కూటి కోసం ఇక వలసపోం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– చావో.. బతుకో ఇక్కడే
– మధ్యప్రదేశ్‌కు తిరిగి వచ్చిన 54శాతం మంది కార్మికుల మనోగతం
– పూటగడిచేదెలా? : 90శాతం మందిలో ఆందోళన

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ తర్వాత… దేశవ్యాప్తంగా వలసకార్మికులు తిరుగు ప్రయాణమయ్యారు..ఇప్పటికీ కొందరు సొంతూర్లకు చేరగా..భారీ సంఖ్యలో ఆయా ప్రాంతాలకు చేరుకోవటానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొనిఉండగా… రవాణా సౌకర్యం లేకపోయినా.. కరోనా కంటే ఆకలి మమ్మల్ని చంపేసేలా ఉందంటూ.. కాలిబాట పట్టారు. సొంతూర్లో.. గంజితాగైనా బతకొచ్చని భావించి పట్నం వదలారు.. పల్లెబాట పట్టారు. ఈ విధంగా లాక్‌డౌన్‌ సమయంలో మధ్యప్రదేశ్‌కు తిరిగి వచ్చిన వలసకార్మికుల్లో దాదాపు 90శాతం మందిని ఇప్పుడు ఉపాధి సమస్య భయపెడుతున్నది. అయితే పొట్టకూటి కోసం తిరిగి వలస వెళ్లేందుకు మాత్రం 54శాతం మంది జనం ఇష్టపడటంలేదు. రాష్ట్రానికి తిరిగివచ్చిన వలసకార్మికులపై వికాస్‌ సంవాద్‌ అనే న్యాయవాద గ్రూపునకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని పది జిల్లాలు రేవా, సాత్నా, పన్నా, ఉమారియా, మాండ్లా, ఛత్తర్‌పూర్‌, శివపురి, విదిషా, షాడోల్‌, నివారిలో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ 30 మంది వలసకార్మికులను ప్రత్యక్షంగా కలిసిన ఎన్జీఓ బృందం ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వే ప్రకారం.. దాదాపు 80శాతం మంది ఉద్యోగాల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోతామన్న భయాందోళనను వ్యక్తంచేశారు. వీరిలో చాలా మందికి రేషన్‌కార్డులుకూడా లేవని తేలింది. అయితే ఉపాధి కోసం ఇక వలస వెళ్ళబోమని వారు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత తాము ఎదుర్కొన్న ఆర్థిక అభద్రత, మనో వేదన కారణంగా తిరిగి వలస వెళ్లేందుకు 54.6 శాతం మంది ఇష్టపడటంలేదు. కోవిడ్‌-19 తగ్గుముఖంపట్టి.. సాధారణ స్థితి చేరుకుంటే తిరిగి పనికి వెళతారా అంటే… సమయానుకూలంగా ఆలోచిస్తామని 24.5శాతం మంది తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే తిరిగి వెళతామని 21శాతం మంది ప్రజలు తెలిపారు. 13.21 లక్షల మంది వలసకార్మికులు రాష్ట్రానికి తిరిగివచ్చినట్టు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇప్పుడు వారంతా ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.

’95శాతం మంది కార్మికుల కూలీ రూ.500 కన్నా తక్కువే’
45.5శాతం మంది వలసకార్మికులు తమ కుటుంబాలతో కలిసి వలస వెళ్ళారు. మిగిలిన 54.5శాతం మంది ఒంటరిగానే వెళ్ళారని నివేదిక పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగం, వ్యాపారాలు, కర్మాగారాలు / పరిశ్రమల్లో పనిచేసేవారు. తాము పనిచేస్తున్న సమయంలో ఎలాంటి సెలవులు ఇవ్వటంలేదని 81శాతం మంది చెప్పారు. పనికి వెళితే. వేతనం.. లేకపోతే లేదని.. వచ్చే అరకొర వేతనంతో రోజులు వెళ్ళదీసేవారమని వలసకార్మికులు తెలిపారు. అంతేకాదు, 95శాతం మందికి రోజుకు రూ.500లకన్నా తక్కువ వేతనం పొందుతున్నారు.
కొందరికి రోజువారీ, మరికొందరికి వారం లేదా నెల వారీ వేతనం చెల్లించేవారు. ఆకస్మిక లాక్‌డౌన్‌తో చేసిన పనికి కూడా వేతనం రాలేదని కొందరు చెప్పగా, పాక్షికంగా మాత్రమే చెల్లించినట్టు మరికొందరు వలసకార్మికులు వాపోయారు.

చేతిలో రూ.100 కన్నా తక్కువతో తిరిగొచ్చారు…
తిరిగి వచ్చేటప్పుడు చేతిలో కేవలం రూ.100 కన్నా తక్కువ నగదుతో తిరిగివచ్చినవారు 23 శాతం మంది. అలాగే ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా తిరిగి వచ్చినవారు 7శాతం మందిగా నివేదిక పేర్కొంది. 25.2శాతం మంది వలసకార్మికులు రూ.101 నుంచి 500 వరకూ నగదుతో తిరిగివచ్చారు. 18.1శాతం మందికి రూ.500 నుంచి 1000 వరకూ, 18.1 శాతం మంది వద్ద రూ.500 నుంచి రూ.1000 వరకూ నగదు ఉన్నట్టు సర్వే పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సర్వే నిర్వహించి వలసకార్మికులను ఆదుకోవాలని సర్వేకు నేతృత్వం వహించిన వికాస్‌ సంవాద్‌ బృంద నేత జైన్‌ కోరారు. వారికి ప్రభుత్వం తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ అత్యవసర పరిస్థితి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద వలసకార్మికులకు పని కల్పించాలని కోరారు.

కరోనా కన్నా బీజేపీకి రాజకీయమే మిన్న…
మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలోనే బీజేపీ అధికారంలోకి రావటానికి ఎన్నో అడ్డదారులు వెతికింది. జనం ప్రాణాలు పోతున్నా..వారిని పట్టించుకోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ రిమోట్‌తో కమల్‌నాధ్‌ సర్కార్‌ను కూల్చింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారపీఠమెక్కినాక…కరోనా కేసులు..మరణాలు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వలసవచ్చిన కార్మికులకు బీజేపీ సర్కార్‌ పట్టించుకుంటుందా..లేదా..అనే అనుమానాలు వలసకార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates