు పూర్తి జీతాలు
– ధనిక రాష్ట్రంలో మాత్రం కోతలే కోతలు

హైదరాబాద్‌ : అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే నిజా నిజాలు, వాస్తవాలు, సత్యాలు బోధపడతాయంటారు పెద్దలు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లోని లోపాలు కూడా ఇదే రకంగా బయటపడుతున్నాయి. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఖజానా పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బంది వేతనాల్లో కోతలు.. షరా మామూలయ్యాయి. కానీ మార్చిలో సగం రోజులు అన్ని కార్యకలాపాలు కొనసాగాయి. మే 6 నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి. 19 నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి.

స్టాంపుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయి. అన్ని షాపులు తెరుచుకోగా, వివిధ కార్యాలయాలు నూటికి నూరు శాతం సిబ్బందితో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇంత జరిగినా మార్చిలో వేతనాల కోత, మేలోనూ జీతభత్యాలకు వాతపడింది. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కాబట్టి గవర్నమెంటుకు ఆదాయం రాలేదు. అందువల్ల ఆనెల్లో కోతల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా రెండు నెలల గురించే ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. తెలంగాణ కంటే ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు రాష్ట్రాలు సైతం ఉద్యోగులు, సిబ్బందికి నూటికి నూరు శాతం వేతనాలను చెల్లించాయి.

మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, రాజస్తాన్‌ మాత్రమే కోతలు పెట్టాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో కేవలం 30 శాతం మాత్రమే కట్‌ చేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.. మార్చిలో 50 శాతం కోత విధించింది.

కానీ ఏప్రిల్‌లో పూర్తిస్థాయి వేతనాలనిచ్చింది. మే మాసానికి సంబంధించి కూడా అదే రకమైన ఉత్తర్వులను విడుదల చేసింది. అందుకు భిన్నంగా తెలంగాణలో ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసు ఉద్యోగులకు 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం, పెన్షన్లలో 25 శాతం, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతున్నది. సాధారణ రోజుల్లో వీరందరి వేతనాలు, పెన్షన్లకు కలిపి నెలకు సగటున రూ.3,200 కోట్లు ఖర్చవుతుంది.

ప్రస్తుతం కోతలు కొనసాగుతున్నాయి కాబట్టి… రూ.1,500 కోట్లే వెచ్చిస్తున్నారు. దీంతోపాటు ఏప్రిల్‌, మే నెలల్లో పేదలకు ఆర్థిక సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.1,500 పంపిణీ చేసిన సర్కారు… జూన్‌ నుంచి ఆ సాయాన్ని ఆపేస్తామంటూ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ మొన్నటిదాకా చెప్పుకొచ్చిన ప్రభుత్వాధినేతలు…ఇప్పుడు అకస్మాత్తుగా వేతనాలకు డబ్బుల్లేవంటూ ఎందుకు చేతులెత్తేశారంటూ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులను అడగ్గా… ‘ఆంధ్రా నుంచి విడిపోయినప్పుడు రూ.60 వేల కోట్ల అప్పు తెలంగాణ వాటాగా వచ్చింది.

అలాంటప్పుడు మనది ధనిక రాష్ట్రమెలా అవుతుంది…?’ అంటూ ఎదురు ప్రశ్నించటం గమనార్హం. ఈ విషయంపై ఐక్య వేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావా రవి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాల వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. కేవలం రెణ్నెల్లపాటు కార్యకలాపాలు నిలిచిపోతేనే జీతాలకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందా..? అని ఆయన ప్రశ్నించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates