అమ్మకాలపై.. కరోనా కాటు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పండ్లు, కూరగాయలపై తీవ్ర ప్రభావం
– రూ. 2,000 కోట్లకు పైగా నష్టం
– రవాణా, నిల్వ సౌకర్యం లేక ఇబ్బందులు
– ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్‌

కరోనా ఎఫెక్టు పంటల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. నల్లగొండ జిల్లాలో కోతకు సిద్ధమయ్యే దశలో కరోనా వల్ల మార్కెటింగ్‌ సౌకర్యం లేక వేల ఎకరాల్లో బత్తాయి పండించిన రైతులు నష్టాలను చవి చూసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంట చేతికొచ్చిన సమయంలో కోసేందుకు కూలీలు రాక, కోసినా రవాణా చేసే వీలులేక పంటంతా పొలాల్లోనే కుళ్లిపోయింది. ఇలా మార్కెట్లు మూతపడడం, రవాణా సౌకర్యం లేక పోవడంతో పండ్లు, కూరగాయలు పండించిన రైతుల మార్కెటింగ్‌ కష్టాలు అంతా ఇంతా గాదు. అమ్ముకోలేక, నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలు లేక కనీస పెట్టుబడి రాక పంటలను పొలాల్లో వదిలేసారు. మార్కెటింగ్‌ సౌకర్యంలేక రాష్ట్రంలో రూ.2,000 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లింది.ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రాష్ట్రంలో సుమారు 4.42 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 4 లక్షల ఎకరాల్లో కూరగాయలు, 2లక్షల ఎకరాల్లో మిర్చి పండిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి, కరీంనగర్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలో మామిడి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బొప్పాయి తోటలు, అదిలాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో టమాట, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో మిర్చి అధికంగా సాగవుతుంది. ప్రతి ఏటా పండ్లు, కూరగాయలు కలిపి 50 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ లేక పోవడంతో హార్టికల్చర్‌ రంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. డిల్లీలోని ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ పండ్లు, కూరగాయలకు ఆసియాలోనే అతి పెద్ద విక్రయశాల. మార్చి నెలలో మూతపడడం వల్ల రాష్ట్రం నుంచి ఎగుమతులు పూర్తిగా స్తంబించి పోయాయి. జగిత్యాల నుంచి దేశ విదేశాలకు ఎగుమతయ్యే మామిడికాయల రవాణా పూర్తిగా నిలిచి పోయింది.

ఇది ఏప్రిల్‌లో మార్కెట్‌ను తెరిచినా కాయలు కోయడానికి కూలీల కొరత, రవాణా లేక ఈ సారి సగం ఉత్పతులు కూడా ఎగుమతి కాలేదు. దాంతో తోటల యజమానులు స్వయంగా వీధుల్లో అమ్ముకుంటున్నారు. ఆరు నెలల క్రితం కిలో రూ.70 నుంచి రూ.80 పలికిన టమాట ధరప్రస్తుతం హౌల్‌సేల్‌లో రెండు రూపాయలే పలుకు తుంది. పంట కోసం పెట్టిన పెట్టుబడులు పక్కన పెడితే.. రవాణా చార్జీలు కూడా రావడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి టమాట వెల్లువెత్తడంతో ధరలు అమాంతం పడిపోయాయి. కిలో ధర రూ.2 నుంచి రూ.3కు మించి రావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసి చివరకు కొందరు రైతులు వాటిని మార్కెట్లలోనే పారబోసిపోయిస సంఘటనలు అనేకం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొద్దికొద్దిగా సడలి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ డిమాండ్‌ కంటే ఎక్కువ పంట మార్కెట్లకు తరలిరావడంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు.

లాక్‌డౌన్‌కు ముందు రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 20 వేలు పలికిన మిర్చి ఇప్పుడు రూ. 13 వేలకు పడిపోయింది. పసుపు పంట ధర సైతం ఈ సీజన్లో రూ. 4,500 కనిష్టానికి పడిపోయింది. ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేని పండ్లు, కూరగాయలు, మిర్చి తదితర పంటలు కరోనా వల్ల నష్టాలను చవి చూస్తున్నాయి.

కోల్డ్‌ సోరేజీల కొరత
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, పసు పు మిర్చి పంటలు సాగవుతున్నాయి. ఏటా 50 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే అందులో 10 శాతం కూడా నిల్వ చేసుకునే సదుపాయం లేదు. 300 వరకు ఉన్న కోల్డ్‌ స్టోరేజీల్లో 6లక్షల టన్నుల వరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ధరలు లేని సమయంలో పంటను నిల్వ చేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

దాంతో రైతులు ఎంతొస్తే అంత చాలు అన్నట్టు తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. పంటలు డిమాండ్‌ ఉన్నప్పుడు అమ్ముకునే విధంగా రాష్ట్రంలో మరిన్ని కోల్డ్‌ స్టోరేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates